ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము- 208 వ రోజు
బృహస్పతి ఇంద్రుని వెతికించుట
బృహస్పతి అగ్ని దేవుని పిలిచి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూసాడు. అష్ట దిక్కులు, భూమి, అంతరిక్షం, కొండలు అడవులు ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియ లేదు. అగ్ని " దేవగురూ! నాకు సాధ్యమైనంత వెతికాను ఎక్కడా కనిపించ లేదు. సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ళ నుండి లోహములు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా తమ జన్మ స్థానంలో చెల్లదు. కనుక నాకు జలప్రవేశం నిషిద్ధం కనుక అక్కడ నేను వెతకలేను " అన్నాడు. బృహస్పతి " అగ్నిదేవా! నీకు సకల చరాచరములలో ప్రవేశం కలదు. నీవు చేరజాలని ప్రదేశం లేదు. నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హత కలిగిస్తాను. అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు " అన్నాడు. ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామర తూడులో ఉన్న ఇంద్రుని కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో " ఇంద్రా! నీ తప్పు ఏమీ లేదు. వృత్తాసురుని వధ ఎలా పాపం ఔతుంది. నీ తప్పు లేకనే నువ్వు పదవి త్యజించావు. మార్గాంతరం లేక నహుషునికి పదవి కట్ట పెడితే అతడు దేవతలు ఇచ్చిన శక్తితో బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు. తనను మోయడానికి ముని పల్లకి ఉపయోగించి తన శక్తి క్షీణింప చేసుకున్నాడు కనుక ఇది అతనిని జయించడానికి తగిన సమయం. నీవు వచ్చిన సమయంలో నహుషుడు బలవంతుడు కాని ఇప్పుడు అతడు శక్తి హీనుడు. అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు కనుక నీవు వచ్చి నహుషుని జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు " అన్నాడు. అష్టదిక్పాలకులు కూడా ఇంద్రుని వద్దకు వచ్చారు. అందరూ నహుషుని జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడు అక్కడకు వచ్చి " ఇంద్రా నహుషుడు పదవీ భ్రష్టుడు అయ్యాడు. ఇక నీవీ నీ సింహాసనం అధిష్టించ వచ్చు " అన్నాడు.
నహుషుడు పదవీ భ్రష్టుడు అగుట
ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి నహుషుడు ఎలా పదవీచ్యుతుడైనాడు చెప్పని అడిగాడు. అగస్త్యుడు " మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో ఒకనాడు నహుషుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్టి జరుపుతున్న సమయంలో ఋషులు ఇలా అడిగారు " గో సంప్రోక్షణమందు బ్రాహ్మణములయిన మంత్రములు చెప్పబడినవి అవి నీకు ప్రమాణ భూతములా " అని అడిగారు. అందుకు నహుషుడు " గర్వంతో అవి నాకు ప్రమాణమలు కావు " అన్నాడు. నేను అతనికి అడ్డు చెపుతూ " ఋషులచే అభినందితమైన మంత్రములను నిందించుట అజ్ఞానము " అన్నాను. అందుకు నహుషుడు కోపించి నా తలపై తన్నాడు. దానితో అతని పుణ్యమూ, తేజమును కోల్పోయాడు. అప్పుడు నేను " నహుషా ! మునులను వాహనంగా చేసుకుని వారిని అవమానించావు. వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని నిరసించావు. నన్ను అవమానించావు కనుక నీవు పదవీ భ్రష్టుడివై ఇంద్రలోకం నుండి పతనమై భూలోకమున సర్ప రూపమున అనేక సంవత్సరములు నివసించెదవు కాక " అని శపించాను. నహుషుడు నన్ను పరి పరి విధాల ప్రార్ధించగా అతడికి శాపవిమోచనం చెప్పాను. ధర్మపరుడు సత్పురుషుడైన యుధిష్టరుని చూసిన తరువాత అతని పాపములు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదు అని చెప్పాను " అన్నాడు. ఇంద్రుడు అగస్త్యునికి పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుని అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్టించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు " అని వివరించాడు. శల్యుడు మరలా " ధర్మరాజా! ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించాడు. కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించ వలదు. దుర్యోధనుడు నహుషుని వలె నశించక తప్పదు " అన్నాడు. ధర్మరాజు శల్యునికి కర్ణుని నిరుత్సాహ పరచడం గురించి గుర్తు చేసాడు. శల్యుడు అందుకు అంగీకారం తెలిపి ఇంకా ఏమైనా ఉంటె తప్పకచేస్తానని సేనలతో హస్థినకు బయలు దేరాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి