అక్షరాల అక్షయ ప్రవాహం: - — గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాలు పుట్టకొస్తున్నాయి —
మౌనపు గర్భంలో నిద్రించిన
ఆలోచనలకు ప్రాణం పోయమంటూ.

అక్షరాలు ప్రకాశిస్తున్నాయి —
అర్థాల సూర్యకాంతిగా
అజ్ఞానపు చీకటిని తరుమమంటూ.

అక్షరాలు పరుగెత్తుతున్నాయి —
కవితా నదీ ప్రవాహంలో
భావాల తీరం తాకమంటూ.

అక్షరాలు పయనిస్తున్నాయి —
కాలపు బాటలో
తరంనుంచి తరానికి వంతెనకట్టమంటూ.

అక్షరాలు పరిమళిస్తున్నాయి —
సాహిత్య సుగంధంగా
హృదయాల లోతులకు చేరుతామంటూ.

అక్షరాలు పల్లవిస్తున్నాయి —
కవిత్వ వసంతంలో
రసాల కోయిలలై ఆలపిస్తామంటూ.

అక్షరాలు పంక్తులవుతున్నాయి —
అనుభవాల శ్రేణులై
జీవితానికి అర్థం చెబుతామంటూ.

అక్షరాలు పరవశపరుస్తున్నాయి —
రచయితల మనసులను మాత్రమే కాదు,
చదువరుల ఆత్మలను కూడా.

అక్షరాలు ప్రేమిస్తున్నాయి —
వలపులవిరితోటలో విహరిద్దామని
సాహితీలోకంలో సంసారం చేద్దామనీ.


కామెంట్‌లు