మాంసపు ముద్ద. :-డా ప్రతాప్ కౌటిళ్యా.
ఎడారిలో ఆవిరి 
ఆయిల్గా మారింది.
సముద్రంలో ఆవిరి 
కన్నీరై మిగిలింది. 

ఎడారిలో చంద్రుడు 
వెన్నెలై పూసిండు
సముద్రంపై చంద్రుడు 
ఊయలై ఊగిండు. 

ఎంతో ఎత్తులో జిత్తుల మారి 
గద్ద 
దాన్ని మాంసపు ముద్దలా చూసింది. 

సముద్రాన్ని జయించి 
ఎడారిని ఓడించింది 
కంటితోనే శాసించింది 
పంటితోనే శ్వాసించింది 

ముక్కలు ముక్కలుగా మారిన 
చంద్రుడు 
చుక్కలు చుక్కలుగా రక్తం కారుస్తున్నాడు.

రేపు చుక్కలన్నీ కలిసి ఆకాశాన్ని 
సముద్రంలోకి ఎడారిలోకి విసిరేస్తే 
ఎత్తులోని గద్ద కంటిచూపు దెబ్బతిని 
అద్దంలో 
తనతో తానే యుద్ధం చేసి 
మాంసపు ముద్దగా మారుతుందేమో.!?

నేడు అంతర్జాతీయ కవితా దినోత్సవం. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు