సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 
సామెత -169; ఆలికి గంజి వొయ్యనోడు ఆచారం చెప్పె-తల్లికి గంజి వొయ్యనోడు తగవు చెప్పె
*****
"గిదేం ఇచ్ఛింత్రం అవ్వా! ఎవలికన్న పెద్దిర్కం ఇయ్యాలంటే గాళ్ళు దానికి సరైనోళ్ళా కాదా జర్రన్న ఇశారించొద్దా? తప్పులన్ని తవఁ దెగ్గరే వెట్కున్న గస్మంటోళ్ళని గీ పంచాతికి  పెద్దల్ని జేయడం నువ్వేమన్కున్న సరేగని నాకైతే మనసొప్పడం లేదవ్వా!"
ఏంది శెల్లె? ఏం పంచాతి తెల్వకనే పాయె.ఏందో గీ నడ్మల ఇంట్లె పన్లతోనె పొద్దు గడుత్తోంది.బయిటి పెపంచకంల ఏమైపోతుందో  పట్టిచ్చుకునే తీరికె లేకుండయ్యింది. గా ముచ్చెటి ఏందో శెప్పు శెల్లె!"
 "గదేనవ్వా!అంకయ్య బావ కొడుక్కి పెళ్ళమంటే అస్సల్కి పడట్లేదు. ఎందుకంటెనంట "గా పొల్లకి ఆశారం తెల్వదు మన్ను దెల్వదు.ఇగురం సగురం లేని పొల్లని అంటగట్టిండ్రు నేనేలు కోను' అంటుండంట.
గట్ల కొడుకంటుంటే అయ్య అంకయ్య బావ ఏం చేత్తుండు.ఇంట్లె పంచాతి బజారెక్కే దనుక ఎవడైన సూస్కుంటడా? గిప్పుడు గా పొల్ల అమ్మ నాయిన గా ఇగురం సగురం ముచ్చటేందో పంచాతి పెట్టి అల్లుడు సంగతి తేల్చాలని అంటుండంట."
"అవునా శెల్లె! అంజమ్మక్క మొన్నోపాలి ఇంటికొచ్చినప్పుడు కూజాడ శెప్పింది గని గిట్ల బజార్ల బడ్తరనుకోలె. గింతకీ తీర్మానం జెప్పే పెద్దమడిషి ఎవరు శెల్లే?
 ఆ పెద్ద మడిషి ఎవలో కాదు నారయ్య మావ. గందుకే నాకు మస్తు కోపమొత్తున్నది. గాయన ఎస్మంటోడో ఊల్లె అందర్కీ తెలుసు.  పొద్దుం లేత్తె పెళ్ళాన్ని రాశిరంపాన బెట్టెటోడు.ఇంట్లె పెళ్ళాం తిన్నదా పన్నదా? బయిటికి పనికెల్లేది కాదాయె. తిండి తిప్పలు ఎట్ల అనే సోయి లేనోడు.ఊఁఅంటే  కాన్ దాన్ గురిచ్చి గొప్పలు శెప్పేటోడు. గాయిన గీ పంచాతి చెప్పే పెద్ద మడిషంట.గాయన యవ్వారం ఊల్లె దెల్వనోళ్ళు లేరుగా అవ్వా?"
అవును శెల్లే! గిదేదో సామెత లెక్క ఉంది"ఆలికి గంజి పోయ్యనోడు ఆచారం చెప్పె-తల్లికి గంజి పొయ్యనోడు తగవు జెప్పె " అన్నట్టు ఉంది."
బలేగ జెప్పినవవ్వా? ఎన్క బజార్ల ఎల్లయ్య మావ పెళ్ళాం కోటమ్మత్త పరిత్తితి తెల్సు గద. మావ ఉన్నన్నాళ్ళు ఎట్లున్నరో ఏం దిన్నరో గుట్టగ బతికిండ్రు ఏ కొడ్కు మీద గీడిట్ల గాడిట్లని షికాయితి శెప్పలే.గాళ్ళ తప్పుల్ని కడ్పుల దాసుకుండ్రు.మావ కాలం జేసిన కానించి అత్త పరిత్తితి అగమ్మగోచ్రమైంది.
 బుక్కెడు బువ్వ బెట్టక సంపుతుండ్రు.బోలెడు ఆత్తి సంపాయించి పెట్టిన గా తల్లికి గుక్కెడు గంజి పొయ్యడానికి నువ్వా నేనా అని వంతులాడ్తుండ్రు. గీళ్ళసలు మడుసులేనా అవ్వా? నేనే సలా ఇచ్చిన పంచాతి బెట్టి తేల్సుకోమన్న.అత్త ఉండే పాతిల్లు సుట్టూ తలం బోలెడుంది.గదిప్పుడు మంచి గిరాకీ పల్కుతుంది.గదమ్మితే గా అత్త బత్కినన్నాళ్ళు తిండికి బట్టకి లోటు లేకుండా పనోల్లని బెట్కొని బతకొచ్చని పంచాతి బెట్టిత్తే గజ్జెప్పేటోడేమన్న నియతున్నోడా అంటే గాయిన సుత తల్లికి కూడు బెట్టక ఏడిపిత్తున్నోడే అవ్వా!"
"గస్మంటోళ్ళను జూసే శెల్లె!గిట్లాంటి సామెతలు పుట్టేది. "గియ్యాల్నే గద గాళ్ళ పంచాతీలు ఏమైతయో రచ్చబండ కాడికి పోదాం.తేడా జెప్తే మనం కల్గిచ్చుకుని దుల్పుదాం" అన్న అవ్వ మాటల్కి సరే నని తలూపింది శెల్లె శాంతమ్మ.
గదండీ సంగతి! ఆలికి గంజివొయ్యనోడు ఆచారం జెప్పె -తల్లికి గంజివొయ్యనోడు తగవు జెప్పె " అంటే గిదే మరి.

కామెంట్‌లు