సామెత -171: ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడొచ్చినట్టు
***
అయ్యో ! ఆడెట్ల బత్కుతుండో! ఎట్ల పెండ్లాం పిల్లల్ని సాదుకుంటుండో! ఊల్లె గింత ఇల్లు దప్ప,అడివిల గుంట పొలమో,శెలకో లేదాయె అన్న సోయి గింతన్న ఉండాల్నా లేదా? ఏం మడుసులో ఏమో! అంటే అన్ననని రద్ది చేత్తరు.
"ఏంది శెల్లె! ఎవలి గురించి రంది చేత్తున్నవు? గంతగనం మన్సు కట్టమయ్యే ఇష్యం ఏం జరిగింది?"
"అయ్యో అవ్వా! గజ్జెప్పనీకె నీ తానకొచ్చిన. తల్సుకున్నాకొద్ధి మస్తు బాదైతాంది. గిదిన్నంక ఆయా బాయా! నీకెందుకు రంది అంటారేమో గని పొల్లగాన్ని సూత్తె ఉసూరుమనిపిత్తోంది. ఎన్నాల్టి పోరడు.మన కండ్ల ముందు లాగులు నిక్కర్లేసుకుని పెరిగినోడు.
"కొడుక్కావాల్నో గాని అమ్మ నాయిన ఏడుగురు ఆడపొల్లలను గన్నరు. అయినా మొగ పోరని ఆశ సావక ఎనిమిదో కాన్పు సూడంగ పుట్టిండు. నాయిన శిన్న తనాన కాలం చేత్తే! గాని అమ్మ కన్నమ్మ కట్టాలు బడి ఎన్మిది మంది సంతుని సాదుకుంది.
ఏంది శెల్లే! గా తుల్శమ్మ ఇష్యమేనా నువ్ జెప్పేది. ఎన్నల్లేంది నీ మన్సు గాళ్లైపు మళ్ళిందేంది?
"నా నెత్తిన ఇత్తు పడ్డ కానించి సూత్తున్న గాళ్ళ సంసారం.పక్కపక్కనే ఇండ్లుగా అవ్వా! గాళ్ళ మంచి శెబర సూశిందాన్నైతిని.గందుకే మన్సాగక అన్కోవుడు గంతే."
"గదేందో మరి ఇషయం సూటిగా జెప్పరాదె శెల్లె."
"గక్కడికే వత్తున్న గజ్జెబ్దామనుకునే తల్కి గా పోరని కట్టసుఖం కండ్ల ముందు మెలిగింది."
"అయితే మాయె తీ! గది సుత జెప్పు."
గాడు కడగొట్టు సంతానమైండు.పైంగ వాళ్ళ కర్సులు,తన పెండ్లాం పిల్లల కర్సులు ఎట్ల ఎల్లదీస్తుండో గా దేవున్కే తెల్వాలె.
గస్మంటోడి ఇంటికొచ్చి రోజుల తరబడి వుండేటోళ్ళను సూత్తుంటే నువ్వేన్కో అవ్వా! వొల్లు మండిపొయ్యేది.గీ కర్సుల్ని ఎట్ల సుతలాయిచ్చుకుంటుండో ఏమో అన్పిత్తది. అట్లాంటిది గాళ్ళ అక్క తరఫున ఓసుట్టపాయనొచ్చి దినాలు దినాలు ఉండుడే కాకుండా అప్పు గావలన్నడంట అప్పు.
గీడేమన్న సంపన్న సావుకారినా.అక్కల కర్సులు తన సంసారం కర్సులతోనే కిందుమీదైతుండె. గీని కట్టంల గీడుంటే సూస్కుంట సుత గట్ల అడుగుడేందో నాకైతే సమజైతలేదవ్వా!"
గదే మరి శెల్లే! గీ కత ఎట్లుందంటే "ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడొచ్చినట్టు" ఉంది. గాని కట్టాలు సూస్కుంట సుత అడుగుడంటే గిదే మరి శెల్లే!
మా బాగ శెప్పినవు అవ్వా! గట్లనే ఉంది గీ యవ్వారమంత. గీ సామెత గీళ్ళకి మంచిగ అతికినట్టు సరిపోయింది. ఇంగ ఉంటవ్వా! ఆ తర్వాత ఏం జరుగుద్దో తెల్శినంక వొచ్చి శెప్త ఇంగ పోత.ఇంటికాడ యాడిపని ఆడ్నే వుంది." అన్కుంట బోయింది.
గదండీ సంగతి "ఆకుల్నాకే వాడింటికి మూతులు నాకేవాడొచ్చినట్టు" అంటే అర్తమైంది గద. గదండీ ఇష్యం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి