ఎన్నడూ వదులుకోవద్దు : చర్చిల్: - - యామిజాల జగదీశ్
 ఒకసారి చర్చిల్‌ను ఇంగ్లాండ్‌లోని ఒక ప్రతిష్టాత్మక పాఠశాల అయిన 'హారో స్కూల్'లో ప్రసంగించడానికి  ఆహ్వానించారు. 
ఆయన ఏమి చెబుతారోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చర్చిల్ వేదికపైకి వచ్చి, తన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ, సిగరెట్‌ పక్కన పెట్టి, కేవలం ఒక్క వాక్యం చెప్పారు :
"ఎన్నడూ వదులుకోవద్దు, ఎన్నడూ వదులుకోవద్దు, ఎన్నడూ వదులుకోవద్దు, ఎప్పటికీ, ఎన్నడూ — అది పెద్దదైనా, చిన్నదైనా, ముఖ్యమైనదైనా, సాధారణమైనదైనా ఎన్నటికీ వదులుకోవద్దు, మీ మనస్సాక్షిని మర్చిపోకండి...."
అలా చెబుతూ ఆయన వేదిక దిగారు. ఆయన చేసిన ప్రసంగం చిన్నదే కావచ్చు కానీ ప్రతి విద్యార్థిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది.
చర్చిల్ చేసిన ఈ చిన్నపాటి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 'పట్టుదల'కు ప్రతీకగా పరిగణిస్తారు.  పరిస్థితులు ఎంత కష్టతరమైనాసరే, మన సంకల్పం బలంగా ఉంటే,  వ్యతిరేక పరిస్థితులను జయించ వచ్చు.
జీవితంలో సవాళ్లు ఎలాంటివైనా అధికశాతం మంది మధ్యలోనే వదిలేస్తారు. ఇదే అసలైన వైఫల్యం.
విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన పై మాటలు, విజయానికి మరో పేరు. 'ఎప్పటికీ వదులుకోవద్దు' అని మనకు ఇప్పటికీ గుర్తుచేస్తాయి. మన మీద మనకు నమ్మకం ఉండాలి.‌ పోరాటపటిమను మానకూడదు.
విన్‌స్టన్ చర్చిల్ యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాన మంత్రి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రధాని కాకముందు ఆయన బ్రిటిష్ సైన్యాధికారిగానూ ఉన్నారు. రచయిత. చరిత్రకారుడు. యువ సైనికుడిగా ఆయన ఆంగ్లో - సూడాన్ యుద్ధం, రెండవ బోయర్ యుద్ధంలో తన ధీరత్వాన్ని ప్రదర్శించారు. ఆయన అనేక ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడైన ఆయన యువకుడిగా ఉన్నప్పుడే  సైనిక వృత్తిని ప్రారంభించారు. భారతదేశం, క్యూబా, ఈజిప్టుతో సహా అనేక దేశాలను సందర్శించారు. ఆయన జైలు శిక్ష అనుభవించిన సందర్భాలున్నాయి. సైనికుడిగా, జర్నలిస్టుగా పని చేశారు. సైన్యాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడ ఆయన మరింత గొప్ప విజయాన్ని పొందారు. తెలివైన, ఆకర్షణీయమైన, ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడిగా ఆయన తనను తాను నిరూపించుకున్నారు.‌ 
రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్న కాలంలో అలజడి నెలకొన్న గందరగోళ సమయంలో ఆయన దేశ ప్రధానమంత్రి అయ్యారు.ఆయన గొప్ప వ్యూహంతో రాజకీయ వ్యవహారాలను నిర్వహించారు.
ఆయన పూర్తి పేరు విన్‌స్టన్ లియోనార్డ్ స్పెన్సర్ చర్చిల్.  1874 నవంబర్ 30 న జన్మించిన ఆయన 1965 జనవరి 24న తుదిశ్వాస విడిచారు. 

కామెంట్‌లు