సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 విరాట పర్వము పంచమాశ్వాసము- 199 వ రోజు
ఉత్తరకుమారుడు అర్జునిని గురించి వర్ణించుట
అంత ఘోరయుద్ధం నేను ఇంతవరకు చూడ లేదు. రథాన్ని కూడా నడప లేకపోయిన నాకు ధైర్యం చెప్పి కురు సైన్యాలను చిత్తు చేసిన మహా వీరుడు.. అతని అభ్యర్ధన వలన నేను నిన్న ఇతని పేరు వెల్లడించ లేదు. విరాటుడు పరవశించి పోయాడు. అర్జునిని గట్టిగా కౌగలించుకున్నాడు. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమ నకుల సహదేవులను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అర్జునుడు తన తమ్ములను ఉత్తర కుమారునికి పరిచయం చేసాడు. విరాటుడు తన తమ్ములను, కుమారులను, మంత్రులను పాండవుల దర్శనానినికి పిలిపించాడు. ద్రౌపదిని గురించి చెప్పి తగురీతిన గౌరవించమని సుధేష్ణకు వర్తమానం పంపాడు. అర్జునుడు " విరాటరాజా ! దుస్తరమైన అజ్ఞాతవాసాన్ని మీతో నిర్భయంగా గడిపాము " అన్నాడు. విరాటుడు " అర్జునా ! నేను పరాయి వాడినా. మీ అజ్ఞాతవాసం మా వద్ద గడపటం నా పూర్వజన్మ సుకృతం. ఇక ఈ మత్స్యదేశం మీది. మేమంతా మిమ్మలిని సేవించుకుంటాము. కౌరవుల మీదికి దండెత్తి రావలసి వస్తే మేము మీతో యుద్ధం చేస్తాము " అన్నాడు. ఉత్తరుడు " అదేమిటి తండ్రీ ! మనకంటూ ఒక రాజ్యం ఉందా? కౌరవులతో యుద్ధం చేసి మనలను గెలిపించి మన రాజ్యాన్ని గెలిపించింది వీరే కదా. ఇక ఇది వీరి రాజ్యం. వారి రాజ్యం వారికి ఇవ్వడం హాస్యాస్పదం కాదా. ఇంత కాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం. వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం. ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి కానుక ఇవ్వాలంటే ఊత్తరకుమారిని పిలిపించండి " అని తండ్రితో చెప్పాడు.
అర్జునుడు విరాటునితో వియ్యమందుటకు అంగీకరించుట
ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వారు సుధేష్ణ అనుమతితో ఉత్తరను సర్వాలంకార భూషితను చేసి తీసుకు వచ్చారు. ఉత్తరకు ఎదురు వెళ్ళి విరాటుడు ఆమెను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చి ధర్మరాజుతో " ధర్మరాజా! అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించి మమ్ము క్షమించమని ప్రార్ధిస్తున్నాను. మీతో బంధుత్వం మాకెంతో శ్రేయస్కరం మా కుమార్తె ఉత్తరను అర్జునుని కిచ్చి వివాహం చేయడం మాకు సమ్మతం. మీ అంగీకారం తెలుపితే ఆనందం " అన్నాడు. ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్ధం గ్రహించి విరాటునితో " విరాటరాజా ! నేను ఉత్తరకు గురువును గురువు తండ్రితో సమానం. కాబట్టి ఈమెను కోడలిగా స్వీకరిస్తాను. నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చెయ్యండి. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు సుభద్ర కుమారుడు సౌందర్య వంతుడు, విద్యావంతుడు, బాహుబలం కలిగిన వీరుడు, ఉదారుడు, శౌర్యపరాక్రమం కలిగిన వాడు, గుణవంతుడు, పెద్దలమన్నలను పొందిన వాడు " అని కుమారుని గుణగణాలను వివరించాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించి " అర్జునా ! నీతో వియ్యమందడం కంటే కావలసినదేముంది. అన్నగారు కార్య నిర్ణయం చేసి చెపితే దానిని మేము ఆచరిస్తాము " అన్నాడు. ధర్మరాజు " అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది. ఇది నాకు సమ్మతమే. మన బందు మిత్రులకు ఈ విషయం తెలియచేయండి " అన్నాడు. విరాటుడు మీ పాండవ వంశంతో వియ్యమందడంతో మా మత్స్యదేశం పావనం అయింది అని ఉత్తర కుమారిచే భీమ, అర్జున, నకుల సహహదేవులకు ప్రణామము చేయించాడు. వారాంతా ఉత్తరను మనసారా దీవించారు. ఉత్తరకుమారి అంతఃపురానికి వెళ్ళింది. పురోహితులను పిలిపించి సుమూహూర్తం నిర్ణయించారు. ఇరు పక్షాలవారికి వివాహఆహ్వాన పత్రిక పంపించారు. ధర్మరాజు విరాటుని కౌగలించుకుని " విరాటా! అజ్ఞాతవాస సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. మాకు శ్రీకృష్ణుడెంతో ఇకపై మీరూ అంతే " అని అభినందనలు తెలిపాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు