సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -178; ఆస్తి మూరెడు ఆశ బారెడు
*****
"శిన్నమెత్తుంటె శీలమండలెత్తు ఎగిరిండంట ఎన్కటికెవడో" గట్లనే ఉన్నది గాల్ల పోకడ సూత్తుంటే... గింత ఆశనా అవ్వా! కట్నాలు బొయ్యినయ్.ఆడవిల్లలు దొరకట్లే.ఎదురిచ్చి కొనుక్కుంటున్నరు అని ఎవలో అనంగ యిన్న. మరి గిదేందో గిట్ల బేరమాడబట్టిరి సంతల పశువు లెక్క"
"సామెతతో పోల్శి వాటంగనే తిడ్తున్నవ్ ఎవల్ని శెల్లే?"
 గదే అవ్వా! సుబ్బారావు బిడ్డకి ఓ సంవందం వొచ్చిందంట.గా పెండ్లి పిలగాడు  ఎందులోనో సర్కారు దాంట్లెనే కొల్వు జేత్తున్నడంట."
 అవునా  శెల్లే! మరింకేం సంవందం ఖాయమైనట్టేనా?
 అయ్యింది గని అవ్వా! ఆళ్ళ సంవందమేవోగని . నాకైతే మా బాగ అనుభవాలు తెలుత్తున్నయి.
 అవును శెల్లె! గిస్మంటి ఆటికి ఎల్తే శాన్నే తెలుత్తయి."
 "ఆళ్ళు అడిగిన కట్నం యిని నాకైతే మూర్శబోయినంత పనైందన్కో. లచ్చల కట్నమంట.పైంగ పెట్టుబోతల కాడ అస్సలు తగ్గొద్దట."
"అవునా శెల్లె! ఆయిన గని అమ్మాయి సుత బాగనే సద్వింది అన్నరు గదా! గా ముచ్చట రాలేదా?"
"ఎందుకు రాలేదవ్వా! వొచ్చింది. సద్వింది గని ఉజ్జోగం లేదు గద. మా వోడు ఇప్పటికే సర్కారి నౌకర్ల ఉన్నడు. గీ రోజుల్ల సర్కారి నౌకరి దొరకడం మామూలు యిష్యమా! కోట్లకి కోట్లు కట్నమిత్తమని వొత్తుండ్రు. ఏదో తెల్శిన సంవందమని గిటు మొగ్గు సూపినం" అన్నరవ్వా!"
 మరి ఆడిపిల్లోల్లని ఇంతింత అడ్గుతుండ్రు గద. గాల్లకి ఎంత ఆత్తి వుంది శెల్లే! ఇల్లూ ఆకిలి, శేను శెలక బాగనే ఉన్నట్టుంది గదా?"
 అగ్గో అవ్వా! గక్కన్నే నువ్వు తప్పుల కాలేశినవ్. గా పిలగాడు శేత్తున్న ఉజ్జోగం తప్పిడిసి ఏ ఆత్తిపాత్తులు లేవు. 
 "గిదేంది ఆడపిల్లోల్లని అంతంత కట్నం, పెట్టువోతలు అడ్గినప్పుడు.మగపిల్లోల్లకు సుత అంతో ఇంతో ఉండాలని ఆడవిల్లోల్లకి ఉంటుంది గద! అంటే ఆడివిల్లల్ని గన్నందుకు ఇల్లూ ఆకిలే గాదు ఆత్తిపాత్తులు సుత సంపాయించుకొని పెట్టుకోవాలె. పైంగ మంచి సద్వులు సదివిచ్చాలె.
 "బాగనే ఉంది కత. "ఆస్తి మూరెడు ఆశ బారెడు" అంటే గిదే మరి."
 "అవునవ్వా! గాళ్ళకి  సొంతిల్లు సుత లేదు.పేటల కిరాయి ఇంట్లె ఉంటుర్రట. పైంగ పెండ్లి విల్లోల్లకి ఏడేడ ఏయే ఆత్తులున్నయి. పిల్లకు లగ్గంల గీ కట్నం ఇచ్చుడేనా! రేప్రేపు పంచేటివి ఏం లెవ్వా!" అని అన్నరు.
 "ఎన్ని సట్టాలు జేశినా ఇలం పలం ఏవుందవ్వా!"దున్నపోతు మీద వాన కుర్శినట్టే" తీస్కునేటోళ్ళకు గట్లెందుకు తీస్కోవాలె అని లేదు ఇచ్చేటోళ్ళకి కట్నం ఇయ్యనంటే సంవందాలు రాకుంటైతయి. పెండ్లి గాకుండా గుండెల మీద కుంపట్ల దినాం బాద పడాలె. అప్పో సప్పో జేసి లగ్గం జెయ్యాలనే  ఆరాటం."
 కట్నం కోశీష్ శేస్కుంట పిల్ల అంత సద్వింది గద రేపో మాపో నౌకరొత్తె శెయ్యదా ఏంది అన్నం అవ్వా!"
 "గాళ్ళు నవ్వుకుంట గిప్పుడైతే శెయ్యట్లేదు గద రేపటి సంగతి రేపే అన్నరవ్వా!"
గింతకీ కాయా పండా శెల్లే?"
  "పండే అవ్వా! గాళ్ళ ఆశ సూత్తనే  వొద్దనాలని అనిపిస్తుంది గని. ఎవలైనా గీ రోజుల్ల మొగ పెండ్లోలు గిట్లనే ఆశవడ్తుండ్రు అని నడ్మలున్న పెద్ద మడుసులు శెప్ఫిండ్రంట.గందుకనే ఖాయం జేసుకుండ్రు అవ్వా!"
  గదండీ సంగతి! "ఆస్తి మూరెడు- ఆశ బారెడు" అంటే గదే. గాళ్ళకుంది తక్వేగని ఎదుటోళ్ళ నుంచి బారెడు తీస్కోవాలనే ఆశ గిట్లనే ఉంటది.

కామెంట్‌లు