సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము: 196 వ రోజు
విజయవార్తను విరాటునికి తెలుపుట
దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయం కలవర పరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహా వీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్ళిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తా హరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేసారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. " ఏమి మన ఉత్తరుడు కురుసైన్యాలను గెలిచాడా. వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి " అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుభట్టుని చూసి " కంకా! ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా " అన్నాడు. ధర్మరాజు " మహారాజా! తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా " అన్నాడు. విరాటుడు పెద్దగా నవ్వి " సైరంధ్రీ! పాచికలు తీసుకురా " అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు.
విరాటుడు ధర్మరాజు మిదకు పాచికలు విసరుట
ఆట ప్రారంభం అయింది విరాటుడు ధర్మరాజుతో " కంకా! అశేషమైన కురుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా " అన్నాడు. ధర్మరాజు " బృహన్నల రథసారధిగా వుండగా విజయము సాధించటము పెద్దవిశేషము కాదు కదా " అన్నాడు. విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి " కంకుభట్టా ! నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంత వరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను ఇక మీదట అలా కాదు " అన్నాడు. కాని కంకుభట్టు అంతంటితో వదల లేదు " ఒక్క కౌరవ సేనే కాదు. దేవతలు, రాక్షసులు కలసి వచ్చినా బృహన్నల రధ సారధ్యం వహిస్తుండగా ఉత్తరుని జయించడం ఎవరికి సాధ్యం కాదు " అన్నాడు. విరాటుడు కోపం పట్ట లేక పోయాడు " కంకూ! ఇక చాలు నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియూ, సారధి శత్రువులను జయించడమా! నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు. ఇక నీ మూర్ఖపు మాటలు కట్టి పెట్టు విప్రుడా " అన్నాడు. కాని ధర్మరాజు ఆపకుండా " అవును విరాటరాజా ! బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారధిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయ వార్తను నగరంలో చాటించు " అన్నాడు. విరాటుడిక ఆగలేక " ఆ పేడిని నా ముందు పొగుడుతావా " అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. అందులో ఒక పాచిక ధర్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. ఇదిచూసి విరాటుడు " సైరంధ్రీ ! అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు " మహారాజా ! ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేసాను " అన్నది సైరంధ్రి.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు