కవినై… కవితనై…: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఊహల్లో ఊగుతున్నా —
ఉయ్యాల ఊపులపై
కలల్ని కదిలిస్తూ
మనసుల్ని మురిపిస్తూ.

భ్రమల్లో తేలుతున్నా —
మబ్బుల మడుల్లో
నిజాలకీ కలలకీ మధ్య
నడకలు వేస్తూ.

అక్షరాల్లో దూకుతున్నా —
ఆలోచనల లోతుల్లో
అంతర వెలుగులతో
ఆత్మను ఆవిష్కరిస్తూ.

పదాల్లో కూరుకుపోతున్నా —
పలుకుల పొదల్లో
పూల పరిమళంలా
ప్రసరిస్తూ, పయనిస్తూ.

ప్రాసల్లో మునిగిపోతున్నా —
లయల ప్రవాహంలో
ఛందస్సు చరణాల్లో
చెలరేగుతూ, పరవళ్లు తొక్కుతూ.

భావాల్లో మునుగుతున్నా —
మనసు సముద్రంలో
ఆవేశ అలలతో
అంతర్లీనమవుతూ.

కవితల్లో వికసిస్తున్నా —
ప్రతి పాదంలో
ప్రతిబింబిస్తూ
ప్రత్యక్షమవుతూ.

మదుల్లో నిలిచిపోతున్నా —
మరపురాని మధురంగా
మాటలలో మాణిక్యమై
మరణంలేని మహాకవిగా.


కామెంట్‌లు