సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -181: - ఆర్నెల్లు సాము నేర్చి మూలకున్న ముసలయ్య మీద పడ్డట్టు
****
"ఏందిరా వారీ! గిదెక్కడి అన్నేలం. నీ సోపతి గాడికి బుద్ధి, గ్యానం ఏమన్నుందా? హవ్వ !ఊల్లె అందరి నోళ్ళల్ల గాడి పేరే నాన్తోంది."
 ఏందే అవ్వా! పొద్దు పొద్దుగాల నా దోస్తుగాని మీద బడ్డవు.నిన్న మొన్న ఆరం దినాల్నించి ఊల్లెనే లేక పోతిని.రాతిరొచ్చినోడికి గీ యిష్యాలన్నీ ఎట్ల తెలుత్తయే నువ్వే శెప్పు!"
 "కాదురా అయ్యా! గీ నడ్మల నీ దోత్తు ఏదో సాము గరిడీలు నేర్సుకుంటుండంట గదరా! గా ముచ్చెటి నాకు చెప్పకనే పోతివి?"
కాదే అవ్వా! గిస్మంటి ముచ్చెటి సుత శెప్పాల్నా? గాడ్ని మా దోస్తుగాల్లంతా బక్కోడు బక్కోడని బనాయిత్తుంటే శెరానికొచ్చిండు."బక్కోడన్న మీరే నా బలాన్ని సూశి ఆచ్చిర పోవాలె" అన్కుంట తాలింఖాన కెల్లి సాములు నేరుత్తుండు.
 "ఇంతకీ ఎవలతోనన్న సాముల పోటీకి దిగిండా ఏంది? అంటే బాగనే నేర్సుకుండన్న మాట.ఇంతకీ గాని శేతిల ఎవలోడి పోయిండ్రో....మిలిగిన దోస్తులకు గీ యిష్యం శెప్పాలె. జల్ది శాయ సుక్క బొయ్యే! ఆత్రమాగడం లేదు."
 ఒరేయ్ వారీ! గిట్ల నేను ఒక్కటడిగిన్నో లేదో నీ దోత్తు పనితనం గురించి ఏదేదో గొప్పగ ఊయించుకుంటున్నవ్! అస్లిషయం తెలిత్తేనా!
 నీ యవ్వ! నువ్వేగదనే  గాడి యిష్యం అప్పటి సంది శెప్తున్నవ్! గిప్పుడేమో గిట్లంటున్నవ్! అసలే బక్క పానం గీ నడ్మల గా  సాములు నేర్సుకోడం వల్ల కూసింత శిక్కబడ్డడు. గాడేదో  ఘన కార్యం సేశిండన్నవ్! అందరి నోళ్ళల్ల బడ్డడన్నవ్! నాకైతే ఏం సమజైతలేదవ్వా!"
 "శెవు వారిచ్చి గిదిను.గాని తాత గదేందో పేరు యాది మర్శిన.గా ముసలయ్య మీద పతాపం సూపిండు నీ దోత్తు.గాడు గెల్సుడేమొ గని పాపం గా ముసలయ్య అన్ను బట్టి గుడ్లు తేలేశి గంట దాకా ఆయెపాయె సేశిండు. ఊల్లె అందరం ఉర్కితిమి. ఊల్లె ఆరెంపి డాకటరును పిలిపిచ్చినం.గని గాయనొచ్చే సయిమానికే ముసలాయన తేరుకొని కండ్లు తెర్శిండనుకో.
 "ఉత్త పున్నేనికి నిండుపాణం పొయ్యేది. గిదిరా అయ్యా! నీ దోత్తు నిర్వాకం."
 ఓష్నీ అవ్వా! ఆర్నెల్ల సంది నేర్సుకొని శివరాకరికి గా ముసలాయన మీద  సూపిత్తడా! గాడి తెల్వేమైందసలు."
 గదే మరి! "ఆర్నెల్లు సాము నేర్శి మూలకున్న ముసలయ్య మీద పతాపం జూపినట్టుంది."
 "నిజ్జంగవ్వా! గాడు జేసింది గట్లనే ఉంది.ఎంత పని జేసిండు.గాన్ని నాల్గు దుల్పడానికైన బోవాలె"  అన్కుంట శాయి తాగిన గిలాస ఆడబెట్టి బయటికి ఎల్లిండు.
 గదండీ సంగతి! "ఆర్నెల్లు సాము నేర్చి మూలకున్న ముసలయ్య మీద పతాపం జూపినట్టు" అన్న  సామెత లెక్క ఉంది గదండీ గీని యవ్వారం."
కామెంట్‌లు