సామెత -157: ఆకలిగొన్న సింహానికి ఏనుగు/ ఏనిగె దొరికినట్టు
*****
"అవ్వా! మొన్నేమైందో ఎరికేనా? వామ్మో తల్సుకుంటే గుండెల దడ లేత్తుంది.మేవిద్దరం బూవి మీద బతికి బట్ట కడ్తమనుకోలే!"
"అయ్యో! గంత కట్టం ఎట్లొచ్చె శెల్లే! ఏవన్న కక్కులు, బేదులు బట్కున్నయా ఏంది? గస్మంటప్పుడు అస్సలు నిర్లచ్చం సేయొద్దు. దవాఖానకి బోవాలె.వైజ్గం సేయిచ్చుకోవాలె. నూ గీ మాట అనేతల్కి నా కాల్జేతులు సల్లవడ్డట్లయినయి.
"అయ్యో! గది గాదవ్వా! మొన్న ఆరం దినాల కింద నేను,మీ మర్ది మా సుట్టాలింట్లె పంచనుంటే ఎల్తమని శెప్పిన గద. అగ్గో అక్కడ జర్గింది.
"ఏం జరిగింది శెల్లె! ఆళ్ళు బెట్టిన శియ్య ముక్కలు, ఇచ్చిన దావతూ..."
"అది సుత కాదవ్వా! నీ ఆత్రం పాడుగాను.నన్ను పురాగ శెప్పనిత్తవా లేదా?"
"ఎట్ల శెల్లె! నూ ఆగాగి శెప్తుంటే సవాలచ్చ అనుమానాలు కంద్రీగల్లెక్క మతిల జొర్రుతున్నయి."
"అవ్! గది సుత నిజమే లే అవ్వా! గయ్యాల నేను మీ మర్ది ఇద్దరం సుట్టాలూరు పయనమై బోయినం.'బస్సు దిగినంక ఆటోలుంటయి అల్లముంటయి సొంటుంటయని' గా సుట్టం శానా శానా జెప్పిండు గని అక్కడ ఏవీ లేవవ్వా! పోను జేత్తె కల్వట్లె.
ఇగెట్ల!పంచనికి కట్టుకుందానికి కొత్త బట్ల మూట నేను, సుట్టపోల్లకి పెట్టుడు బట్ల మూట ఆయన శెరొకటి పట్కున్నం పైన ఎండేమో సుర్రుమంటుంది. ఒళ్ళంత శెమట్లు గారి నాలిక తడారి పోతుంది. కడ్పుల పేగులు నకనకలాడ్తున్నయి. ఎవ్వలినన్న అడగడాన్కి 'పిట్ట పిసుకు' లేరు. సీసాల పట్కబోయిన నీళ్ళు గిన్నెన్నుంటె నాలికె తడ్పుకుంట నడ్వబట్టినం.
గట్ల నడిశీ నడిశీ కాళ్ళు రివరివ లాడబట్టినయ్. ఇంకాశింతైతే గాన్నే సోశొచ్చి పడేటోళ్ళం. గా ఊరి అద్దులకు బొయినంక గక్కడ మడ్సులను సూశి పానం లేశొచ్చింది. సుట్టపాయన పేరు శెప్తే గీ సందుల గా సందుల బడి పోండి.ఇల్లొత్తదని శెప్పిండ్రు.
"ఎట్లోగట్ల తిరిగి తిరిగి మొత్తానికి గాల్లింట్ల బడ్డం అవ్వా!" గప్పుడే అందర్ని పిల్సుకుంట బంతిని లేపి ఇస్తాల్లేత్తుండ్రు. మాఇద్దరం ఒకలి మొగం ఒగరం సూస్కోన్నం. "నేను సోటాప్త.కాల్జేతులు గాబుకాడ కడుక్కొని రా!" అని జెప్పి ఆయనకో కుర్శీ ఆపిన. ఇంగ మీ మర్ది కూసోంగనే నేనెల్లి కాల్జేతులు కడుక్కొచ్చుకొని కూసున్న.
"అవ్వా! గాళ్ళు వడ్డిత్తున్న బువ్వ కూరలు సూత్తుంటే పానం లేశొచ్చిందన్కో! " ఎన్నాళ్ళైందో తినక మొహవాశినట్టుంది. మా ఇద్దరి పరిత్తితి".
" ఆకలిగొన్న సింహానికి ఏనిగె దొరికినట్టుందన్న మాట" అవునా శెల్లె!
"అవునవ్వా! బలేగ శెప్పినవ్.సకం తిన్నంక కడ్పు సల్లవడ్డది. గప్పుడు అటీటు కూసున్నోళ్ళను సూత్తే గాల్లందరు మమ్మల్నే సూడబట్టిండ్రని ఎరికయ్యే తల్కి మస్తు సిగ్గైంది అవ్వా! మేం గని గా బంతికి లేవకపోతె ఆకలికి గక్కడే సచ్చీరుకునేటోళ్ళం.మేవిట్ల బోవుడు, గాళ్ళు తిండికి లేపుడు, మేం గా కిటకిటల నడ్మ సోటు దొరికిచ్చుకోడం తల్సుకుంటె బూవి మీద ఇంక నూకలున్నయని తెల్సిందవ్వా!"
గందుకే శెల్లె! పెండ్లిండ్లు,పంచన్లకి పొయ్యేటప్పుడు కోడుగుడ్డంత కొవ్వు బెట్కొని పోవాలని మా తాత అనేటోడు.
"ఇంగ శెల్లె! దూరవారం బొయ్యేటప్పుడు నీళ్ళ సీసా,బిస్కోటు పొడ కొనుక్కొని కీసల బెట్కోవాలె. యాది మరువకు."
సరే అవ్వా! అన్కుంట పంచను ముచ్చెట్లు కతలు కతలుగా శెల్లె శెప్తుంటే అవ్వ ఓపిగ్గ ఇనసాగింది.
గదండీ సంగతి! "ఆకలిగొన్న సింహానికి ఏనిగె దొరికినట్టు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి