సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము-195 వ రోజు
అర్జునుని సమ్మోహన అస్త్రప్రయోగము
ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో భీష్మద్రోణ కృపాచార్యులను యుద్ధసన్నద్ధులను చేసి ఒక్కసారిగా అర్జునిని మీద దాడి చేసాడు. వారంతా సుయోధనుని రక్షిస్తూ అర్జునినితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు సారథిని కాపాడు కుంటూ వారందిరితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మనసులో " సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు అది భీమసేనుని ప్రతిజ్ఞ. కువీరులందరితో యుద్ధం చేయడమైంది. ఇక వీరోచితంగా తప్పుకోవడం ఉచితం. ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు తీసుకు వెళ్ళాలి. కురువీరుల తలపాగాలు పట్టుకెళ్ళడం అంటే వారందరిని జయించినట్లే. అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహనాస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తాను " అనుకుని కురు సైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్ర ప్రభావానికి కురు సైన్యమంతా నిస్తేజంగా పడి పోయింది. ఆ అస్త్రానికి అధి దేవత ఇంద్రుడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కౌరవులంతా స్పృహతప్పి పడిపోయారు. నీవు పోయి సుయోధనుడు, అశ్వథ్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణాది వీరుల తపాగాలు తీసుకురా. భీష్ముని జోలికి మాత్రం పోవద్దు. అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదు అతడు నిద్ర నటిస్తున్నాడంతే " అన్నాడు. ఉత్తరకుమారుడు అర్జునుడు చెప్పినట్లే తపాగాలు తీసుకుని రథం ఎక్కాడు. ఉత్తరకుమారునితో చెప్పి అర్జునుడు రథాన్ని కొంచం దూరం యుద్ధరంగంలో నుండి తీసుకు పోయి ఆగాడు. ఇంతలో కురువీరులందరికి తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునినితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భీష్ముడు " సుయోధనా! జరిగినది నీవు ఎరుగవు. మీరంతా అస్త్రప్రభావానికి తెలివి తప్పారు అర్జునుడు మీ తల పాగాలు మాత్రమే తీసుకు వెళ్ళాడు. మీ తలలు నరికి తీసుకు వెళితే ఏమయ్యేది అర్జునిని కరుణ నిన్ను రక్షించింది. తిరిగి యుద్ధానికి సిద్ధం అయితే పూర్ణాహుతి ఇప్పుడే జరుగుతుంది. విడిపించిన గోవులు విరాటనగరానికి చేరాయి. జరిగినది చాలు వెనుకకు మరలుము " అన్నాడు. ఆ మాటలకు సుయోధనుడు నిట్టూర్ఛాడు. అర్జునిని వదలాలని లేకున్నా తాతాగారి మాటకు తలవంచాడు. కురుసైన్యం కూడా సుయోధనిని అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు. కురు సైన్యం వెనుతిరిగింది.
అర్జునుడు కురుసేనకు వీడ్కోలు పలుకుట
ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించాడు. ఒక్క బాణంతో సుయోధనుని కిరీటంలోని మణులను ఊడగొట్టాడు. ఇక నేను పోయివస్తానని పెద్దగా అరచి చెప్పాడు. ఉత్తరకుమారుని చూసి " కుమారా ! మనం కురుసేనను జయించాము, గోవులను మరలించాము, ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు సేకరించాము ఇక రాజధానికి మరలి వెడతాము " అన్నాడు. ఉత్తరుడు రథాన్ని వెనుకకు మరల్చాడు. అర్జునుడు " కుమారా ! కురుసేనలను నీవే జయించావని చెప్పు " అన్నాడు. ఊత్తరుడు నవ్వి " అర్జునా ! కురుసేనలను నేను జయించలేనని అక్కడ వారందరికి తెలుసు. నిజం దాచడం కష్టం కాని నీ మాట కాదనలేను. నీవు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను " అన్నాడు. రథం శమీవృక్షాన్ని చేరుకుంది. గాండీవం మొదలైన ఆయుధాలను తిరిగి శమీవృక్షం మీద దాచారు. అర్జునుడు బృహన్నల వేషం ధరించి సారథ్యం చేపట్టాడు. ఉత్తరుడు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు --"-కుమారా ! మన విజయ వార్తను ముందుగా వెళ్ళి విరాటునికి తెలుపమని గోపాలురకు చెప్పు " అన్నాడు. వార్తాహరులు అలాగే వెళ్ళారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు