సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -165:ఆకలి కాడ యవ్వారం కాడ సిగ్గు పడొద్దు
*****
"అవ్వా! అవ్వా! జల్ది వొంట జెయ్యవే. మస్తు ఆకలైతంది" అంటున్న మన్వడు రాంబాబు మాటల్కి "గదేందిరా!గిప్పుడే గద నీలమ్మ లగ్గమై పదారొద్దుల పండక్కి బొయ్యొచ్చినం.గక్కడ బోజినాలు మంచి గున్నై వొంటలన్ని పెండ్లప్పటి కన్న గియ్యాల బాగ జేసిండ్రని మీ యమ్మ ,నేను,శారదత్త అన్కుంటుంటే నువ్వేం జేసినవ్ రా అయ్యా! నీ తానకి వొచ్చే తల్కి వొంటలు వొడిశినయా ఏంది?"
 "గదేం లేదవ్వా!గా సుట్టాలందరితో కూసోని తింటుంటే మస్తు సిగ్గయ్యింది. గాళ్ళంత నన్నే సూత్తుండ్రేమో అన్పిచ్చింది.వొడియాల పులుసు,పూర్ణం బాగున్నయన్నరు గని నా దనుక రాలే.అడగాలంటే సిగ్గనిపిచ్చింది.మారన్నం సుత అడ్గలే అవ్వా!"
నాకు సుత మస్తు సిగ్గయ్యింది.గందుకే నేనూ సలిగ్గ తిన్లేదవ్వా! అవ్వా! గా వొడియాల పులుసు సూత్తుంటే నువ్వు జేసే గుడ్డు పులుసు యాది కొచ్చింది.గజ్జేయవ్వా? బుడ్డోడి మాటల్కి.. "
 "సడే బాగనే ఉంది కత.శేత్తలే గని.పొయ్యిందే బోజినాలకి. ఎవలన్న మీ యిద్దరి లెక్క తినకుండ వొత్తరా? తిండి కాడ సిగ్గు పడ్తే కడుపెట్ల నిండుద్దిరా అయ్యా?"
మన పక్కింటి పంకజాచ్చి మొగుడు పెళ్ళాం వొండి పెడ్తున్నా దినాం తిండి కాడ సిగ్గు పడ్ఢట్టు చేత్తడట. గీమె అడిగడిగి పెట్టాల్నంట. ఏదన్న పని తొందర్ల అడ్గలేదన్కో. ఆటెంక పిల్శి నువ్వు ఇయ్యాల అడ్గలేదు గందుకనే నేను సరిగ్గ తిన్లేదు అంటడంట.గదేందో నాకు గియ్యాల్టికీ శిత్రంగ అన్పిస్తది.నిత్తెం పెళ్ళాం శేత పెట్టిచ్కొని తినేటోడికి గా సిగ్గెందుకో అర్తం కాలే నాకైతే."
"అగ్గో గట్లనే మన సాయిలు ఇష్యం ఏమైంది!గాని అత్తోళ్ళు   పెద్దల్లుడు కట్నం శాన  తక్కువ తీస్కున్నడని గవురవంతో ఓ ఎకరం శెల్క రాశిత్తమని అన్నరట.ఓ దినం పెద్ద మడుసులను  సుత పిల్శి జెప్పిండ్రంట.గాదినమే అన్ని తెచ్చి నోటు రాశియ్యబోతుంటే సిగ్గు పడ్కుంట గిప్పుడెందుకులే మావా?  తర్వాత సూద్దాం తీ అన్నడంట.
గట్ల గట్ల దినాలు  నెలలైనయి .నెలలు ఏండ్లయినయి.గా మావ కాత్త పెద్ద మడిశై కాలం జేసిండు.అత్త రాశి ఇద్దామనుకునే తల్కి మిలిగిన  అల్లుండ్లు అడ్డువడ్డరంట.గందుకే పెద్దోళ్ళు ఊకెనే అన్లే "ఆకలి కాడ యవ్వారం కాడ అస్సలు సిగ్గువడొద్దు" అని
 
"పొయ్యిందే పంచన్ల సుష్టుగ తింటానికి. గా తినే కాడ సిగ్గువడ్తిరి కడుపు నిండదాయె.గా సాయిలు ఆత్తి/ ఆస్తి కాడ సిగ్గు వడి రాశిత్తుంటే గిప్పుడొద్దనే. గిప్పుడు  జూడు అసలికే ఎసరు పెట్టినట్టయ్యె."
 మల్లోపాలి ఇనుకోండ్రి."ఆకలి కాడ యవ్వారం కాడ అస్సలు సిగ్గువడొద్దు"సమజైందా? మాటల్లనే అటు అన్నం అయ్యింది గిటు గుడ్డుపులుసు ఆయె."ఎంత ఆకలవుతుందో ఏమో!జల్ది తిందురు గని" 
అవ్వ అనంగనే ఒక్క పాలే జప్ప జప్ప కాల్జేతులూ కడుక్కుని, ముక్కాలి పీటలు ముందేసుకొని కూసుండ్రు.
గదండీ సంగతి.గందుకే ఆకలి కాడ , యవ్వారం కాడ అస్సలు సిగ్గు వడొద్దు" అన్నరు. నేను జెప్తున్న గీ మాటలు గిప్పన్నించే యాది బెట్కోండ్రని' జెప్పిన అవ్వ మాటల్కి సంబుర పడ్కుంట తూనీగల్లెక్క  ఉరికురికి బోయిండ్రు.

కామెంట్‌లు