వాక్యాల వైభవం: -గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వాక్యం పుడితే —
మనసు మౌనానికి స్వరమవుతుంది,
భావాల గర్భంలో పెరిగిన
బంగారు బిడ్డలా వెలిగిపోతుంది.

వాక్యం రసాత్మకమైతే —
హృదయ తంతుల్ని తాకుతుంది,
రసరాగాల వర్షం కురిపిస్తూ
మనసులకు మధురానుభూతి పంచుతుంది.

వాక్యం సృజనాత్మకమైతే —
ఆలోచనల ఆకాశంలో విహరిస్తుంది,
కొత్త నక్షత్రాలు వెలిగిస్తూ
కల్పనలకు రెక్కలు కడుతుంది.

వాక్యం మధురాత్మకమైతే —
తేనెలో ముంచిన అక్షరాలై అలరిస్తుంది,
పలికిన ప్రతి మాటలో
ప్రేమ పరిమళం పూయిస్తుంది.

వాక్యం లయాత్మకమైతే —
పదాల అడుగులకు తాళం వేస్తుంది,
హృదయ స్పందనలతో కలిసి
మధుర గీతమై మ్రోగుతుంది.

వాక్యం కవితాత్మకమైతే —
భావాల తోటలో వికసిస్తుంది,
సౌందర్య పుష్పమై
చదివిన హృదయాలను పరవశపరుస్తుంది.

వాక్యం ప్రేరణాత్మకమైతే —
నిస్సత్తువైన అడుగులకు ధైర్యం నూరిపోస్తుంది,
చీకటి మార్గాల్లో కూడా
వెలుగుల దారిని చూపిస్తుంది.

వాక్యం భావాత్మకమైతే —
మనసుల మధ్య వంతెన నిర్మిస్తుంది,
మనిషిని మనిషికి దగ్గరచేసే
మధురమైన మానవ సంగీతమవుతుంది.

వాక్యం వర్ణనాత్మకమైతే -
అందమైన దృశ్యం చూపిస్తుంది,
అంతరంగాన్ని అంటి
ఆనంద సాగరంలో ఓలలాడిస్తుంది.

వాక్యాలే కావ్యాలు — శ్రావ్యాలు
వాక్యాలే పునాదులు — భవంతులు
వాక్యాలే సుమసరాలు — సౌరభాలు
వాక్యాలే కథనాలు — కవనాలు

.

కామెంట్‌లు