సుప్రభాత కవిత : - బృంద
ఆకాశంలో సగం అన్నారు 
అహంతో అణచివేస్తున్నారు 

అమ్మే దైవం అంటూ....
అమ్మాయిగానే చిదిమేస్తున్నారు

అనురాగం నటిస్తూ...
అనుమానంతో చంపేస్తున్నారు

అందలం ఎక్కిస్తున్నారు 
అదః పాతాళానికి తొక్కేస్తున్నారు

ఇంకా మార్పు లేని విషయాలు 
ఎన్నో అలాగే వున్నా....

మరో కోణంలో .

సున్నితమైన మనసును 
శిలగా మార్చేసుకుంటున్నారు 

పద్ధతులు వదిలేస్తున్నారు 
పరుగులు తీస్తున్నారు 

సర్దుకోవడం అన్న మాటే లేక 
సంసారం వదిలేస్తున్నారు 

మాట తీరే కాదు 
మనిషి తీరూ మారింది 

మనం అన్నమాట మరచి 
నేను అన్నదే మిన్న అయింది 

హక్కులు సాధించే క్రమంలో 
బాధ్యతలు వదిలేస్తున్నారు

సోమరితనం పెచ్చు పెరిగి 
సౌకర్యం చూసుకుంటున్నారు 

అతి వదిలక పోతే 
ప్రతి సమస్య పెద్దదే

ప్రభాకరుని వెలుగుతోనే 
సుధాకరుని చలువ...

ఎవరి గొప్ప వారిది 
ఎవరి ప్రతిభ వారిది 

రైలు పట్టాల జతలో 
ఏది గమనానికి ముఖ్యం?

ఉత్సవాలతో చైతన్యం రాదు 
ఉన్నతంగా  మనసు ఎదగాలి 

సాధించినవెన్నో వున్నా....
కోల్పోయినవి కూడా వున్నాయి 

జీవన చక్రాలు రెండూ 
గుండ్రంగానే ఉండాలి
రూపు మారితే  బండి కదలదు 

ప్రతిదినం  ప్రత్యేకమే 
ప్రతి క్షణం ఉత్సాహమే 
ప్రతిపక్షం అవకపోతే!
పౌరుషాల తో ప్రశాంతత 
పోగొట్టుకోక పోతే!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు