ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము- 205 వ రోజు
శల్యుడు సుయోధనునికి సాయం అందించుట
ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్ళి పాండవులకు సైన్య సహాయం చేయమని ధర్మజుని కోరిక వెలిబుచ్చారు. శల్యుడు ఆనందంగా సైన్య సమేతుడై మహారాధులైన పుత్రులతో కలిసిఉపప్లావ్యంకు బయలుదేరాడు. చారుల ద్వారా విషయం గ్రహించిన సుయోధనుడు శల్యుడు వచ్చు మార్గంలో తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలు, ఆహార పానీయములు, సౌకర్యాలు సమకూరేలా చేసాడు. విందులూ , వినోదాలు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేసాడు. ఇవి చూసిన శల్యుడు " ఈ మర్యాదలు చేస్తున్న వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లను చేసిన ధర్మరాజు అమాత్యులను పిలిపించండి " అన్నాడు. దుర్యోధనుడి సేవకులు ఆశ్చర్యబోయి దుర్యోధనుడికి విన్నవించారు. అప్పుడు శల్యుడు తన ప్రాణములు ఇవ్వడానికి కూడా సిద్ధమైనంత సంతోషంతో వున్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి అవన్నీ తాను చేసినట్లు చెప్పాడు. శల్యుడికి దుర్యోధనుడి ప్రయత్నం అర్ధం చేసుకున్నాడు. కానీ మాట తప్పలేడు. శల్యుడు " ఏమి కావాలో కోరుకో " అన్నాడు. అందుకు సుయోధనుడు " ఆర్యా ! సత్యవాక్కువై నాకు మాట ఇవ్వు. నీవు సర్వసైన్యానికి అధ్యక్షుడవు కాదగిన వాడవు. నీకు పాండవులు ఎలాంటి వారో నేనూ అంతే. నేను నీ భక్తుడను. ఆదరించ దగిన వాడను. కాబట్టి నా కోరికను మన్నించి నాకు సహాయం చేయి." అన్నాడు. శల్యుడు అందుకు సమ్మతించాడు. ఆ తరువాత శల్యుడు నేను ధర్మరాజు వద్దకు వెడుతున్నాను. అతనిని దర్శించిన తరువాత నీ దగ్గరకు వస్తాను " అన్నాడు. సుయోధనుడు " అలాగే వెళ్ళండి కాని నాకిచ్చిన మాట మరవ వద్దు " అన్నాడు. శల్యుడు అందుకు అంగీకరించి ధర్మరాజు చూడటానికి ఉపప్లావ్యం చేరాడు. ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు ఇతర బంధు మిత్రులతో శల్యునికి సాదర స్వాగతం పలికాడు. శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకుని " ధర్మరాజా! కష్టసాధ్యమైన అరణ్యవాసాన్ని, అంతకంటే కష్టమైన అజ్ఞాత వాసాన్ని పూర్తి చేసారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ఠా, ధర్మ నిష్ఠకు నిలబడ్డారు " అని శ్లాఘించి సుయోధనునికి ఇచ్చిన వరాన్ని వివరించాడు. ధర్మరాజు " మీరు సుయోధనునికి ఇచ్చిన వరం మంచిదే. దానిని నెరవేర్చండి. అలాగే నా కోరిక నెరవేర్చండి. రాబోవు యుద్ధంలో అర్జునునకు శ్రీకృష్ణుడు సారధ్యం వహిస్తున్నాడు. సుయోధనుని పక్షంలో మీకంటే సారధ్యంలో నేర్పరి లేడు. కర్ణుడు అర్జునుని మీద పగద్వేషంతో రగిలి పోతుంటాడు. నా పరిశీలనను బట్టి కర్ణార్జునులు ఇద్దరికీ ద్వంద్వయుద్ధం వచ్చిన్నప్పుడు కర్ణునికి మిమ్మల్ని సారధ్యం చేయమంటే ఆ బాధ్యత తీసుకుని కర్ణునికి ఉత్సాహ భంగం చేస్తూ అర్జునుని కాపాడండి. ఇది అకృత్యం అని తలపక నా కోరిక మన్నించండి " అని కోరాడు. శల్యుడు ధర్మరాజు అంతర్యం గ్రహించాడు " ధర్మనందనా ! సుయోధనుడు కోరితే కర్ణునికి సారధ్యం వహించి నీ కోరిక నెరవేరుస్తాను. జూద సమయంలో కర్ణుడు పలికిని పరుష వాక్యాలు, అందు వలన మీరు పడిన కష్టాలు అన్ని సుఖ దయాలు అవుతాయి. ధర్మరాజా ! ఇదే కాదు నీవు ఇంకేమి కోరినా చేస్తాను. మీకు జరిగిన అవమానం అడవులలో మీరు పడిన కష్టాలు మరవడం ఎవరి తరం? నువ్వే కాదు ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాగే అనుభవించాడు. విధి రాతను తప్పించడం పరమ శివునకు కూడా సాధ్యం కాదు కదా? " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి