సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -166: ఆ అగస్త్య భ్రాత ఎవడంటే ఇంకెవరు హనుమాయమ్మ మొగుడే అన్నట్టు
*****
 గీ ఇచ్ఛింత్రం ఇన్నావా అవ్వా!గిన్నాల్ల నించి తెల్వకనే పాయె. గా పంతులోరు శెప్పేదాంక. ఏమో అనుకున్న గని అబ్బో శానా గొప్ప పేరే నవ్వోవ్!
 శెల్లే! ఏం ముచ్చెటి జెప్తున్నవో? ఎవలి సంగతి జెప్తున్నవో నాకైతే ఒక్క ముక్క సుత సమజవ్వలే. ఎన్నల్లేంది గింత అయోమయంగ జెప్తున్నవేంది శెల్లే!"
 ఆచ్చిరమవ్వా! ఆచ్చిరం. గియ్యాల్నే తెల్సుకున్న గా నిజం.ఎట్ల జెప్పాల్నో  తెల్వక తబ్బిబ్బై కిందమీదైతున్న.
 "ఓషినీ! తబ్బిబ్బు సల్లగుండ గంత ఆచ్చిరమైన నిజమేందబ్బా? శివరాకరికి నన్ను సుత ఏందో అన్న ఇషారంల బడేశ్నవ్ గద!'
 "గదేనవ్వా మన హనుమాయమ్మ మొగుడే గదేదో అగత్తియ బాతంట. గంత గొప్పోడని గియ్యాల్దాక గా పంతులోరు శెప్పేదాంక తెల్వకనే పాయె. అనుమాయమ్మ అదృట్టమే అదృట్టం. గంత గొప్ప మునికి బాత లాంటి పేరున్నోడు ఎవలుంటలు శెప్పు. గా అనుమాయమ్మ ఎంత నోరు బెట్కొని బత్కినా? మొగున్ని ఏ మాత్తరం నెగలనీయకున్న గామె మొగుడికి గంత గొప్ప పేరుందని పంతులోరి నోట్లెనించి ఇనేదన్క తెల్వకనే పాయె."
 ఓషినీ శెల్లే! నీఅమాయికత్తం పాడుగాను. నీకు సుత ఏదన్న పేరు వెట్టమని గా పంతులోరిని అడుగుతనుండు. ఎట్ల శెల్లె! రామాయిణం ఇన్లేదా  ఎప్పుడూ?"
ఎహే! ఎందుకిన్లేదవ్వా? గట్లంటివి ఒక్కపాలె. రామ కత, సీతమ్మోరి కట్టాలు యిడమర్సి శెప్పమంటవా? గా రావణాసురుడిని సంపి సీతమ్మని అయోధ్యకి తోల్కొచ్చింది ఎట్లనో శెప్పనా అవ్వా!"
 గట్ల గాదు శెల్లె గా రామాయిణంల ఇచ్చింత్రమే నువ్వన్నట్టు 'అగత్త్య బ్రాత'. గిందుల ఇష్యం ఏందంటే గీ రామాయిణం రాశిన వోల్మీకి అగత్య మునికి బ్రాత అంటె తమ్ముడుండని శెప్పిండుగని గా తమ్ముని పేరు శెప్పలే. రామాయిణంల ఎక్కడా పాపం గాయిన పేరుండదు.
 గంత మంది మునులే ఉండ్రు. రాజులే ఉండ్రు.రాచ్చసులు ఉండ్రు.పతొక్కలికి పేరుంది గని  గీ వోల్మీకి రుషికి మన్సొప్పలేదు గావొచ్చు.పాపం గాయినకి పేరు వెట్టలే.
 మరి గాయిన పేరు అనుమాయమ్మ మొగుడికి గట్ల  వెట్టిండేంది పంతులోరు.
 ఓ తిక్కలమ్మ! పేరు వెట్టుడు గాదే తల్లీ! పేరు లేనోడు అని. గాయన్ని గీ వూల్లె ఎవ్వలన్న పేరువెట్టి పిల్వంగ సూశినవా? మొల్తాడు గట్టిన నిన్న మొన్నటి బుడ్డోడు సుత ఆయన్ని అనుమాయమ్మ మొగుడు తాత అన్నడుగని గాయిన పేరువెట్టి పిల్వంగ సూశినవా శెప్పు."
 అంటే! గదేంది అవ్వా!గా పంతులోరు సుత అనుమాయమ్మ మొగుడ్ని గట్ల అవమానిచ్చిండు.
 గట్ల అనబాకులే శెల్లె! గా రామాయిణంల అగత్త్యుని తమ్ముడు పేరు లేనోడిగ పేరు వోయిండు. గిట్ల మన అనుమాయమ్మ మొగుడు సుత పేరుండీ లేకుండ పేరు వోయిండు."
 గందుకనే ఊల్లె గంతో గింతో సద్వుకున్నోళ్ళు పంతులోరి నోట్లెనించి ఇన్నోళ్ళు కాత్త పరాశ్కంగ మరి కాత్త అయ్యో పాపమని గా అగత్య బ్రాత ఎవడంటే ఇంకెవరు అనుమాయమ్మ మొగుడే అనవట్టిండ్రు. గిట్ల అనుమాయమ్మ మొగుడు మనకి రామాయిణాన్ని యాదికి దెత్తుండంటే నయమేగద. గట్లనన్న మల్ల మల్ల రామాయిణం తిరిగేత్తం. గాల్ల ముచ్చెట్లు నెమరేత్తం.గిదీ ఒకందుకు మంచిదే గద శెల్లే!"
"అవునవ్వోవ్! గా అనుమాయమ్మ మొగుడి ముచ్చెటేగా గియ్యన్ని తెల్సుకునేల జేసింది.పేరు లేనోన్ని పేరుండీ అడుగున బడ్డోడిని దృట్టిల బెట్కొని ఈ సామెత పుట్టుకొచ్చిందని ఎర్కయింది. ఏదేమైన అనుమాయమ్మ మొగుడా మజాకినా? నా లెక్క పిచ్చిమొగాలై ఏరు అర్తంతో అనుకున్నోళ్ళకి,అనుకునేటోళ్ళకి గీ యిషయం జెప్పాలె. నువ్వేమన్నను. నా కడ్పు ఉబ్బి పోతున్నది. అన్కుంట అడావిడిగ అక్కడ్నించి పోయింది ఈరలచ్మి.
గదండీ సంగతి! "ఆ అగత్య బ్రాత ఎవడంటే ఇంకెవరు అనుమాయమ్మ మొగుడే అన్నట్టు" దీన్నే కాత్త కూత్త సద్వుకున్నోళ్ళు " ఆ అగస్త్య భ్రాత ఎవరంటే హనుమాయమ్మ మొగుడే అన్నట్టు" అంటుంటరు. ఎట్లైతేంది  ఆడోళ్ళు ఎట్లైనా అగత్త్య శెల్లెండ్లే. గాల్లెప్పుడు ఇంట్లె మొగునితోని బయిట జెనం తోని సొంత పేరుతో పిలిపిచ్చుకోడం మనం సూడం. గట్లనే ఎవలో వందలో ఒక్కలో ఇద్దరో సూర్య కాంతం లాంటి పెళ్ళామున్న మొగుళ్ళు శానామట్టుకు అగత్య బ్రాతలే. గిట్లన్నని ఏమనుకోకుర్రి. సర్దాగ అన్న మరి.

కామెంట్‌లు