సుప్రభాత కవిత : - బృంద
వినీల గగనమే వేదిక కాగా 
సుదూర తీరాల నుండి 
తరలి వచ్చు  దైవమునకు 
విహగాళి  సుస్వరాల స్వాగతం

ఎద కనుమల  ఉదయించే 
ఉత్సాహపు ఊహలతో 
మది నిండిన  మమతల రాగం 
చేసే సడిలేని సందడి

వేకువ నాదానుసంధానముతో 
వికాస భరిత ఉత్తేజముగా 
వేడుకగా తోచును జగమే 
వెలుగుల వానలో...

అందాలెన్నో చిందే 
భువి సీమలో.....
వెలుతురు పరచిన 
మెరుపులు జిలుగులే అన్నీ...

అలలే మువ్వలుగా 
ఆడి నర్తించగా కడలి 
జలతారు శాలువతో 
దినకరుడి  సన్మానం

ఊటగ ఊరే ఊహలతో 
పాటగ మలచిన మాటలతో 
చాటి చెప్పగా  అది మారె ఇలా 
తేట తెలుగు తేనెవాకగా!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు