సుప్రభాత కవిత : - బృంద
కారు మబ్బులు కమ్ముకున్నా 
కటిక చీకటి అలుముకున్నా...
చిన్ని కిరణపు వెలుగుతో 
చిటికలో  మారిపోవు గతులన్నీ...

గుండె నిండిన దిగులైనా 
కళ్ళు నింపిన భయమైనా 
కాళ్ళు తడబడు బెదురైనా..
చెదిరిపోవా చిన్న మార్పుతో...

తీరలేని కష్టం అయినా 
పూడ్చలేని నష్టం అయినా 
చెరపలేని ఇష్టం అయినా 
మరపురాదా కాల గతిలో...

తగ్గితే తలవంపు కాదు 
నెగ్గితే కిరీటం రాదు 
ఉగ్గ పట్టి సమయం దాటేస్తే 
ఉత్తర క్షణం  ప్రశాంతమేగా!

కొనసాగే కక్షలతో 
పెంచి పోషించే పగలతో 
చిన్ని జీవితం గడిపేస్తే 
అనుక్షణం  అలజడేగా.....

హద్దు మీరిన స్వార్థమైనా 
తల కెక్కిన అహంకారమైనా 
మితిమీరిన పోకడలన్నీ 
మనుగడ ఉంటేనేగా....

ఏ నిమిషం ఏమౌనో...
ఏ ఆపద  దాపురించేనో..
దొరికిన బ్రతుకుకు సార్థకతగా 
గడిపే మార్గం  చూపించే ....

రేపటి వెలుగుకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు