అత్యాశ లేఖ: - యామిజాల జగదీశ్

 అదృష్టాన్ని నమ్మే వారికి
అత్యాశ రాసుకున్నది

ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు. అన్నింటికీ ఆశపడు అంటారు మరొక ఆధ్యాత్మిక వేత్త. ఆశను త్యజించడమంటే జీవించడం మొదలుకుని మౌలికమైన జీవితానికి అవసరమైన ఆశలను వదులుకోమని బుద్ధుడు చెప్పలేదు. ఆయన చెప్పదలచుకున్నది అత్యాశ గురించి.
సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటల ద్వారా బుద్ధుడి అభిప్రాయానికి భిన్నంగా అత్యాశను ఆయన సమర్థించినట్టు అర్థం చేసుకోవడమూ పొరపాటే అవుతుంది. ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశులపైనా ప్రేమను, పాశాన్ని ఉంచమనే ఆ వివరణ.
ఈనాటి జీవిత విధానంలో శ్రమను మాత్రమే నమ్ముకున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. శ్రమించకుండా లభించే సంపాదనను రుచి చూసాక దానినే జీవిత తత్వంగా భావించేవారెక్కువ మందే ఉన్నారు.
లంచం అనే ఓ భయంకరమైన జబ్బుని ఈ సమాజంలో ఎన్నో సంవత్సరాల క్రితమే వేళ్ళూనుకుంది. జీవితంలో ఓ తప్పించలేని అంశంగా మారిపోయింది.
ఇప్పుడు ఓ అధికారి తన బాధ్యతలను నిర్వర్తించడానికి లంచాన్ని ఆశిస్తే అది అనైతికమనో ఆశ్చర్యకరమైనో ఎవరికీ అనిపించడం లేదు. పరిమితికి మించి ఆ అధికారి డబ్బులు అడిగితే అప్పుడు కోపం వస్తోంది తప్ప ఓ న్యాయమైన రీతిలో డబ్బులు ఇచ్చ పనులు చేయించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. ఇందుకు మనిషి ఏ మాత్రం ఆలోచించడం లేదు.
ఈ విధమైన మానసికస్థితి నెలకొనడానికి ఓ విధంగా ప్రభుత్వమూ కారణమే. ఎన్నికలను మనసులో పెట్టుకుని పదవులను ఆశించి ప్రజలకు చాటుమాటుగా ప్రజాప్రతినిధులే లంచాలివ్వడానికి అలవాటుపడ్డారు. వారిస్తున్నప్పుడు మేముందుకు తీసుకోకూడదని వోటరూ అంటున్నాడు. ఇది ఏ విధంగా న్యాయమవుతుంది.
ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం కన్నా అందుకు అవసరమైన రీతిలో శ్రమపడే సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ అది చేసేదేవరు. వినేదెవరు. ప్రతి రాజకీయ పార్టీ వోటరుకు డబ్బులు ఇవ్వడానికి సంసిద్ధపడుతోంది.
ప్రజల ఈ ఉచిత అత్యాశనే దాదాపుగా ప్రతి వాణిజ్య సంస్థ అనుసరిస్తోంది. సెల్ ఫోన్ కొంటే మరొక సెల్ ఫోన్ ఉచితం....సబ్బు కొంటే బ్రష్ ఉచితం...టీవీ కొంటే డీవీడీ ప్లేయర్ ఉచితం...వాషింగ్ మిషన్ కొంటే మిక్సీ ఉచితం...పాత నగకు కొత్త నగ...ఒక చొక్కా కొంటే మరొక చొక్కా ఉచితం...అంటూ ఎటు చూసినా ఉచితం జనాన్ని పిలుస్తూ ఉంటుంది.
లాభం లేకుండా ఎవరూ ఈ ఉచితాలను ఇవ్వడం లేదని జనమూ ఆలోచించడం లేదేమోనని అనిపిస్తుంది. ఇది ఒక విధంగా బాధాకరమైన విషయం.
ప్రజల ఈ అత్యాశ ఈ సమాజంలో ఎన్ని రకాల తప్పులకు తెర తీస్తోందో అర్థం చేసుకోవాలి. ఒకవేళ జనానికి తెలిసినా సరే ఉచితాల కోసం పరుగులు తీయడం జరుగుతూనే ఉంది. దీనిని వాణిజ్య సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి ఎంచక్కా.
అన్ని బ్యాంకులూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సేవింగ్సుకి వడ్డీ ఇస్తున్నాయి. కానీ అధిక వడ్డీకి ఆశ పడి ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి డబ్బు కట్టేటప్పుడు ఇచ్చే ఉచితాలకు మోసపోయే వారు ఉంటూనే ఉన్నారు. ఫలానా సంస్థ తమనిలా మోసం చేసిందని నెత్తీనోరూ బాదుకుంటారు. కొందరైతే ఆత్మహత్యలకూ పాల్పడుతుండటం పత్రికల్లో చదవచ్చు. టీవీల్లో చూడవచ్చు.
