నిర్వచనం, చరిత్ర:
మాతృభాష అంటే తల్లి భాష. తల్లిదండ్రులు బాల్యంనుండే మాతృభాషను నేర్పిస్తారు. " మనస్సులో ఉన్న భావాలను మాటలరూపంలో చెప్పడాన్ని భాష అంటారు. తన జాతి ఆచార వ్యవహారాలను తనవారి తీరుతెన్నులను కట్టుబొట్టు మున్నగు సంప్రదాయాలవంటి అనేక విశేషాలను బాల్యంనుండే తెలుసుకోవడానికి అనువైనది మాతృభాష. ఎవరైనా మాతృభాషలో పట్టు సాధిస్తేనే ఇతర భాషలు అలవోకగా నేర్చుకుంటారు. తెలుగు భాష గొప్పది. రెండువేల యేండ్లకు పైగా చరిత్ర ఉంది. అనేక శాసనాలు, గ్రంథాలు తెలుగుభాష చరిత్ర గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.ఆంధ్ర పదం ఆయా కాలాల్లో జాతివాచకంగాను,దేశవాచకంగాను,భాషావాచకంగాను వాడారు.ఆంధ్రపదం మొదటి సారిగా జాతివాచకంగా ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ.800-600)లో శునశ్శేపుని వృత్తాంతంలో కనిపిస్తుంది. భరతుడు నాట్య శాస్త్రంలో ఆంధ్ర అనే పదాన్ని భాషాపదంగా ప్రయోగించాడు. భారతంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది.ఆంధ్రుల పేరుతోనే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.2వ శతబ్దంలో కొత్తూరు శాసనంలో "తమ్బయ" తెలుగు పదం ఉంది. క్రీ.శ. 525లో కడప జిల్లా కమలాపురంలో ఎరుకల్ ముత్తురాజు ఎర్రగుడిపాడు శాసనం తొలిగద్య శాసనం. క్రీ.శ. 885లో యుద్ధమల్లుని శాసనంలో మధ్యాక్కర పదాలున్నాయి. క్రీ.శ. 945లో వేములవాడ చాళుక్య జినవల్లభుడు కురిక్యాల శాసనంలో బొమ్మలమ్మ గుట్టలో కందపద్యాలు వేశాడు. విద్యానాధుడు త్రిలింగ పదం వాడాడు. త్రిలింగ నుంచి తెలుగు పదం పుట్టిందనీ విమర్శకుల అభిప్రాయం. తెలంగాణ కూడా భాష పేరుతోనే ఏర్పడిన ప్రాంతం అని పండితులు అభిప్రాయం. తెలుగు+ ఆణెం - తెలంగాణం- తెలంగాణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా మాట్లాడుతున్నారు.
మాతృభాష ఆవశ్యకత,లాభాలు:
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రాథమిక, మాధ్యమిక ఉన్నతస్థాయి విద్య మాతృభాషలోనే జరుపబడుచున్నది. కానీ ప్రభుత్వం జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంకను ఇంగ్లీషు భాషలోనే నడుస్తున్నవి. విశ్వవిద్యాలయస్థాయిలో పూర్తిగా మాతృభాషా బోధన జరుగడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉన్నత విశ్వవిద్యాలయ విద్యను నేర్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది మాతృభాషలో చదివినవారికి ఉద్యోగావకాశాలు లేకపోవడమే కారణం. రశ్యావంటి పెద్ద దేశాలలో రశ్యాభాషకే ప్రాధాన్యత ఉంది. జపాన్లో జపాన్ భాష మాధ్యమంగా విద్యాబోధన జరుగుతున్నందున ఆదేశం వెనుకబడలేదు. చైనా, జర్మన్, ప్రాన్సు దేశాలు ఇంగ్లీషుకు ప్రాధాన్యతనిస్తూ మాతృభాషల్లోనే బోధన, పాలనలు జరుపుకొంటున్నందున అవి పురోగతిని సాధిస్తున్నాయి. మనదేశంలో కేంద్రీయ విద్యావిధానంలో ప్రాథమిక స్థాయిలో ఇచ్చిన ఉన్నతస్థాయిలోకూడా ఇవ్వాలి.
మాతృభాషలో సంభాషణ, విషయవిశ్లేషణ చేయడం తేలిక. శ్రద్ధతో నేర్చుకోవచ్చును. భావవ్యక్తీకరణ సులభం. జ్ఞానార్జన, అవగాహన, మూర్తిమత్వ వికాసాలకు తోడ్పడుతుంది. ప్రభుత్వం,విద్యాధికులు మాతృభాషలో విద్యాబోధనకు మరింత కృషి చేయాలి. నిర్భంధగా ఒకస్థాయివరకు నేర్పించడం చాలా అవసరం. ఇతర భాషలను నేర్చుకునే అవకాశంకూడా కల్పించాలి. మాతృభాషతోపాటు ఇతరభాషలనుకూడా నేర్చే విద్యార్థికీ సమాధానాలు రాసే భాషను ఎన్నుకునే స్వేచ్ఛనును కల్పించాలి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. తెలుగుభాషా సంఘాలు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నా ఇంకా విస్తరించాలి. తెలంగాణ తెలుభాషా సంఘం సిరిసిల్లలో తెలుగులో 99మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంతమందికి వచ్చినా వెయ్యి రూపాయల బహుమతులు అందించారు. భాషాసాహిత్యంలో ప్రోత్సహిస్తున్నారు.
