సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల ( భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 
సామెత -170;: ఆటా పాటా మాయింట మాపటి భోజనం మీ యింట
*****
"ఓ అవ్వోవ్!  నీకు నాకు లెవ్వాయె గస్మంటి ఇకమతులు.మనస్మంటి అమాయికపోళ్ళు గీ పెపంచకంల బత్కడం కట్టమే అవ్వా! అంగట్లె అన్ని అమ్మినట్టు కాసిన్ని తెల్వితేటలు సుత అమ్మితే బాగుండు.అప్పోసప్పో జేసి కొనుక్కుందుం."
 ఏంది శెల్లె! నాకేం సమజైతలే. తెల్వితేటలేంది అంగట్ల కొనుక్కునుడేంది? మనకిప్పుడు వొచ్చిన కట్టమేంది? మనల్ని ఎవలన్న ఏమనన్నరా? ఎంత ఇశారించినా యాదికి రాట్లే శెల్లే!
 'గట్ల గాదవ్వా! ఆరమే కదా! రాదక్కింట్ల బిడ్డ లగ్గమైంది.గాళ్ళింటికొచ్చిన సుట్టపోళ్ళతో నీకు నాకు సుత బీరకాయ పీసు సుట్టిర్కం ఉంది కద!
అవును శెల్లె!గీ లగ్గంల అందరు కలుత్తరని దూరబారమైన లెక్క శేయకుండ గంతంత దూరం నుంచి ఓపిక జేస్కోని వొచ్చిండ్రు.గందుకనే మనింట్ల శెయ్యి కడిగిద్దమని బోజినానికి పిల్శిన.శిన్న దావత్ జేసి గాళ్ళని సంబుర పర్శిన.ఆడోళ్ళకి ఓ శీరె రైక ముక్క,మొగోళ్ళకి కండువా పంచె బెడితే ఎంత తుప్తిగ అన్పించిందో శెల్లె! గీ లగ్గమని రాబట్టి గిట్ల కల్శిండ్రు.లేకపోతె ఎందుకొత్తరు శెల్లె!
"అవునవ్వా! నీ ఇల్లు బంగారం గాను.మంచి మాటన్నవు. నేను సుత నిన్న గాళ్ళని పిల్శి నా అయిశెతుకు తగ్గట్టు మరియాద జేసి పంపినవ్వా!"
 "మల్లెందుకు శెల్లె!గా ముచ్చెటి తీత్తున్నవ్? అంత బాగనే ఉంది గద!" 
 అంత బాగనే ఉంది.మన పారిజాతం అక్క లేదు.గా అక్క సుత గా సుట్టపోల్లని పిల్శింది. పిల్శి శిన్న కొండపల్లి కొండపల్లి, పెద్ద కొండపల్లి ముచ్చెట్ట్లు శితం జెప్పింది.నేను సుత మల్ల మల్ల గాళ్ళు కలుత్తరాని గాళ్ళపొంటి ఎల్లినవ్వా!
గాళ్ళేమో ముచ్చెట్లు జెప్పుకుంటనే త్యేపకో పాలి వొంట ఎందాకైందోనని వంటర్ర దిక్కు సూసుడు.గక్కడ వొంట చేత్తున్న దాఖలాల్లేవు.గాళ్ళతో కలిపి నేను సుత సూడబట్టిన.
"ఇగ లెవ్వు అగలెవ్వు.నేనే శొర్వ జేసి ఏందక్కా వొంట ఎందాకొచ్చిందని సాటుకు బిల్శి అడిగినవ్వా?
ఏమన్నది అవ్వా!బయట్నించి  ఏమన్న తెప్పిత్తుండ్రో ఏమో అన్కున్న. గా మాటే అడ్గితే గాళ్ళొచ్చింది పెండ్లింటికి.మాటా ముచ్చెటి మాట్లాట్టానికి మాయింటికి రమ్మన్నగని బోయినానికి కాదు.గాళ్ళు బొయ్యి గా పెండ్లింటనే దింటరు" అన్నదవ్వా!".
ఇంగ జూస్కో గాళ్ళు నకనకలాడుకుంట పెండ్లింటికి బోయిండ్రు గక్కడ బోయినాలై అడుగు బొడుగు ఊర్శి గిన్నెలు జాలట్లె ఏత్తుండ్రు. ఇంగ జూస్కో అవ్వా! గాళ్ళల్ల ఇద్దర్కి రకత పోటు,సుగరు బీమారట.ఆకల్కి తట్టుకోలేక అన్నమడిగితే అయ్యో ! మీరు నిన్న మొన్నటొతికె గాన్నే తినొత్తరనుకుని  ఇంట్లె ఉన్నోళ్ళ వరకు మటీమట్రం వొండిచ్చినం అన్నరవ్వా."
సర్ర సర్ర వొంట షురూ జేసిండ్రు.మీ మర్దిని పంపి అరిటికాయలు తెప్పిచ్చి తలో రెండు ఇచ్చిన.గవి దిన్నంక గాళ్ళ పానం లేశొచ్చిందన్కో. వొంటయి  గాళ్ళు తినే తల్కి మద్ధేనం దాటింది. గాళ్ళని సూత్తుంటే మస్తు ఉసూరుమన్పిచ్చిందవ్వా.
గదే శెల్లే! ఎన్కటికో సామెతుండె. "ఆటా పాటా మాయింట మాపటి భోజనం మీ యింట " గట్లనే ఉంది గీ కత. కొందరంతే శెల్లే. మాటలే తీపి. శేతలు గిట్లుంటయి.ఏం జేత్తం ఇంగితం ఉండదు."
గదండీ సంగతి!"ఆటా పాటా మాయింట మాపటి భోజనం మీ యింట" అంటే గిదే మరి.

కామెంట్‌లు