మరొకవైపు అదృష్ట రాయి వ్యాపారులలో కొందరు, నకిలీ స్యామీజీలు, నకిలీ జ్యోతిష్కులు, ఇలా పలువురు పలు విధాలుగా జనాన్ని దగా చేస్తూనే ఉన్నారు.
ఫలానా రంగు రాయిని కొంటే లాభం, ఈ రాయిని ధరిస్తే అదృష్టం ఇంటి తలుపులు తడుతుందని, బంగారం కాసులు కురిపిస్తుందని చెప్తుంటారు. ఆ మాటలు నమ్మి వారు చెప్పిన రాయిని కొంటారు. తీరా అది నకిలీది కావడంతో వీరికి జరిగే మేలేమీ ఉండదు.
కొన్నేళ్ళ క్రితం తమిళనాడులో ఓ అసహ్యమైన సంఘటన జరిగింది. ఓ ఆలయ పూజారి బలహీనులైన స్త్రీలను లక్ష్యంగా చేసుకుని గర్భగుడిలో తన కోరిక తీరిస్త ఇక మీ సంపదకు ఎలాంటి డోకా ఉండదని చెప్పి తన నీచమైన కోరికలను తీర్చుకున్నారు. అప్పట్లో అది సంచలనమైంది.
ఇలా పలువురు నకిలీ స్వాములు నగ్నంగా పూజ చేస్తే పిల్లలు పుడతారనో లేదా పెల్ళి అవుతుందనో చెప్పి మహిళా భక్తులను మోసగించడమూ జరిగింది.
స్త్రీలు ఇలా మోసపోతే మగవారు అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి పరుగులు తీస్తారు. ఏమన్నా అంటే అదృష్టాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తారు. వాటిలో ఒకటి – పేకాట. మరొకటి – గుర్రపందాలు. డబ్బులు పెట్టి జూదమాడటం నిషేధమని ప్రభుత్వం నిషేధించినా జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఊళ్ళల్లో బ్యాచులు బ్యాచులుగా పేకాటరాయుళ్ళు కనిపిస్తుంటారు. అటువంటి వారిని పట్టుకోవడం, వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకోవడం మనం వింటూనే ఉంటాం. అలాగే గుర్రప్పందాలకేసి సమయాన్నంతా వెచ్చిస్తూ ఉంటారు. పైగా కొందరైతే జూదానికి డబ్బులు పెట్టేముందర జ్యోతిష్కులను కలిసి అడుగుతుంటారు.
ఇలాంటి జూదాల వల్ల దగా పడ్డ వారు ఎందరెందరో ఉన్నారు. వారి కన్నీటి గాథలను వింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఏం లాభం...ఒకరు చెప్తే వినరు. ఏ మాత్రం కష్టపడకుండా డబ్బులు గడించెయ్యాలన్న అత్యాశే వారు మోసపోవడానికి కారణమవుతుంది. ఒక ఉద్యోగానికి వేలాది మంది అప్లికేషన్ పెట్టుకుంటే పది మందికే లభించడం వల్ల అదృష్టంలోకి చేరుతారా...లేక ప్రతిభను పెట్టుబడిగా పెట్టుకుని సన్మార్గంలో సంపాదిస్తారా ...ఏదేమైనా గడించడమనేది మన చేతిలో ఉంటుంది.
చలనచిత్ర పరిశ్రమ విషయానికొస్తే అందులో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే విజయం అనేది దక్కుతుంది. అంతేతప్ప ఎవరో ఒక్కరి వల్ల మాత్రమే లాభాలు గడించెయ్యాలనుకోవడం అత్యాశే అవుతుంది. 200 శాతం అంకితభావం, కఠోశ్రమ, ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అంతేతప్ప అదృష్టంతో మాత్రమే సినీ రంగంలో రాణించేయొచ్చు అని అనుకోవడం సరికాదు. శ్రమ ఒక్కొక్కప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఓర్పుతో అనుకున్న లక్ష్యానికి కట్టుబడి శ్రమిస్తే లాభం తప్పక ఉంటుందని గ్రహించాలి. అంతేతప్ప కేవలం అదృష్టం మాత్రమే తనను ఈ ఉన్నత స్థితికి తీసుకువచ్చిందనే వారిని చూడలేం.
అత్యాశ, అదృష్టం, అడ్డదారి, ఉచిత ఇవన్నీ మనసు నుంచి తీసేసి తెలివితేటలతో ఆలోచించి కఠిన శ్రమతో ముందుకు పోతే సత్ఫలితం ఖాయం. జీవితమూ అందంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది.   
శ్రమే ఉన్నతం. అదే విజయానికి మూల మంత్రం. దీనిని మరచిపోకూడదు.
ఇది అర్థం చేసుకుని జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తారని నా నమ్మకం. నా సూచన. నా హితవు.
ఇట్లు
అత్యాశ

...............
కామెంట్‌లు