ఆయన, నేను: - - రూమీ
ఆయన అడిగారు : 
"నా ముఖద్వారం వద్ద ఉన్నదెవరు?"

నేను అన్నాను : 
"మీ వినమ్ర సేవకుడిని."

ఆయన అడిగారు : 
"నీకు ఇక్కడ ఏమి పని?"

నేను అన్నాను : 
"మీకు వందనం సమర్పించడానికే ప్రభూ."

ఆయన అడిగారు : "నీ ప్రయాణం ఇంకెంత కాలం సాగుతుంది?"
        
నేను అన్నాను : "మీరు నన్ను ఆపే వరకు."

ఆయన అడిగారు : 
"నువ్వు ఆ అగ్నిలో ఇంకెంత కాలం మరుగుతావు?"

నేను అన్నాను: 
"నేను సంపూర్ణంగా పవిత్రమయ్యే వరకు."

"ఇది నా ప్రేమ శపథం.
 ప్రేమ కోసం.
 నేను సంపదను, హోదాను త్యజించాను."
         …..  ….. …..

ఆయన అడిగారు : 
"నువ్వు నా నుంచి దేనిని ఆశిస్తున్నావు?"

 నేను అన్నాను : 
"మిమ్మల్ని నా శాశ్వత మిత్రుడిగా పొందాలని."

ఆయన అడిగారు : "నా నుండి నీకు ఏమి కావాలి?"

 నేను అన్నాను : "మీ అపారమైన అనుగ్రహం."

ఆయన అడిగారు: 
"ఈ ప్రయాణంలో నీ తోడు ఎవరు?"

నేను అన్నాను : "మీ తలపే ప్రభూ."

ఆయన అడిగారు : "నిన్ను ఇక్కడికి పిలిచింది ఏమిటి?"

నేను అన్నాను : 
"మీ మధువు పరిమళం."
          ….. ….. …..

ఆయన అడిగారు : 
"ఈ జీవితం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి?"

 నేను అన్నాను : 
"నా నిజస్వరూపానికి కట్టుబడి ఉండటమే."

ఇప్పుడు మౌనం వహించాల్సిన సమయం.

ఆయన నిజతత్త్వం గురించి నేను మీకు వివరించి చెప్పినట్లయితే,
మీరు మీ 'స్వయం' నుండి విడివడి, ఎగిరిపోయి మాయమైపోతారు.
అప్పుడు ఏ ద్వారమూ, ఏ పైకప్పూ మిమ్మల్ని నిలువరించలేవు!

            

కామెంట్‌లు