నాలుక: - - యామిజాల జగదీశ్
 ఓ గురువుకి ఒక అందాల ముద్దుల కూతురు ఉంది. దానికి పెళ్ళి చేయాలనుకున్నాడు గురువు. అందరినీ సమావేశపరచి "నేనడిగే రెండు ప్రశ్నలకు ఎవరైతే సరైన జవాబిస్తారో అతనీకి నా కూతురునిచ్చి పెళ్ళి చేస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే మధురమైనదొకటీ తీసుకురావాలి" అంటాడు. 
ఒకడు తేనె, మరొకడు చెరకు ఇలా రకరకాలవి తీసుకొచ్చారు యువకులు. చివరగా ఓ శిష్యుడు మిగిలాడు. అతనిని చూసి "నువ్వేం తెచ్చావు" అని అడుగుతాడు గురువు.
శిష్యుడు తన దగ్గరున్న చిన్ని పెట్టె తెరచి అందులోని నాలుక బొమ్మ చూపిస్తాడు. "ఎదుటివారిని నొప్పించక బాధపెట్టక మాట్లాడే నాలుకే ఈ ప్రపంచంలో మధురమైనది. పైగా సరస్వతీ దేవి నివాసముండేది ఈ నాలుకలోనే" అంటాడు శిష్యుడు.
గురువు సెహభాష్ అంటూ శిష్యుడిని మెచ్చుకుంటాడు. ఇక రెండో ప్రశ్న ఏంటంటే "ప్రపంచంలో చేదైనదొకటి తీసుకురావాలి" అంటాడు గురువు.
అందరూ తలా ఒకటి తీసుకొస్తారు. చివరగా శిష్యుడి వంతు వస్తుంది. అతనిని చూసి "నువ్వేం తీసుకొచ్చావు?" అంటాడు గురువు. అతను మొదటలాగే ఈసారీ ఒక చిన్నపెట్టెలో ఓ నాలుకబొమ్మ గీసి ఉన్న కాగితం చూపుతాడు. 
"ఏంటిదీ? మధురమైనదొకటి తీసుకురమ్మంటే నాలుక తీసుకొచ్చావు. చేదైనది తీసుకురమ్మంటే మళ్ళీ నాలుక బొమ్మ చూపీస్తున్నావేంటీ?" అని ప్రశ్నిస్తాడు గురువు.
అంతట శిష్యుడు "అవును మధురమైన ఆ నాలుకకు చేదు గుణమూ ఉంది. అప్పటిదాకా మనసుకు నచ్చిన మనిషి నచ్చలేదంటే ఏమాత్రం ముందువెనుకలు ఆలోచించక చిత్తమొచ్చీనట్లల్లా వాగి చేదు పుట్టించేది నాలుక కాకుండా మరేముంటుంది?" అంటాడు.
శిష్యుడి వివరణకు మెచ్చుకుని అతనికి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తాడు గురువు.


కామెంట్‌లు