చందమామ రావే
జాబిల్లి రావే అంటూ పాడి
అమ్మ నీచేత గోరుముద్దలు
తినిపించేది ఎందుకు..?
ఆ అందాల చందమామ
ఏరోజు ఈ నేలకు దిగిరాదే..!
రేపు నీవే
అంతరిక్ష యాత్ర చేయాలని...
ఆ అందాల చందమామను
అందుకోవాలని...
విశ్వాన్ని శోధించాలని...
అంతరిక్షాన్ని అన్వేషించాలని...
నీ విజ్ఞానాన్ని
ప్రపంచానికి పంచాలని...
నీవు విశ్వ విజేతగా
ఖండాంతర ఖ్యాతిని
ఆర్జించాలన్నదే
అమ్మ చిన్ని ఆశ
ఆ పాటలోని అంతరార్థం
ఆశపడకు మిత్రమా
అలలు ఆగే రోజు వస్తుందని...
ఆశపడకు మిత్రమా
అమావాస్య రోజున
ఆ చంద్రున్ని తిలకించాలని...
ఆశపడకు మిత్రమా
నిశ్చలమైన నీటిలో చిన్న రాయి
విసిరి స్పష్టమైన అందమైన
నీ ప్రతిబింబాన్ని దర్శించాలని...
అంతా ఒక మాయ అంతా నీ భ్రమ
రేపు నీ జీవితం సైతమింతే అదొక వింతే
నీ అందమైన జీవితంలో
నీవు తిరిగి పొందలేనిది
నేలమట్టిలో రాలిన నేతిచుక్క...
పాలరాతిపై పడిన పాలచుక్క...
గడిచిన కరిగిన క్షణ కాలం...
అదే ప్రకృతి మాయాజాలం...
గడిచిపోయిన
నీ జీవితము కూడా అంతే
గతం గడిచిన గాఢాంధకారం...
వర్తమానం అందిన ఒక వరం...
భవిష్యత్తు నేడు నీకుఅందని
రేపు చెందని ఓ బంగారు నిధి...
అందుకే ఓ మిత్రమా..!
నేటి రోజున ప్రతిక్షణాన్ని
సద్వినియోగం చేసుకో
సంతృప్తి చెందు...
దుర్వినియోగం చేసుకొని
దుఃఖపడేవెందుకు...?
రేపు నీది కాదు
ఈ క్షణమే నీది
మరుక్షణం మనది కాదు
మరుక్షణంలో మరలిరాని
లోకాలకు తరలిపోవాలేమో...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి