25 ఏళ్ల “దరువు” జాతర: డా.సిద్దెంకి యాదగిరి

 25 ఏళ్ల  “దరువు” జాతర లో నేను రాసిన విమర్శ 'పాట ముచ్చట' ఆవిష్కరణ జరగ బోతుంది.   
___________________________________________________________________________
 తేది: 20-04-2026 న రవీంద్ర భారతి లో  2 గంటలకు సురువయ్యే దరువు జాతరకు మీకు ఎదుర్కోల్లు 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
“అడుక్కునే కళలు కావు - సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు” అనే నినాదం ఒక సాంస్కృతిక ధిక్కారమైంది. ఒక సామాజిక ప్రతిజ్ఞ మారింది. ఈ ధ్యేయంతో 20-12-1999న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా “దరువు కళాబృందం”  అవతరించింది. వ్యవస్థాపక అధ్యక్షుడు దరువు ఎల్లన్న నాయకత్వంలో పురుడుపోసుకున్న ఈ సంస్థ కళను కేవలం వినోద సాధనంగా కాకుండా సమాజాన్ని మేల్కొలిపే శక్తిగా ఉపయోగించింది.
కళ అంటే వినోదం మాత్రమే కాదు, కళ అంటే చైతన్యం, ప్రశ్న, ప్రతిఘటన అనే నమ్మకంతో సమాజాన్ని మేల్కొల్పడానికి దరువు కళాబృందం కళను ఒక సామాజిక సాధనంగా ఎంచుకుంది. 
2000 ఏప్రిల్ 14న విడుదలైన “దళిత రత్నాలు” ఆడియో క్యాసెట్ దరువు కళాబృందం సాంస్కృతిక యాత్రలో తొలి అడుగు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున విడుదల కావడం శుభసూచకంగా మారింది. ఈ క్యాసెట్‌లోని గీతాలు దళితుల జీవిత అనుభవాలను స్వరాలుగా మలిచాయి. బాధలను బాణీగా, పోరాటాన్ని పద్యంగా, ఆశయాన్ని నినాదంగా మార్చాయి. పాటలలో కనిపించే పద విన్యాసం శబ్దలయ సౌందర్యాన్ని కలిగించి వినేవారిలో చైతన్యాన్ని రగిలించింది. అస్తిత్వపు వెన్ను తట్టి లేపింది.
దరువు కళాబృందం ప్రతి సంవత్సరం నిర్వహించిన దరువు జాతర కళా సంస్కృతికి ఒక పండుగగా నిలిచింది. ఈ జాతరలో అడుగంటుతున్న కళారూపాలను వెలికితీయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసి వారికి వేదిక ఇవ్వడం ద్వారా కళాబృందం యువతలో ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ఇదొక సాంస్కృతిక ఉద్యమం.
2005లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన దరువు జాతర తెలంగాణ కళా చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రజాగాయకుడు గద్దర్ అన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ బీసీ నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్, ఇనగాల పెద్దిరెడ్డి, కేశవరావు జాదవ్,  సంగsరెడ్డి పృథ్విరాజ్, రుద్రశంకర్, ప్రొ. పి. ఎల్. విశ్వేశ్వరరావు, చుక్క సత్తయ్య, విమలక్క, మధు... మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ‘వీరులారా! వందనం’ పుస్తకావిష్కరణ దరువు ఎల్లన్న తల్లిగారైన నర్సవ్వ చేతుల మీదుగా పై వారందరి సమక్షంలో ఆవిష్కరించారు.  ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అమరులకు అంకితం ఇస్తున్నప్పుడు దరువు ఎల్లన్న తన కన్నతల్లికి పాదాభివందనం చేశారు. గద్దర్ అన్న, దేవేందర్ గౌడ్ ప్రముఖులంతా పాదాభివందనం చేశారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న వేలాది మంది విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. తమ తల్లులకు జరుగుతున్న పాదాభివందనంగా భావించి చప్పట్ల మధ్య తడినిండిన కళ్లతో తన్మయత్వం చెందారు. ఆ సభలో దరువు ఆవిర్భవించి విధానాన్ని కాశీం వివరించారు. 
అంతకు ముందు నిర్వహించిన ఆర్ట్స్ కళాశాల నుంచి టాగూర్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఒగ్గు కథ, డోల్ దెబ్బ, సింధు బాగోతం, కోలాటం, జడకొప్పు, బతుకమ్మ, గంగిరెద్దులాట, రొంజ వాయిద్యం, జమిడికెమోత, టింకి వాయిద్యం, గోండు నృత్యాలతో సాగింది. 
టాగూర్ ఆడిటోరియంలో వేదికి పైన గంగిరెద్దుల విన్యాసం సభికులను ఆనంద పరిచింది. మూలవాసుల మరియు తెలంగాణ కళలకు పట్టం కట్టినట్లైంది. అలా అన్ని కళారూపాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో గంగిరెద్దును వేదికను దరువు సంస్థకే దక్కుతుంది.
 ఆనాటి ఠాగూర్ ఆడిటోరియం తెలంగాణ చైతన్య సమరంగంగా మారింది. పాటల పరవశం, నింగి నంటిన కళల ప్రదర్శన జరిగింది. కవిత్వం కత్తిలా మెరిసింది. నినాదాలు నదుల్లా ఉప్పొంగి ప్రవహించాయి. ఆ వేదికపై కళ ఒక ఉద్యమ స్వరంగా మారి ప్రజల మనసులను కదిలించింది.
దరువు ఎల్లన్న రచించిన “వీరులారా వందనం - విద్యార్థి అమరులారా వందనం” అనే గీతం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక ప్రేరణాత్మక గీతంగా నిలిచింది. దీనిని దరువు అంజన్న ఆలపించడం, అది ఉద్యమ గీతంగా ప్రజల్లోకి చేరింది. ఈ గీతంలో తెలంగాణ ఉద్యమంలోని విద్యార్థుల త్యాగం, వారి ఆశయం, వారి పోరాటం అన్నీ ప్రతిధ్వనించాయి. “వీరులారా వందనం - విద్యార్థి అమరులారా వందనం” అనే పంక్తులు ఉద్యమ కాలంలో వేలాది విద్యార్థుల హృదయాలను తాకి వారిలో చైతన్యాన్ని రగిలించాయి. అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతంతో పోటీపడి ‘వీరులారా వందనం’ పాట నిలిచింది. విద్యార్థులు నిర్వహించే ప్రతీ సమావేశంలో ఈ పాట తప్పనిసరిగేయం అయింది. ప్రతి వేదిక మీద ఈ రెండు పాటలు ప్రధానంగా వినిపించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో దరువు కళాబృందం రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరిని కూడా ప్రశ్నించింది. తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్టు నటిస్తూ వెనుకడుగు వేస్తున్న అన్ని పార్టీల నాయకుల దొంగనాటకాలను ఎప్పటికప్పుడు ప్రజల గొంతుకగా ప్రశ్నించింది. అలాగే ఉద్యమం పట్ల తటస్థంగా ఉండే కళాకారుల ద్వంద్వ నీతిని కూడా ప్రశ్నించింది. రచయితలను, కళాకారులను సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని, తటస్థత వెనుక దాగిపోకూడదని దరువు తన ఆచరణ ద్వారా స్పష్టం చేసింది.
దరువు కళాబృందం తొలి సాంస్కృతిక ప్రయాణంలో కీలక మైలురాయిగా  “దళిత రత్నాలు” ఆడియో క్యాసెట్. మహనీయులైన అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, నారాయణ గురు, ఛత్రపతి సాహూ మహారాజు, పెరియర్ రామస్వామి  మొదలగు వారిపై పాటలు రూపొందించబడ్డాయి. అంటరానితనం, అవమానంతో మగ్గుతున్న  దళిత బహుజన సమాజానికి చైతన్యగీతాలై ప్రేరణ నింపాయి. ఆ రోజుల్లో ఈ పాటలు వినని దళితబహుజన సమూహాలు లేవంటే అతిశయోక్తి కాదు. బీమసేన రచించిన “దండమో మా దీనబంధులకు మహనీయుల్లారా...” అనే పాటను కుంట శ్రీనీవాస్ ఆలపించాడు. దరువు ఎల్లన్న రచించి స్వయంగా ఆలపించిన ‘మంచి మంచి మల్లేలేరి’, ‘నిండు జగతి సూర్యుడో భీమరావు అంబేడ్కర’, అన్ని కులాలను ఐక్యతను చాటే ‘ధరణిలో సిరులెల్లను’ అనే పాటలు, దమ్మని రాము రచించిన ‘బతుకూ బతుకుల నడమ ` బహుజన బతుకుల నడమ పుట్టినాడు అంబేడ్కరుడు’ అనే పాటవిస్తృతంగా ప్రచారమయ్యిందో. ప్రజాదరణ పొందాయి. 
ఆనాటి తెలంగాణ పరిస్థితులను తెలిపే పాటలో నిరుద్యోగం కనబడుతుంది.  “ఓ ఎమ్మే చేసే సమ్మన్న -  ఓ ఎమ్మెస్సీ చేసే సదన్న
మన బతుకులు ఆగమాయరో ధర్మన్న” అనే పాట దరువు ఎల్లన్న రాసి విద్యార్థుల తెలంగాణ భావజాలాన్ని పెంపొందించాడానికి ఉపయోగపడింది. దరువు పాటలు తెలంగాణ ప్రజల జీవన వేదనను ప్రతిధ్వనింపజేశాయి. వలస పాలనలో నష్టపోతున్న తెలంగాణ ప్రాంత ప్రజల బాధను ఈ గీతాలు స్పష్టంగా వ్యక్తం చేసాయి. 
“అనిగెపు కాయను సోరకాయలంటే అడిగినమా ఎప్పుడైనా 
యాదగిరి అని నవ్వుకుంటిరి మందలిస్తిమా ఏనాడైనా?
ఎవల భాష వాళ్లకి గొప్పది ` ఎక్కిరిత్తే ఎవడూకుంటడు?
మాటమాటకు వంకలు పెడితే ` మీ మాయిముంతనుంచి లెక్కపెడుతము’ అంటూ సాగే పాట తెలంగాణ యాసను, భాషను ఎక్కిరించినప్పుడు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని దరువు పై పాటతో వివరించాడు. 
రైతు జీవితంలోని విషాదాన్ని ప్రతిబింబిస్తూ రాసిన మరో పాట “అన్నదాతవని రైతే రాజువని నినుకొని యాడినరా - అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలెనురా” అనే పాట రైతు గోసను వ్యక్తం చేసింది. 
‘అరిగోసపడుతున్నదో తెలంగాణ ` ఆగమై పోతున్నదో 
ఏరెండె, బోరెండె, నారెండె, నోరెండె, సేనెండె, సెలుకెండె, 
కండ్లెండె కడుపెండే
ఊరెల్లిపోతున్నదో ఉరివోసుకుంటున్నదో తెలంగాణ’ అనే పాటల పంక్తులు రైతుల కన్నీళ్లనీ, కడగండ్లని, వలస జీవితాలను చిత్రించింది. ఇలా సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను ప్రతిబింబించే పాటలు, కవితలు దరువు కళాబృందం ద్వారా వెలువడ్డాయి. ఈ పాటలు  సమాజపు వేదనను పలికించి తెలంగాణ గొంతుకగా మారాయి.
దరువు కళాబృందం సాహిత్య ప్రచురణల్లో కూడా చురుకుగా పనిచేసింది. దరువు కళాబృందం సభ్యుడు డా. సిద్దెంకి యాదగిరి రచించిన “మా తొవ్వ - 2008” అనే కవిత్వ పుస్తకాన్ని దళిత బహుజన అస్తిత్వ నేపథ్యంగా, తెలంగాణ భావజాలాన్ని ఆవిష్కరించింది. దరువు ఎల్లన్న సంపాదకత్వంలో వివిధ కవుల, కళాకారుల అంతరంగాన్ని, తెలంగాణ ఉద్యమ కాలపునాటి పరిస్థితులను కవిత్వం,   పాట, వ్యాసాలుగా ‘ఓ యుద్ధం’  పుస్తకం వెలువరించనైనది.
ఈ సంకలనంలో తెలంగాణ ప్రముఖ కవుల కవితలు చోటు చేసుకున్నాయి. ఈ కవిత్వం ఉద్యమాన్ని పదాలుగా, పదాలను నినాదాలుగా మార్చి ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించింది.
తెలంగాణ ఉద్యమం దారి తప్పుతుందనే భావించినప్పుడు ధైర్యంగా స్పందించింది. ఆనాటి వివిధ పార్టీల నాయకులు ఆడుతున్న దొంగనాటకాలను, మోసాలను నిగ్గదీసి అడిగింది. ఆమరణ నిరాహార దీక్షల సందర్భంలో ఉద్యమ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఆమరణ దీక్షను విరమిస్తున్నప్పుడు, ఆ బాధ భరించలేక చనిపోయిన విద్యార్థి యువకుల మరణాలను గుర్తించుకోమని “విద్యార్థి రక్తాన్ని తాగి విరమించు” అని గట్టిగా సవాలు విసిరింది. వారు ఉద్యమ కావడిని దించితే పుస్తకాలు పక్కనపెట్టి ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడంలో ముందువరసలో నిల్చున్నది దరువు.
నాటి విద్యార్థి నేటిదాక తమదైన ముద్ర వేస్తున్నారు. “దరువు” సృజనాత్మకతను, సామాజిక బాధ్యతను మోస్తూ సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తూ. ఇది ఒక సాంస్కృతిక పాఠశాలగా నిలిచింది.
ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న  “దరువు” 20 ఏప్రిల్ 2026న రవీంద్రభారతి వేదికగా రాష్ట్రస్థాయి రజతోత్సవ దరువు జాతరను నిర్వహిస్తోంది. ఈ వేడుక ఒక సంస్థ విజయోత్సవం మాత్రమే కాదు. అది ఒక     ఉద్యమ చరిత్రకు జ్ఞాపకం. ఈ వేదికపై పాటలు పలుకుతాయి, మళ్లీ కవిత్వం గర్జిస్తుంది, అనుభవాలు ఆవిష్కృతమవుతాయి, మళ్లీ చైతన్య జ్యోతి వెలుగుతుంది.
 “దరువు” సంస్థ ప్రయాణం సాంస్కృతిక ఉద్యమ గాథ. పాటను పిలుపుగా, కవిత్వాన్ని కంఠధ్వనిగా, కళను కత్తిలా మార్చి సమాజ చైతన్యానికి సేవ చేసిన సంస్థ ఇది. “కళ అంటే వినోదం కాదు. కళ అంటే సమాజాన్ని మేల్కొలిపే మంత్రం’ గా భావిస్తోంది. 
 “దరువు” రజతోత్సవం ఒక చరిత్రను గుర్తుచేసే వేడుక. అది భవిష్యత్తు పోరాటాలకు ప్రేరణ.  “దరువు” మరిన్ని దశాబ్దాలు సమాజ చైతన్యానికి మార్గదర్శిగా నిలిచి కళా సాహిత్య, సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టించాలని మనసారా కోరుకుందాం.
కామెంట్‌లు