బాబూజీ జగ్జీవన్ రామ్ 119వ జయంతి : - చౌధరి రాధాకృష్ణ -గాంధేయవాది -జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత -9441451781
 భారతదేశ స్వాతంత్ర్యపోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్వాతంత్ర్య సమరయోధులు, అణగారిన వర్గాల నాయకులు, భారత రాజ్యాంగసభ సభ్యులు, మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ఉపప్రధానిగా సేవలందించిన భారతమాత ముద్దుబిడ్డ బాబూజీ జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఈనెల 5న సమానత్వదినంగా భారతావని జరుపుకొంటుంది.
1946లో ఏర్పడిన తాత్కాలిక భారతప్రభుత్వంలో, స్వాతంత్ర్యానంతర తొలి కేంద్రప్రభుత్వ కేబినెట్ లో కార్మికశాఖామంత్రిగా పనిచేసిన ఆయన 1977-79 లో ఉపప్రధానిగా సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధులు, అస్పృశ్యతపై నిరంతరం పోరాడిన యోధుడు.
జగ్జీవన్ రామ్ సోభీరాం, వాసంతిదేవి పుణ్యదంపతులకు 1908 ఏప్రిల్ 5న బీహార్ లో చంద్వా గ్రామంలో జన్మించారు. చంద్వా గ్రామ సమీపంలోని అర్రా పట్టణంలో చదువుతున్న కాలంలో పాఠశాలను సందర్శించ వచ్చిన మదన్ మోహన్ మాల్వియాను తన స్వాగతోపన్యాసం ద్వారా ఆకర్షించారు. మాల్వియా కోరికపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరి కులవివక్షతను సహించలేక కోల్కతా విశ్వవిద్యాలయంలో చేరి పట్టభద్రుడయ్యారు. 1935లో అఖిలభారత అణగారినవర్గాల సమాఖ్య ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. మొదటిభార్య మరణంతో 1935లో ఇంద్రాణీదేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు కుమారుడు సురేష్, కుమార్తె మీరాకుమార్ లోక్ సభ స్పీకర్ గా పనిచేసారు.
1937లో బీహార్ శాసనసభ్యులుగా ఎన్నికై సాగునీటి పన్ను విషయంలో విభేదించి రాజీనామా చేసారు.
మహాత్మాగాంధీ పిలుపునందుకొని అంటరానితనం నిర్మూలనా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో పాల్గొని రెండుసార్లు జైలుజీవితం గడిపారు.
భారత ప్రభుత్వంలో కార్మిక, కమ్యూనికేషన్, రవాణా, రైల్వే, ఉపాధి, పునరావాసం, రక్షణతో పాటు అనేక శాఖలను నిర్వహించి భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఎనలేని కృషి చేసారు. 1947 ఆగష్టులో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికనేతల సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. హరిత విప్లవం ఫలాల సాధనలో, 1971 పాక్ యుద్ధ సమయంలో రక్షణశాఖామంత్రిగా చూపిన చొరవ ఆయనను చిరస్మరణీయునిగా నిలిపింది. 1975లో అత్యవసర పరిస్థితిని సమర్ధించిన బాబూజీ 1977లో కాంగ్రెస్ పార్టీ వీడి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొరార్జీదేశాయ్ ప్రభుత్వంలో ఉపప్రధానిగా సేవలందించారు. 1981లో భారతజాతీయ కాంగ్రెస్(జె) పార్టీని స్థాపించారు. 
స్వాతంత్ర్య భారత తొలి కేంద్రమంత్రివర్గంలో పిన్న వయస్కునిగా, వీరిలో ఎక్కువ కాలం మంత్రిగా, ఉపప్రధానిగా సేవలందించినవారిగా బాబూజీ పేరుపొందారు.
1986 జులై 6న తుదిశ్వాస విడిచిన ఆయన అణగారిన వర్గాల హక్కులకు, దేశ ఔన్నత్యానికి జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. 

కామెంట్‌లు