శ్రీరామనవమి పండుగ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం. చైత్ర మాసము శుక్ల పక్షం నవమి తిథి నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. వసంత రుతువులో వచ్చే ఈ పండుగ అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ఒక నిదర్శనం. లోక రక్షణ కోసం సాక్షాత్తు ఆ మహావిష్ణువు సకల గుణాలూ కలిగిన ఒక సామాన్య మానవుడిగా అవతరించిన పవిత్ర దినం ఇది. రాముడి జీవితం ద్వారా ధర్మాన్ని ఎలా ఆచరించాలో లోకానికి చాటిచెప్పడమే ఈ అవతార ముఖ్య ఉద్దేశం. ఈ రోజున దేశవ్యాప్తంగా భక్తులు రామాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇల్లు తోరణాలతో అలంకరించబడి రామ నామ స్మరణతో ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీరాముడికి సీతమ్మకు జరిగే కళ్యాణోత్సవం కనుల పండుగగా ఉంటుంది. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలలో ఈ కళ్యాణాన్ని ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం అంటే కేవలం ఒక వివాహం మాత్రమే కాదు అది ప్రకృతి పురుషుల కలయికకు లోక శాంతికి సంకేతం. భక్తులు తమ ఇళ్లలో కూడా సీతారాముల విగ్రహాలకు పూజలు చేసి రామాయణ పారాయణం చేస్తారు.
శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రసాదాలుగా స్వీకరించడం ఒక ముఖ్యమైన ఆచారం. వసంత కాలంలో వచ్చే ఎండల వల్ల కలిగే శారీరక తాపాన్ని తగ్గించడానికి మిరియాలు బెల్లంతో చేసిన పానకం ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాకుండా గొప్ప ఆరోగ్య సూత్రం కూడా. చైత్ర నవరాత్రులు ఈ రోజుతో పూర్తవుతాయి. చాలా మంది భక్తులు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి నవమి నాడు రాముడిని అర్చించి తమ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికంగా చూస్తే రాముడు 'మర్యాదా పురుషోత్తముడు'. ఆయన తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొని ధర్మం వైపు ఎలా నిలబడాలి అనేది నిరూపించారు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లడం ద్వారా పితృవాక్య పరిపాలన వైభవాన్ని చాటారు. సీతాన్వేషణ రావణ సంహారం ద్వారా అసాధ్యమైన పనులను కూడా భగవంతుని నామ బలంతో సాధించవచ్చని లోకానికి వెల్లడించారు. రాముడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు అందుకే 'రామరాజ్యం' అనేది నేటికీ ఆదర్శ పరిపాలనకు కొలమానంగా నిలిచింది. ప్రతి మనిషిలో ఉన్న రామ తత్వాన్ని మేల్కొల్పడమే ఈ పండుగ ఇచ్చే నిజమైన సందేశం.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శ్రీరామనవమిని రకరకాలుగా జరుపుకుంటారు. అయోధ్యలో ఈ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాముడిని దర్శించుకుంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సీతారాముల కళ్యాణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున భక్తులు రామదాసు కీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. రాముడి జన్మదినం కావడంతో అనేక చోట్ల శోభాయాత్రలు నిర్వహిస్తారు. రామ నామము సకల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. తారక మంత్రంగా పిలువబడే రామ నామాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధర్మ రక్షణ కోసం రాముడు అడవులలో పద్నాలుగు ఏళ్లు గడిపి కష్టాలను అనుభవించిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. రాముడు ఏక పత్నీ వ్రతుడిగా నిలిచి భార్య పట్ల ఉండవలసిన అనురాగాన్ని గౌరవాన్ని చాటారు. హనుమంతుని వంటి భక్తుడిని ఆదరించడం ద్వారా స్వామి తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు.
శ్రీరామనవమి పర్వదినం కేవలం ఒక మతపరమైన వేడుక కాదు అది సామాజిక ఐక్యతకు ప్రతీక. ప్రజలందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం వల్ల సోదర భావం పెంపొందుతుంది. చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ పట్టాభిషేకం కూడా జరిగిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున పట్టాభిషేక ఘట్టాన్ని చదివినా విన్నా శుభం కలుగుతుందని నమ్ముతారు. రాముడు ధర్మం కోసమే బతికారు ధర్మం కోసమే పోరాడారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు మునులు ఋషుల రక్షణ కోసం రాక్షసులను సంహరించారు. విభీషణుడికి లంకారాజ్యాన్ని అప్పగించడం ద్వారా తన నిస్వార్థ గుణాన్ని చాటుకున్నారు. నేటి కాలంలో కూడా రామరాజ్య స్థాపన జరగాలంటే ప్రతి ఒక్కరూ రామాయణంలోని ఆదర్శాలను పాటించాలి. సత్యం మాట్లాడటం అహింసను పాటించడం ఇతరులకు సహాయం చేయడం వంటి గుణాలు అలవరుచుకోవాలి. శ్రీరామ నవమి మనలో దైవ చింతనను పెంచి సన్మార్గంలో నడిపిస్తుంది. గంగా యమునా సరస్వతి నదుల తీరాలలో భక్తులు గుంపులుగా చేరి రామ కథను వింటూ తరిస్తారు. రామ నామం లేని చోటు ఈ జగత్తులో లేదని భక్తుల విశ్వాసం. ఆ సుందర రూపం ఆ దివ్య నామం నిరంతరం స్మరించదగినవి. ఈ పవిత్ర దినం మన సంస్కృతిలో ఒక భాగమై నిలిచిపోయింది. రాముని ఆశయాలు నిత్య నూతనాలు ఎప్పటికీ ఆచరణీయాలు. రామాయణ మహాకావ్యం మనకు జీనవ మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటుంది. ప్రతి ఏటా వచ్చే ఈ నవమి మనకు కొత్త ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తికి రాముడే నిలువెత్తు సాక్ష్యం.
శ్రీరామనవమి ప్రాముఖ్యత:-డా:సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి