సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము- 197 వ రోజు
ఉత్తరకుమారునికి నగరం స్వాగతం పలుకుట[
ఉత్తరకుమారుని విజయానికి ఆనందపడి ఉత్తర తన చెలికత్తెలతో అన్నయ్యకు ఎదురు వెళ్ళి వారిరువురి మీద చందనం, కుంకుమ, పూవులు చల్లి స్వాగతం పలికింది. మిగిలిన వారు కూడా ఉత్తరునికి ప్రశంశల జల్లు గురిపించారు. ఉత్తర కుమారుడు ప్రశంశలకు తట్టుకోలేక బృహన్నల సహకారంతో ఈ విజయం సాధించానని నర్మ గర్భంగా చెప్పాడు. ఇంతలో ఊత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడన్న వార్త విరాటునికి చేరింది. విరాటుడు ఆనందంగా వారిని రమ్మని చెప్పమని సేవకులను ఆజ్ఞాపించాడు. ఉత్తర కుమారుడు తండ్రికి నమస్కరించాడు. పక్కనే ఉన్న కంకుభట్టును చూసి నమస్కరించాడు. కంకుభట్టు నుదుటి మీద గాయాన్ని చూసి ఎలా జరిగిందని అడిగాడు. విరాటుడు " నేను నీ విజయాన్ని పొగుడుతుంటే విజయం నీది కాదు బృహన్నలది అన్నాడు. అందుకని నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను. కంకుభట్టుకు గాయం అయ్యింది " అన్నాడు ఉత్తరునితో. ఊత్తరుడు తండ్రితో " తండ్రీ ! మహాపరాధం చేసారు. ఇలాంటి మహాత్ములను అగౌరవపరిస్తే మనకు ఆయువు, ఐశ్వైర్యం క్షీణిస్తాయి. ముందు వారిని క్షమాపణ అడగండి " అన్నాడు. విరాటుడు కుమారుని మాట పాటించి కంకుభట్టును క్షమాపణ కోరాడు. కంకుభట్టు నవ్వి ఉత్తర కుమారునితో " అసలు నాకు కోపమే రాలేదు ఇక క్షమాపణలతో పని ఏమి?. విరాటుడు ఉత్తముడు. ఏదో చెడు ఘడియలో అలాచేసాడు " అన్నాడు. విరాటుని మనస్సు కుదుట పడింది.
విరాటుడు ఉత్తరకుమారుని వద్ద యుద్ధవిశేషాలు వినకోరుట
విరాటుడు కుమారుని చూసి " కుమారా భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యుల వంటి మహారషులున్న సుయోధన సైన్యాలను నువ్వు ఒక్కడివే ఎలా గెలిచావు. ఒక్కడు పరశురాముని గెలిచిన వాడు. ఒకడు శివుని వరాన పుట్టిన వాడు. ఒకడు అర్జునినికి యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్యుడు. దృతరాష్ట్ర కుమారులు ఒక్కొక్కరు ఈ భూమిని గెలువగల సమర్ధులు. అలాంటి వారిని నీవు ఒక్కడివే ఒక్క గాయం కూడా పడకుండా ఎలా గెలిచావు ఆవులను ఎలా మరలించావు. ఒక్కరిని కొడితే పది మంది చుట్టు ముడుతారు కదా. సుయోధనుడిని ఎలా పలాయనం చేయించావు. వినాలని కుతూహలంగా ఉంది చెప్పు " అన్నాడు ఉత్తరుడు " తండ్రీ! కౌరవ సేనలను నేను గెలవ లేదు, గోవులను నేను మరల్చ లేదు. దైవాధీనంగా ఒక దైవాంశ సంభూతుడు వచ్చి కౌరవ సేనలను గెలిచి గోవులను మరల్చి సుయోధనుని పలాయనగతుని చేసాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి " అని ఉత్తరుడు చెప్పనారంభించాడు. " బృహన్నలను సారథిగా చేసి నేను యుద్ధానికి వెళ్ళాను. కురు సేనలను చూడగానే నాకు కాళ్ళు చేతులు ఒణకసాగాయి. రథం దిగి పోయాను అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సారథిగా చేసి కౌరవ సేనలను ఓడించి గోవులను మరలించాడు. సుయోధనుని అడ్డగించి అతనితో ఘోరంగా పోరాడాడు. కౌరవ సేనలను చిత్తు చేసాడు. కర్ణుని తమ్ముని చంపాడు. భీష్మునిపై బాణ ప్రయోగం చేసాడు. ద్రోణుని ఎదిరించాడు. రణ రంగంలో వీరవిహారం చేసాడు " అని చెప్పాడు. విరాటుడు ఆ మహాను భావుని చూపించమని అడుగగా ఉత్తరుడు అతడు అంతర్ధాన మయ్యాడని నేడో రేపో కనపడగలడని చెప్పాడు. కంకు భట్టు తన గాయాన్ని బృహన్నల చూడకుండా ఊత్తరీయాన్ని గాయంపై కప్పుకుంటూ జాగ్రత్త పడుతూ అంతా అర్జునిని పరాక్రమే అని ఆనంద పడ్డాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు