“వినరో భాగ్యము విష్ణు కథలు” (59) :- ఎం బిందుమాధవి

 “జీవో వినయితా సాక్షీ ముకుందో ఽ మిత విక్రమ:
అంభో నిధిరనంతాత్మా మహోదధి శయోంతక:”

ఆ రోజు పిల్లలెందుకో పట్టలేని ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. పావని పాడుతున్న పాటకి మానస నృత్యం చేస్తున్నది. పక్కనున్న కుండ మీద హరి ఘటం వాయిస్తున్నాడు. బొమ్మ బూరాలతో వాసు, విష్ణు నాదస్వరం వాయించేస్తున్నారు.
“ఏమిటి ఈ సందడి? ఇవ్వాళ ఏమైనా ప్రత్యేకత ఉందా” అంటూ చేతులు కొంగుకి తుడుచుకుంటూ వచ్చింది బామ్మ.
“మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఆటలు-పాటలు-నృత్యాల పోటీలు కూడా పెట్టారు బామ్మా! అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం” అన్నారు అందరూ ఉత్సాహంగా!
ఇంతలో “బామ్మా ఇటు చూడు..మొన్న మనం పెట్టిన మొక్క నిర్జీవంగా నేలమీద వాలిపోయింది. పక్కన ఒక ఎలుక పిల్ల కూడా చనిపోయి పడి ఉంది” అని అప్పుడే అక్కడికి వచ్చిన శ్రవణ్ గట్టిగా కేకేశాడు.
బిల బిలలాడుతూ అందరూ అక్కడికి పరుగెత్తారు.
“అయ్యో పాపం..ఆ ఎలుక ఎందుకు చచ్చిపోయిందో? మొక్క చనిపోవటానికి, ఎలుక చనిపోవటానికి..ఏదైనా ఒకటే కారణమా” అంటూ బామ్మ..మొక్క మొదట్లో పడి ఉన్న ఒక పెద్ద పదునైన మేకు చేత్తో తీసి పట్టుకుంది.
“అవును బామ్మా..ఆ మేకు గొంతులో గుచ్చుకుని ఆ ఎలుక చచ్చిపోయి ఉంటుంది. చనిపోయే ముందు..ఎలుక, మొక్క మొదట్లో ఉన్న ఈ మేకుని చీకటిలో తినే పదార్థం అనుకుని వచ్చి..అది కొరికే ప్రయత్నంలో మొక్క మొదలు కొరికేసి ఉంటుంది. అటు మొక్కా చనిపోయింది, ఇటు ఎలుకా చనిపోయింది” అన్నాడు సాగర్ కొత్త విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలాగా!
“ఈ హడావుడిలో మన శ్లోక పాఠం ప్రారంభించుకోవటం ఆలస్యం అయింది. సరే..ఈ రోజు శ్లోకం “జీవో వినయితా సాక్షీ”..అంటే జీవరాశుల్లో ప్రాణ శక్తి అయిన ఆ శ్రీమన్నారాయణుడు మన చలనానికి, మన దైనందిన వ్యవహారాలకి కారణం అయి ఉంటున్నాడు. అంటే జీవి బతికి ఉండడానికి ప్రాణం ముఖ్యం. అవునా? ఈ ఎలుకలో, ఆ మొక్కలో ఆ జీవం పోయింది కాబట్టే అవి మరణించాయి. అలాగే మీలో ఇందాకటి నించి ఉరకలు వేస్తున్న ఉత్సాహానికి, మీ కళా నైపుణ్యాలు ప్రదర్శించటానికి మీలో ఉన్న ఆ జీవ చైతన్యమైన ప్రాణమే కారణం. అవునా? అలా మనలో ఉన్న ప్రత్యేక ప్రతిభల వల్ల..అవి మనకి మాత్రమే స్వంతం అనీ, మన స్వంత కృషి వల్ల మాత్రమే అవి మనకి వచ్చాయి అనీ, అందువల్ల మనం మిగిలిన వాళ్ళకంటే అధికులమనీ మనకి గర్వం, అవినయం కలగకూడదు. వినయం ఉన్నప్పుడే విద్య రాణిస్తుంది.”
