సామెతల ఊట- సునందమ్మ నోట; - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -15: -ఆకుబోయి బాయిల పడ్తే ఎతకబోయి ఏడుగురు పడ్డరట

*****
"అవ్వా! అవ్వా! సామాన్ల అర్రల  గోపి మావ జారి పడ్డడు." నవ్వుకుంట శెప్తున్న బుడ్డోడ్ని సూత్తున్న అవ్వకి సుత మస్తు నవ్వొచ్చింది.
"అయ్యో!గట్లెట్ల పడ్డర్రా!ఇంతకి లేశిండా?శెయ్యి అందియ్యకవొయినవ్?" నేనొత్త పా అనే లోపుల్నే..."
 "అవ్వోవ్! మావని లేపబోయి నాయిన సుత జారిండు." ఉర్రికొచ్చి నవ్వుకుంట శెప్పింది భూలచ్మి."
 "గిదేంది.  ఒకలి తర్వాత ఒకలు గిట్లెట్ల పడ్తుండ్రు.లైటుబుగ్గ ఏస్కోలేదా? కిందేమన్నుందో సూస్కోలేదా?"
 ఓ వైపు నవ్వు మరో వైపు కాల్జేతులేడన్న యిరిగినయా ఏందనే భయమేసింది అవ్వకి.
 "పాండిరా! సూద్దాం" అనే లోంగనే బుడ్డోడు భూలచ్మి సుత గాళ్ళని లేపబొయ్యి పడ్డరు.కింద పడ్డోళ్ళు  లేవలేక జర్రు జర్రున జారుతుంటే సూశి అవ్వకి, అప్పుడే ఆడికొచ్చిన కోడల్కి సుత నవ్వాగలేదు. శెయ్యిపట్కొని గుంజి వాళ్ళని సుత జారిపడేల శేత్తరేమోనని బయపడ్డ అవ్వ పెద్ద కందిలి ఎలిగిచ్చుకొని వొచ్చింది.
 గక్కడ బండి పయ్యెల ఇరుసుకు పూసే గిరీజు కిందొలికి వుంది.మస్క శీకట్ల కాన్రాక గదాని మీద కాలేసి నల్గురు గట్ల జారిండ్రు."
అవ్వ గబ్బగబ్బ గోనె బత్త పట్కొచ్చి గాళ్ళ కాళ్ళు శేతులు తుడ్పిచ్చింది. వొలికిన గిరీజునంత పాత గుడ్డలతో తుడిశి సుబ్బరం జేసే తల్కి అవ్వకీ కోడల్కి నడుములు టింగ్ మన్నయి.
 "అవ్వా! నువ్వు తేమన్న వొత్తువేదో ఉండే? గా జారుట్ల యాది మర్శిన" అంటున్న  గోపి మాటల్కి ఫక్కున నవ్వుకుంట "ఆకుబోయి బాయిల బడ్తే ఎతకబోయి ఏడుగురు పడ్డరట" అన్నట్టుంది గీ కత. మీ యవ్వారం. అసల్దే మర్శినావు.నేనేం జెప్పిన "గా సామాన్ల అర్రకి బొయ్యి ఎడంచెయ్యి మూలనున్న పాతాళ గరిగె తేరా! రేప్పొద్దుగాల బాయిల బడ్డ బొక్కెన పైకి తియ్యాలె" అని  పనిమాల కందిలి బట్కొని పొమ్మని జెప్తే గద్దీస్కొని బోకుంట నువ్వు జారుడే గాక గీళ్ళని సుత జారేలా జేత్తవార అయ్య." అంటుంటే...
 "అవ్వా! అవ్వా !గా కతేందో శెప్పవా ? మా లెక్కనే పడ్డరా? గాల్లెవలో?"
అంటున్న బుడ్డోడితో "నువ్వు సరెరా అయ్యా! కత మాట శెవుల బడ్తె సాలు.శెవి కోస్కుంటవు.శెప్పేదనుక జెనిగె పట్టు వొదలవు గద!"
 "అనగనగా ఎన్కట మీ లెక్కనే ఏడుగురు తెల్వి తక్కువోళ్ళు ఉండేటోళ్ళు."
అంటే పర్మానందయ్య శిష్షులొతికెనా అవ్వా?" భూలచ్మి మాటల్కి సంబురపడ్కుంట"బలే శెప్పినవ్ బిడ్డా!"
 "గా ఏడుగుర్ని ఇంటెన్కాల బాయి కాడంత సుబ్బరం శెయ్యుండ్రి.శెత్త శెదారం ఏరి బత్తల బోయుండ్రి. గంతే గని బాయి జోలికి పోకుండ్రి.గందుల శెత్త శెదారం పడనీయకుండ్రి"అని శిలక్కి జెప్పినట్టు శెప్పి  లోపల్కి బోయింది.గంతే కూసేపట్లనే ధబిల్లు ధబిళ్ళు మన్న సప్పుడికి బాయి కాడికి ఉరికొచ్చి లోపల్కి సూశే తల్కి ఏముంది . గా ఏడుగురు బాయిల బడి లబ్బ లబ్బ మొత్తుకోబట్టిండ్రు.
 "గా ఇంటి ఓనరమ్మ గజ్జూసి లాశిగ కీకలు బెట్టుడు యిని సుట్టుపక్కలోల్లు పోగై గాళ్ళని బయటికి తీశి...
 ఒక్కలు గాదు ఇద్దరు గాదు గట్లెట్ల ఏడుగురు బాయిల బడ్డర్రా ? నవ్వుకుంట అడ్గుతుంటే...
 "ఓనరమ్మ మాకు"బాయిల ఏం పడ్నీయకండి అని  శెప్పింది"
"అయితే! గింతల్నే ఓ ఆకు రాలి బాయిల బడ్డది.గద్దియ్యనీకి ఏడుగురం బాయిల దూకినం గని గందుల పడ్డ ఆకస్సలు దొర్కనే లేదు అంటుంటే "వార్నీ ఎర్రిమాలోకం!" అన్కుంట పడీ పడీ నవ్విండ్రు.
 'గదిరా మన్వడా! కత! అంటుంటే కొడుకు,కోడలు,గోపి అందరూ ఒక్క తీర్గ నవ్వబట్టిండ్రు.
గదండీ కత! "ఆకుబోయి బాయిల బడ్తే ఎతకబోయి ఏడుగురు పడ్డరట" అంటే గిట్లనే వుంటది మరి.
కామెంట్‌లు