సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -179: ఆకలి ఆకాశమంత -గొంతు సూది బెజ్జమెంత
*****
"శెవ్వా! గింత బూకరోన్ని నా జల్మల సూడలేదవ్వా! ఏజ్జూసినా కావాలె కావాలె అనుడే. గట్లని ఆడి ఒంటికి ఇముడ్తదా... గొంతుల దిగుతదా అంటే గదీ లేదు. ఏమో పో శిత్ర శిత్రాల మడుసులు.ఇచ్ఛింత్రపు గుణాలు."
 ఎవలు శెల్లె! గా బూకరోడు? ఎందులో తిండి బూకరోడా? పైసల బూకరోడా? గంత ఆశపోతు గాడెవడే తల్లీ?"
 గాడే అవ్వా! నీకు సుత తెల్సు. నిల్కడ లేని నీలయ్య. గాడే.గిప్పటిదాక ఓ పది రకాల పనులు ముందలేస్కొని ఏదీ పురాగ కాకుండనే ఎల్లెల్కల బడ్డడు. "వొద్దురా అయ్యా! అని గాని అమ్మ నాయిన,తెల్శినోడు గదాని నేను ఒక్క తీర్గ శెప్పినం. ఇంటె గాడెట్లయితడు. అన్నీ తన బావుకుందామనే ఆశ.
 గదేందో గని గాని ఆశ తీరేది గాదు పాడు గాదు. సూశేటోళ్ళ నోళ్ళల బడుడేగని ఏమన్నుందా?"
ఆశ ఉండంగనే సరిపోద్దా అవ్వా!గది తీర్సుకో గల్గే శక్తి సుత ఉండాలె.అస్మంటి అవకాశాలు రావాలె.
 అవును శెల్లె! గిస్మంటోళ్ళ గురించే మన పెద్దోళ్ళు "ఆకలి ఆకాశమంత - గొంతు సూది బెజ్జమెంత" అన్నరు."
"అంటేందవ్వా! నాకేం సమజైతలే. గాడి ముచ్చెటికి,గీ సామెత కల్శిందంటవా?"
 "ఎందుకు కల్వలే కల్శింది శెల్లే! మన నీలయ్య ఎంత ఆశపాతకుడో తెల్సుగద. గాని ఆలోశన్లన్నీ గట్ల గావాలె.గిట్ల గావాలె అని ఆకాశంల పచ్చులోలె తిర్గుతుంటయి గని గవి తీరాలంటే గవీటికి తగ్గ సద్వేది? అవకాశాలేవి? గవి లేకుండా గాని కోరికలెట్ల తీర్తయి. గందుకే గాడి పయత్నం సూది బెజ్జమెంత అన్నరు. సూది బెజ్జంల సన్న దారం తీయొత్తది గని సుతిలి (పురికొస) దారం తీయొత్తదా. గట్లనే గాడి కోరికని ఆకలితో, ఆకలి అంతింత గాదు ఆకాశంతో పోల్శిండ్రు.?" 
 "భలే శెప్పినవ్ అవ్వా! గాడు జేసే శెకలకి గీ సామెతకి పురాగ సరిపోయింది. గందుకే నీ అస్మంటి యిడమర్శి శెప్పేటోళ్ళు ఉండాలవ్వా!"
 గదండీ సంగతి! "ఆకలి ఆకాశమంత - గొంతు సూది బెజ్జమెంత " అంటే గిదే మరి."

కామెంట్‌లు