“వినయం అంటే ఏంటి బామ్మా” అని అడిగింది చిట్టి.
“మనలో ఎన్ని గొప్ప లక్షణాలున్నా, ఎన్ని ప్రత్యేక ప్రతిభలున్నా, మనం ఎంత సంపన్నులమైనా అవన్నీ మన గొప్ప అనుకుని గర్వపడకూడదు. అవన్నీ ఆ దేవదేవుడు ఇచ్చిన విభూతిగా భావించాలి. పెద్దల ఎడ గౌరవం, పిన్నల పట్ల ఆదరభావం ఉండాలి. ఉదాహరణకి..మీ టీచర్ క్లాసులో అందరికీ ఒకే విధంగా పాఠం చెబుతుంది. కొందరికి పాఠం ఒక్క సారి చెప్పగానే అర్థం అవుతుంది. కొందరికి..మిగిలిన వారికంటే బాగా అర్థమవుతుంది. కొందరికి ఎన్ని సార్లు, ఎంత సేపు చెప్పినా అర్థం కాదు. ఎందుకు? ఎందుకంటే..వారిలో ఆ ప్రత్యేకమైన మేధస్సు అనేది భగవంతుడు ఇచ్చిన విభూతివల్ల మాత్రమే. కాబట్టి వీడు తెలివితక్కువాడు, వాడు మూర్ఖుడు, వీడికి జ్ఞాపక శక్తి లేదు అని ఎవ్వరినీ కించపరిచి చూడటం కానీ, మాట్లాడటం కానీ చెయ్యకూడదు. తెలిసిందా?”
“అలా ఆ దేవ దేవుడు మనలో ఉండే ప్రతిభలని, బలహీనతలను, గర్వాన్ని సాక్షిగా చూస్తూ..మన కర్మ ఫలాలని నిర్ణయిస్తాడన్నమాట. అలా సాక్షి లాగా గమనించి మనని సంస్కరించి మన ప్రవర్తనని బాగు చెయ్యాలా, లేక మోక్షం ఇవ్వటానికి మనం అర్హులమా కాదా అని నిర్ణయిస్తాడు. అలాంటి ఆ శ్రీమహా విష్ణువు.. శత్రు సంహారంలో అమిత పరాక్రమ వంతుడు అన్నమాట ఇంతకుముందే చెప్పుకున్నాం. అంతే కాదు..ఆయన విక్రముడు. విశ్వం అంతా నిండిపోగలిగిన, విశ్వాన్ని తన పెద్ద పెద్ద పాదాలతో కొలవగలిగిన రూపం ధరించిన వామన రూపాన్ని విక్రముడు అంటారు. అలాంటి విరాడ్రూపం కలిగి, దుష్ట శిక్షణ చేసే శూరుడు ఆ దేవదేవుడు.”
“అంభసి”..దేవతలు, మనుషులు, పితరులు, అసురులు..ఈ నాలుగు వర్గాల సమూహాన్ని అంభసి అంటారు. ఆ నాలుగు వర్గాలకి వేరు వేరు ప్రత్యేకతలు ఉన్నాయి అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. అయినా వారందరినీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు తన దేహంలో మోస్తూ ఉంటాడు. అంతేకాదు..సముద్రాన్ని కూడా ‘అంభో’ అంటారు కాబట్టి అలా సాగర జలనిధి, అందులోని రత్నాలు, లవణాలు, నిధులు అన్నీ కూడా ఆయన రూపమే! ఆయనది ఆది అంతం లేని ఆత్మ స్వరూపం. ఆయన రూపాన్ని, కొలతలని..దేశ, కాల పరిమితుల్లో ఊహించలేము. సృష్టి మొత్తాన్ని లయం చెయ్యదల్చుకున్నప్పుడు ఆయన రుద్ర రూపంతో విజృంభించి తనలో కలిపేసుకుని, అనంత జలమయమైన సాగర రూపం ధరించి, ఆ సాగరంలోనే ఆదిశేషుడి మీద శయనిస్తాడు. తెలిసిందా” అని ఆ రోజు శ్లోకాలు చెప్పటం ముగించింది బామ్మ.
కామెంట్‌లు