అనోన్య దాంపత్యానికి నిర్వచనం సీతారాములు: - సి.హెచ్.ప్రతాప్

 అన్యోన్య దాంపత్యానికి సీతారాములు ఒక నిలువెత్తు నిదర్శనం. భారతీయ సంస్కృతిలో వివాహ బంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు అది రెండు ఆత్మల ఏకీకరణ. ఒకరి సుఖదుఃఖాలను మరొకరు సమానంగా పంచుకుంటూ జీవితాంతం ఒకరి అడుగులో మరొకరు అడుగు వేస్తూ సాగడమే నిజమైన దాంపత్య ధర్మం. లోకకల్యాణం కోసం భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి రాముడు సీతగా మారి మానవజాతికి ఆదర్శవంతమైన జీవన సరళిని నేర్పారు. వీరి మధ్య ఉన్న అనురాగం గౌరవం విశ్వాసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. రాముడు ఏకపత్నీ వ్రతుడిగా సీతమ్మ పతివ్రతగా వారి బంధాన్ని నిలుపుకున్నారు.
జనక మహారాజు కొలువులో శివధనుస్సును విరిచిన క్షణం నుండి అగ్నిసాక్షిగా హస్తనిక్షేపం వరకు వారి వివాహం ఒక మహోన్నత క్రతువు. రాముడు సీతమ్మ చేయి పట్టుకున్న ఆ నిమిషమే వారిద్దరూ ఒకే లక్ష్యం కోసం జీవించాలని నిర్ణయించుకున్నారు. ఒకరికి ఒకరు ఆత్మబంధువులుగా మారిపోయారు. కష్టాలలో ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ సుఖాలలో ఒకరి ఆనందాన్ని మరొకరు రెట్టింపు చేస్తూ సాగిన వారి ప్రయాణం అద్భుతం. లోకంలో ఎవరైనా వివాహం చేసుకుంటే సీతారాముల వలె జీవించాలని అందుకే కోరుకుంటారు. వారి మధ్య ఉండే ఆ ప్రేమానుబంధం మరెక్కడా కనిపించదు. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించడం చిన్న మనస్పర్థలను కూడా సులువుగా పక్కన పెట్టడం వీరి ప్రత్యేకత.
తండ్రి దశరథుడి మాట కోసం రాముడు రాజ్యభోగాలను తృజించి అరణ్యవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు సీతమ్మ ప్రదర్శించిన ధైర్యం అమోఘం. రాజభవనంలో సకల సౌకర్యాల మధ్య పెరిగిన ఆమె తన భర్త వెంటే ఉంటానని పట్టుబట్టింది. అడవిలో ముళ్ళు రాళ్లు ఉంటాయని రాముడు హెచ్చరించినా భర్త ఉన్న చోటే తనకు స్వర్గమని ఆమె చాటి చెప్పింది. సుఖాలలో మాత్రమే కాదు కష్టాలలో కూడా నీడలా వెంటే ఉండే భార్య ఎలా ఉండాలో సీతమ్మ లోకానికి వివరించింది. అడవిలో కందమూలాలు తింటూ చెట్ల కింద నివసిస్తున్నా ఆమె ముఖంలో ఎప్పుడూ అసంతృప్తి కలగలేదు. రాముడి సేవలో ఆమె తనను తాను మరచిపోయింది.
మరోవైపు సీతమ్మ పట్ల రాముడికి ఉన్న అనురాగం అనన్యసామాన్యం. రావణుడు ఆమెను అపహరించినప్పుడు రాముడు సామాన్య మానవుడిలా విలపించడం ఆయనలోని ప్రేమాతిశయాన్ని సూచిస్తుంది. కేవలం తన భార్యను కాపాడుకోవడమే కాకుండా ఆమె ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఒక మహా యుద్ధాన్నే తలపెట్టారు. అడవిలో ఉన్న వానర సైన్యాన్ని కలుపుకుని సముద్రంపై వారధిని నిర్మించి లంకా నగరాన్ని జయించారు. సీతను తిరిగి పొందడం కోసం రాముడు పడిన శ్రమ ఆయనకు భార్య పట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. అన్యోన్యత అంటే కేవలం కలిసి ఉండటం కాదు ఒకరి గౌరవం కోసం మరొకరు ప్రాణాలకు తెగించి పోరాడటం.
సీతారాముల జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ వారి మధ్య ఉన్న నమ్మకం ఎన్నడూ సడలలేదు. రావణ వధ తర్వాత సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన ఘట్టం లోకానికి ఆమె పవిత్రతను నిరూపించడానికే తప్ప రాముడికి ఆమెపై అనుమానం ఉండి కాదు. ఒక రాజుగా తన ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే భర్తగా తన గుండెల్లో సీతమ్మను నిరంతరం కొలుస్తూనే ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న మానసిక అనుబంధం భౌతిక దూరానికి అతీతమైనది. వియోగ సమయంలో కూడా సీతమ్మ రాముడి నామాన్ని స్మరిస్తూ ఉండగా రాముడు సీతమ్మ జ్ఞాపకాలతోనే జీవించారు. ఇది ఆత్మల మధ్య ఉండే నిరంతర సంభాషణ. వారి మధ్య ఉన్న ఆ గాఢమైన బంధం వల్లే ఎన్నో ఇబ్బందులను జయించగలిగారు.
నేటి ఆధునిక సమాజంలో వైవాహిక బంధాలు త్వరగా విచ్ఛిన్నం అవుతున్న తరుణంలో సీతారాముల గాథ ఎంతో అవసరం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం అనేది దాంపత్యానికి ప్రాణం. ఒకరి విజయంలో మరొకరు భాగస్వాములు కావడం కష్టాల్లో తోడుగా నిలబడటం అనే లక్షణాలు వీరి నుండి నేర్చుకోవాలి. రాముడు తన భార్యకు ఇచ్చిన స్థానం అత్యున్నతమైనది. యజ్ఞయాగాదులు చేసే సమయంలో సీతమ్మ లేకపోతే ఆమె బంగారు ప్రతిమను పక్కన పెట్టుకుని నిర్వహించడం ఆమె పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన గౌరవానికి నిదర్శనం. భార్యాభర్తలు అంటే ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటి వారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సహజం కానీ వాటిని విజ్ఞతతో పరిష్కరించుకోవడం ముఖ్యం. సీతారాముల దాంపత్యం మనకు సహనాన్ని నేర్పుతుంది. త్యాగం లేకుండా ఏ బంధం నిలబడదు. సీతమ్మ తన సుఖాలను త్యాగం చేస్తే రాముడు తన వ్యక్తిగత ఆనందాన్ని ప్రజల కోసం త్యాగం చేశారు. అయినప్పటికీ వారి మనసులు ఎప్పుడూ ఒకరి వైపే చూస్తూ ఉండేవి. అందుకే ఈ లోకంలో ఎన్ని వివాహాలు జరిగినా అందరూ సీతారాముల్లా ఉండాలని ఆశీర్వదిస్తారు. వారి ప్రేమ శాశ్వతమైనది పవిత్రమైనది. ఆదర్శవంతమైన జీవనం గడపాలంటే వీరి మార్గాన్ని మించినది మరొకటి లేదు

కామెంట్‌లు