గతం వెంటాడుతది
వర్తమానం పరుగెత్తుతది
భవిష్యత్తు మురిపిస్తది
కాలం అనుకూలమైనా,
ప్రతికూలమైనా,
ఆశ ఊపిరులూది నడిపిస్తది
వెంట ఎవరున్నా,లేకున్నా
ప్రాణమున్నంత వరకు
నడక కొనసాగాలి.
మార్పు అనివార్యమైతే,
పరిణామం సహజమైతే,
పరిస్థితులు కారణమైతే,
మనసు వివర్ణమైనప్పటికీ,
కొత్త కొద్ది కొద్దిగానైనా వస్తుంటే,
మాటలు,చేతలు ఆకాశ కుసుమాలై అందలేకపోతే,
వదలిపెడితే,ప్రక్షాళన చేస్తే,
జగానికి దిగాలెందుకు!
వేదాంతమే బతుకును నిర్ణయిస్తే,
కాటిలోపల జరిగే కపాల మోక్షాలు విమోకాలకు సాక్ష్యమవుతాయా?
చిన్న మట్టికుండ నిండిన
అస్తికలు పవిత్ర నిమజ్జనాలు చేస్తాయి.
చితిమంటల చిర చింతలు
చేతులు దులుపుకుంటాయి.
ప్రాప్తముంటే నిత్యకర్మలు
లేకుంటే గయాశ్రాద్ధాలే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి