మన పుణ్య క్షేత్రాలు- 49: - డా: సి.హెచ్.ప్రతాప్

 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణులలో అత్యంత ఎత్తులో వెలసిన హేమకుండు సాహిబ్ సిక్కుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం చమోలీ జిల్లాలో ఉంది. మంచుతో కప్పబడిన ఏడు పర్వత శిఖరాల మధ్య ఒక నిర్మలమైన సరస్సు ఒడ్డున ఈ గురుద్వారా నిర్మించబడింది. సిక్కుల పదవ గురువు అయిన గురు గోబింద్ సింగ్ తన పూర్వ జన్మలో ఇక్కడే కఠినమైన తపస్సు ఆచరించారని ప్రతీతి. ఈ పవిత్ర స్థలం గురించి గురు గోబింద్ సింగ్ తన ఆత్మకథ అయిన 'బచిత్తర్ నాటక్'లో వివరించారు. ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మికత మేళవించిన ఈ ప్రదేశం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
హేమకుండు అంటే మంచు సరస్సు అని అర్థం. ఈ సరస్సు తీరంలోనే గురు గోబింద్ సింగ్ ధ్యానం చేసినట్లు సిక్కు మత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశం శతాబ్దాల పాటు ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయింది. 20వ శతాబ్దపు ప్రారంభంలో సిక్కు పండితులు హితకర్తలు గురు గోబింద్ సింగ్ వివరించిన భౌగోళిక గుర్తులను అనుసరించి ఈ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న గురుద్వారాను నిర్మించారు. క్రమంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు ఒక ప్రధాన యాత్రా స్థలంగా మారింది. నక్షత్ర ఆకారంలో నిర్మించబడిన ఈ గురుద్వారా నిర్మాణం ఎంతో ఆకర్షణీయంగా ఉండి పర్వత ప్రాంతపు వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ క్షేత్రానికి చేరుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని. యాత్రికులు గోవింద్‌ఘాట్ నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి సుమారు 19 కిలోమీటర్ల మేర నిటారైన కొండ మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో ఘంగారియా అనే గ్రామం పర్యాటకులకు బస సౌకర్యాన్ని కల్పిస్తుంది. అక్కడి నుండి హేమకుండు సాహిబ్ చేరుకోవడానికి మార్గం అత్యంత కఠినంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి కేవలం వేసవి కాలంలో కొన్ని నెలలు మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. ఇక్కడి చలిని తట్టుకుంటూ భక్తులు పవిత్ర సరస్సులో స్నానాలు ఆచరించి గురువుకు మొక్కులు చెల్లించుకుంటారు.
హేమకుండు సాహిబ్ సమీపంలోనే లక్ష్మణ దేవాలయం కూడా ఉంది. రామాయణ కాలంలో లక్ష్మణుడు ఇక్కడే తపస్సు చేశాడని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఒకే ప్రాంగణంలో సిక్కు గురుద్వారా మరియు హిందూ దేవాలయం ఉండటం భారతీయుల మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. యాత్ర మార్గంలో కనిపించే అరుదైన హిమాలయ పుష్పాలు ముఖ్యంగా బ్రహ్మ కమలాలు పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతం ప్రసిద్ధ 'ఫ్లవర్స్ ఆఫ్ వ్యాలీ'కి సమీపంలో ఉండటం వల్ల ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గంలా కనిపిస్తుంది. పర్వతాల నుండి జాలువారే జలపాతాలు పచ్చని అడవులు యాత్రికుల అలసటను దూరం చేస్తాయి.
ఈ పుణ్యక్షేత్రం భక్తులలో క్రమశిక్షణను భక్తిని పెంపొందిస్తుంది. గురుద్వారాలో అందించే లంగర్ (ఉచిత భోజనం) కులమతాలకు అతీతంగా అందరికీ ఆకలి తీరుస్తుంది. కటిక చలిలో కూడా సేవాదళాలు చేసే సేవలు మానవత్వానికి నిదర్శనం. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో యాత్రికులు ఈ క్షేత్రాన్ని దర్శించి గురు గోబింద్ సింగ్ ఆశీస్సులు పొందుతారు. హిమాలయాల శిఖరాగ్రాన ఉన్న ఈ దివ్యధామం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు మానసిక శక్తికి మరియు ప్రకృతి ఆరాధనకు నిలయం. హిమగిరుల ఒడిలో ఉన్న ఈ ప్రశాంత వాతావరణం మనిషిని దైవత్వానికి దగ్గర చేస్తుంది.

కామెంట్‌లు