దేవుడి సృష్టిలో ఏదీ వృధా కాదు: - - యామిజాల జగదీశ్
 అదొక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ అన్ని వయోవర్గాల వారూ ఆ గురువుగారి దగ్గర చదువుకుంటున్నారు. ఆ గురువు తనకు వీలున్నప్పుడల్లా తన వద్దకు వచ్చే వారికి అవీ ఇవీ బోధిస్తుంటారు. అడిగిన వాటికి జవాబులు చెప్తుంటారు. విసుగనేది ఎరగరు.
ఓ రోజు తమ ఆవరణలోని చెట్టుకింద గుమికూడిన పిల్లలకు ఆయన పాఠాలు చెప్తున్నారు. ముందు వరసలో ఉన్న ఓ కుర్రాడు పాఠం వినకుండా చిలిపిచేష్టలు చేస్తున్నాడు. తన దగ్గరున్న నోటుబుక్కులో ఏదో వంకర టింకర గీతలు గీస్తూ పక్కనున్న వాడితో ఏదో వాగుతున్నాడు. అది గురువుగారి కంట పడింది.
దాంతో ఆ కుర్రాడిపై గురువుగారికి ఎందుకో ఎప్పుడూ రాని కోపం వచ్చింది. ఆవేశపడ్డారు. ఆ కుర్రాడిని లేచి నిల్చోమన్నారు. కుర్రాడు ఠకీమని లేచి నిల్చున్నాడు. చేతులు కట్టుకున్నాడు.
గురువుగారు వాడిని తిట్టడం మొదలుపెట్టారు.
“ఓరీ మూర్ఖుడా...నువ్వు బాగుపడవు. ముందు వరుసలో కూర్చున్న నీకు నేను చెప్పే పాఠం వినాలనే జ్ఞానం లేదా...నీకెంత ధైర్యం...ఇప్పుడే ఇలా ఉంటే నువ్వేం దార్లోకొస్తావు... నువ్వొట్టి మూర్ఖుడివి. నీకు చెప్పగలవారెవ్వరు....నేను చెప్పేదే నీకు నచ్చకుంటే ఇంకెవరు ఏది చెప్పినా నీ బుర్రకేం ఎక్కుతుందని...పో ముందు నా కళ్ళెదుట నిలబడకు...వెళ్ళు...కనిపించకు... “ అని అనాలనుకున్న నాలుగు మాటలూ గట్టిగా అనేసారు.
గురువుగారు చెప్పిన మాటలన్నీ విన్న ఆ కుర్రాడు ఆయన వంక తదేకంగా చూశాడు.
“గురువుగారూ, మీరు పొమ్మన్నారనే ఇక్కడి నుంచి పోతున్నాను. కానీ నేను మీరు చెప్పినంత మూర్ఖుడిని కాను. అంతేకాదు, బాగుపడనన్నారు...కానీ నేను బాగుపడతాను. బాగుంటాను. ఇందులో నాకు ఎలాటి అనుమానమూ లేదు.... “ అన్నాడు.
“ఎలా చెప్తున్నావా మాట... “
అప్పుడు ఆ కుర్రాడు ఇలా అన్నాడు –
“నన్ను పుట్టించింది ఆ భగవంతుడు. భగవంతుడెప్పుడూ అనవసరమైనవి సృష్టించడు. అతని సృష్టిలో అక్కర్లేనిదంటూ ఉండవు. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. కారణముంటుంది అని నమ్ముతా“ నని ధీమాగా చెప్పాడు.
అంతట గురువుగారు ఆశ్చర్యపోయారు. కుర్రాడి మాటలకు విస్తుపోయారు.
“నేనేదో నాకేదో తెలుసునని ఎన్నో చెప్తుంటాను. కానీ నువ్వు ఈ రోజు నేనింతవరకూ గ్రహించని విషయాన్ని చెప్పావు. నువ్వీ విషయంలోనాకు గురువువే“ అని అన్నారు.


 

కామెంట్‌లు