అణగిన గర్వం: - - యామిజాల జగదీశ్
 ఒకానొక గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను తాను చాలా చదువుకున్నవాడినని గొప్పలు చెప్పుకుంటూ గ్రామంలో తిరుగుతున్నాడు.
అతని అహంకారాన్ని  అణచాలనుకున్న ఒక కొంటెవాడు అతనితో  "ఓ పండితుడా! మీరు ఈ గ్రామం గురించి మీ గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు మరొక ప్రదేశానికి వెళ్లి, అక్కడి పండితులతో వాదించి గెలిస్తే, మీ పేరుతోపాటు మన గ్రామ కీర్తి మరింత పెరుగుతుంది కదా?" అన్నాడు.
ఆ పండితుడు ఆలోచించి ఔను అదీ నిజమే కదా అనుకున్నాడు.  అందుకని, ఒక మంచి రోజు చూసుకుని అతను తన గ్రామం నుంచి పొరుగున ఉన్న పట్టణానికి బయలుదేరాడు.
అతను ఆ పట్టణ సరిహద్దుకు చేరుకోవడంతోనే అక్కడ ఒక బాలుడు ఆవులను మేపుతూ కనిపించాడు. ఆ పండితుడు అతనితో ఇలా అన్నాడు 
"ఈ గ్రామంలో ఎవరైనా పండితులు ఉన్నారా? ఉంటే, నేను అతనితో వాదించి గెలుస్తాను" అని.
"అలాగాండీ" అంటూ ఆ బాలుడు తన చేతిలో గుప్పెడు మట్టి తీసుకుని, "నా చేతిలో ఎంత మట్టి ఉందో చెప్పండి?" అని అడిగాడు.
ఆ మాటతో, ఆ పండితుడికి కొంచెం కోపం వచ్చింది.
"ఇదేం ప్రశ్న? నాకెలా తెలుస్తుంది? మట్టిని నేను కొలిచేనా లేక తూచేనా?" అని అన్నాడు పండితుడు.
అప్పుడు ఆ బాలుడు నవ్వి  "నేనడిగిన దానికి ఎలా చెప్పాలో కూడా తెలియని మీరు పండితులా? నా చేతిలో ఉన్నది కేవలం గుప్పెడు మట్టి మాత్రమే. ఇది కూడా చెప్పలేని మీరు గొప్ప పండితుడినని చెప్పుకుంటూ ఇతరులతో వాదించబోతున్నారా?” అని అమాయకంగా మొహం పెట్టాడు.
దాంతో ఆ పండితుడు సిగ్గుతో తల దించుకుని తన గ్రామానికే తిరిగి వెళ్ళిపోయాడు.
====================================

(తమిళంలో చదివాను.‌ రచయిత పేరు తెలీలేదు)
కామెంట్‌లు