తెలుగుభాష అమలులో లోపాలు :
1.ప్రజలకు భాషాభిమానం లేకపోవడం. 2.ఉద్యోగాలు రావనే భావన. 3ఇంగ్లీషు వస్తే ప్రపంచంలో ఎక్కడైన బతుకచ్చు అనే భావన. 4.పాలకులు శ్రద్ద పెట్టకపోవడం. 5. సాహిత్యభాషగా కాకుండా ,బోధన పరిపాలన భాషగా ప్రవేశపెట్టడంలో లోపం. 6. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో అనువాదం చేయడం.
తెలుగు భాషాభివృద్ధికి చర్యలు :
1. మాతృభాషా సంస్కృతులపట్ల సరైన అవగాహన కల్పించాలి. ప్రజలభాష పాలనభాష ఒకటికావాలి. 2.తేలిక మాటలు, సరళవాక్యాలతో భాషను అలవరుచాలి.3. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా అధికారిక సమావేశాల్లో తెలుగులోనే భాషించాలి. ఉత్తర్వులు తెలుగులో ఉండాలి.4. తెలుగుభాషా దినోత్సవం, వారోత్సవం, తెలుగుమహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించాలి.5.నిఘంటువులు, కవుల పుస్తకాలు ముద్రించి ప్రచారం చేయాలి. పుస్తక ప్రదర్శనలు చేపట్టాలి.6. ఆధునిక సాంకేతికతను జోడించి భాషాభివృద్ధికి కృషిచేయాలి. 7. నిధులు కెటాయించాలి. పోటీ పరీక్షలు తెలుగులో లేకుండా ఇతరభాషలలో ముద్రించరాదు. 8.కొఠారికమీషన్ నిబంధనలు అమలుచేయాలి. 9.మాతృభాషను ప్రేమించాలి. ఇతరభాషలనుకూడా గౌరవించాలి. 10.చదువంటే ఇంగ్లీషు అన్న భావన పోవాలి. భావదాస్యాన్ని వదిలించుకోవాలి.
భాషాభివృద్ధికి భాషోపాధ్యాయుల కృషి కర్తవ్యం :
మాతృభాషాభివృద్ధిలో భాషోపాధ్యాయులే కీలకం. వీరు నిర్లక్ష్యం చేయరాదు. నేను బ్రతికితే చాలు భాష ఏమైనాకానీ అనే భావన విడిచిపెట్టాలి. భాషాభివృద్ధికి భాషోపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలి.మొదట మాట్లాడటం నేర్పి తర్వాత చదువడం, రాయడం నేర్పాలి. పదజాలంను పెంపొందించేందుకు పదక్రీడలు, పదబంధాలు నేర్పాలి. ప్రథమ,ద్వితీయ భాషలయందలి సమానార్ధక, వ్యతిరేకార్ధక బోధక పదాలను నేర్పాలి. భాషాంతరీకరణ సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి.లిపి రాయడంలో సమవేగాన్ని, అందాన్ని, శైలిని ప్రోత్సహించాలి. శ్రవణం,పఠణం, భాషణం, లేఖణం నైపుణ్యాలను నేర్పాలి.
రాష్ట్రప్రభుత్వం 2005-06 సంవత్సరానికి పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించి అమలు చేశారు. 2006-07లో మొదటిసారిగా చదువు, ఆనందించు,అభివృద్ధిచెందు పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పిల్లలను తెలుగు పాఠాలను చదివడం,ఉక్తలేఖనం ప్రగతిని నిర్ధారించుకోవాలి. పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సహించాలి. భాగస్వామ్యం చేయాలి. గోడ పత్రికలు నిర్వహించాలి. బాలల సంఘాలు ఏర్పాటు చేయాలి. ప్రగతి నమోదు డైరీ ఏర్పాటు చేయాలి. భాషోత్సవం నిర్వహించి ఉపన్యాసం, పాటలపోటీ, క్విజ్,బొమ్మలు వేయడం ,కథలు చెప్పడం ,నాటికలు వేయడం, పోటీతత్వంలో ప్రోత్సహించి ఆత్మస్థైర్యాన్ని నింపాలి. గ్రంథాలయంలో కి ప్రోత్సహించాలి.
బాలసాహిత్యం ప్రోత్సహించాలి. కార్యశాలల్లో కవిసమ్మేళనంలో ,సదస్సులో పాల్గొనేలా చేయాలి. భాషాసాహిత్యాలపై మమకారం పెరుగుతుంది. విద్యాలయాల్లో తపాలపెట్టె ఏర్పాటు చేయాలి. స్వేచ్ఛగా ఆలోచనలు తెలుపడానికి తోడ్పడుతుంది.
భాషోపాధ్యాయులు తెలుగు ప్రముఖ కవులను పరిచయం చేయాలి. పద్యపఠణం,కవితాపఠణం చేయాలి. పాటలు ఆలపించాలి. పిల్లల స్థాయికి దిగి ఆస్థాయికి ఎదిగి ప్రొత్సహించాలి. తెలుగు సంస్కృతి, చరిత్ర,వైభవం తెలుపాలి. నైతిక విలువలు బోధించాలి. మాతృభాషా మాధుర్యాన్ని అందించాలి.తప్పకుండా మాతృభాషాభివృద్ధి జరుగుతుంది.
- డాక్టర్ వాసరవేణి పర్శరాములు, సింగారం ,యెల్లారెడ్డిపేట మండలం ,రాజన్న సిరిసిల్ల, తెలంగాణ,సెల్ 9492193437



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి