“సోమపో ఽ మృతస్సోమ: పురుజిత్పురుసత్తమ:
వినయో జయస్సత్య సంధో దాశార్హ: సాత్వతాంపతి:”
ఆ రోజు శ్లోకాలు ప్రారంభిస్తూ..”క్షీర సాగర మథన సమయంలో ఏమి జరిగిందో ఎవరికి గుర్తు ఉన్నది?”అని అడిగింది బామ్మ.
“ముందుగా..కల్ప వృక్షము, కామ ధేనువు, ఉచ్ఛైశ్రవము అనే గుర్రము, ఐరావతం అనే ఏనుగు ఇంకా చాలా పుట్టాయి. తరువాత హాలాహలం పుట్టింది. ఆ తరువాత చంద్రుడు, లక్ష్మి దేవి..ఆ తరువాత అమృతము పుట్టాయి” అన్నాడు హుషారుగా మహేష్.
“ఆ:( బాగా గుర్తు ఉందిరా నీకు! భేష్. అప్పుడప్పుడు ఇలా పాత శ్లోకాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సరే..ఇవ్వాళ శ్లోకంలో ‘సోమప:’ అంటే..యజ్ఞం చేసేటప్పుడు అందులో సోమ రసం అనే ఔషధ మూలికని సమర్పిస్తారు. యజ్ఞం చేసేవారు ఆ మూలికతో చేసిన రసం సేవిస్తారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు..యజ్ఞంలో సోమరసం అనే మూలికల్ని సమర్పించేది ఆయనే, అసలు సోమరసమే ఆయన, అది సేవించేదీ ఆయనే! ఇందాక మహేష్ చెప్పినట్టు క్షీర సాగర మథనం లో ఉద్భవించిన అమృతమూ ఆయనే! దేవతల రూపంలో ఆ అమృతాన్ని సేవించింది ఆయనే! అంతేకాదు..’సోమ’ అంటే ‘స + ఉమ’ అమ్మవారితో కూడిన పరమశివుడు అని అర్థం. పరమ శివుడు అన్నా, శ్రీమహావిష్ణువు అన్నా ఆ శ్రీమన్నారాయణుడే.. ఎందుకంటే విశ్వం అన్నా, విష్ణువు అన్నా ఒకటే కదా! చేసే పనిని బట్టి అనేక పేర్లతో పిలుస్తారు. లోకాన్ని లయం చేసేటప్పుడు రుద్ర రూపమైన పరమ శివుడిగా ఆ శ్రీమన్నారాయణుడిని సంబోధిస్తాము. ఇప్పుడు తెలిసిందా? సరే, ఇప్పుడు..క్షీర సాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని పరమ శివుడు సేవించాడు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! కాబట్టి హాలాహలం అయినా,అమృతం అయినా..రెంటినీ సేవించిందీ ఆయనే!
“కాబట్టి ఆ శ్రీమహావిష్ణువు సోమరసాన్ని , అమృతాన్ని, హాలాహలాన్ని కూడా సేవిస్తాడు. ఆయన విశ్వ రూపుడు అని మనం చెప్పుకున్నాం కదా. అందుకే ఆయన్ని ‘పురు’ అంటారు. అలాంటి ఆ శ్రీమహావిష్ణువు సజ్జనులలోకెల్లా ఉత్కృష్టమైన వాడు. సత్త్వగుణ సంపన్నుడు. ఎందరినైనా అవలీలగా జయించగలడు, వారికి బుద్ధి చెప్పగలడు. అందుకే ఆయనని ‘పురుజిత్’ అంటారు. వినయం లేనివారిని శిక్షించి, దారిలో పెడతాడు. ఆయన దుష్టులను శిక్షించడంలో శిష్టులని రక్షించడంలో సత్య వచనుడు, సత్య సంకల్పము కలవాడు. అందు చేత ఆయన ‘దాశార్హ:’ అంటే దానం పుచ్చుకోవడానికి అన్ని విధాల అర్హుడు. ఈ విషయం ఇంతకు ముందు వామనావతారంలో బలిచక్రవర్తి నించి దానం పుచ్చుకున్నప్పుటి కథ మనం చెప్పుకున్నాము. అలాగే కృష్ణావతారంలో రాయబార ఘట్టంలో కురుసభలో..కృష్ణుడు అత్యంత ఉత్కృష్టుడు, ఉన్నతుడు అని అర్ఘ్యానికి అర్హుడు అని సభలోని పెద్దలందరూ తీర్మానించారు.”
“ఆయన సత్త్వ గుణ సంపన్నులకి పతి లాంటివాడు. అంతేకాదు..’సాత్వతాం’ అనేది ఒక తంత్ర విద్య. ఆ విద్యలకి ఆయనే పతి. అలాంటి తాంత్రిక విద్యలు కూడా వేదాల్లో, ఉపవేదాల్లో భాగమే. వేదాలకి సంబంధించిన ఏ విద్యలైనా గురుముఖత:నే నేర్చుకోవాలి. వేదాధ్యయనంలో..ముఖ్యంగా తాంత్రిక విద్య అధ్యయనంలో పొరపాట్లు జరిగితే మనిషి మతి స్థిమితం కోల్పోతాడు. ఇప్పుడు అర్థం అయిందా? మనకి ఉన్న విద్యల అధ్యయనం ద్వారానే మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకోగలుగుతాము. అసలు చెడు అనేది తెలిస్తేనే కదా..మంచి విలువ తెలిసేది? కాబట్టి రెండు నేర్చుకుని, మంచిలోని సుగుణాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలి. తెలిసిందా?” అని బామ్మ ఆ రోజుకి పాఠం చాలించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి