“అజో మహార్హ స్వాభావ్యో జితా మిత్ర: ప్రమోదన:
ఆనందో నందనో నంద: సత్య ధర్మా త్రివిక్రమ:”
“బామ్మా మేము వచ్చేశాము. ఇవ్వాళ ఏం చెప్పుకుందాము” అని అడిగింది శర్మిష్ట.
“మీకు దక్ష యజ్ఞం కథ తెలుసా” అని అడిగి “సరే నేను మళ్లీ ఒక సారి చెబుతాను. ఒక సారి దక్షప్రజాపతి ఒక యాగం చేస్తూ..తన కూతురైన సతీ దేవిని, అల్లుడైన పరమ శివుడిని ఆ యాగానికి ఆహ్వానించలేదు. తన పుట్టింటికి వెళ్ళటానికి ఆహ్వానం ఎందుకు అని, పరమ శివుడు వారిస్తున్నా కూడా సతీ దేవి ఆ యాగానికి వెళుతుంది. పిలవకుండా ఎందుకు వచ్చావు అని తండ్రి పరుషంగా మాట్లాడి అవమానం చేసేసరికి ఆవిడ అగ్నిని రగిల్చి అందులో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఇది తెలిసి పరమ శివుడు..కోపంతో రుద్ర తాండవం చేసి తన జట నించి సృష్టించిన వీర భద్రుడి ద్వారా దక్షుడిని సంహరిస్తాడు.”
“సరే..అది అలా ఉంచితే..సతీ దేవి లేకపోవటంతో విరహంతో పరమ శివుడు ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా ఆత్మాహుతి చేసుకున్న సతీ దేవి హిమవంతుడికి కూతురుగా పుడుతుంది. ఆవిడ తపస్సు చేసుకుంటున్న పరమ శివుడిని పూజిస్తూ సపర్యలు చేస్తూ ఉంటుంది. ఆయనేమో ఎన్ని రోజులైనా కళ్ళు తెరిచి ఆవిడ వంక చూడకపోతే..శ్రీమహావిష్ణువు కొడుకైన మన్మధుడు..ఆయననే ‘అజుడు’ అని కూడా అంటారు..పరమ శివుడి మీద పువ్వుల బాణాలు వేసి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తాడు. అప్పుడు పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తాడు. ఆ మంటల్లో పడి మన్మథుడు మరణిస్తాడు. మన్మథుడి భార్య రతీ దేవి వచ్చి, తన భర్తని బ్రతికించమని పరమ శివుడిని ప్రార్థిస్తే, ఆయన మన్మథుడిని బ్రతికించి, అతను నీకు మాత్రమే ఒక రూపంతో కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళకి మాత్రం మనసులో ఉండి స్త్రీ పురుషులకి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగిస్తాడు అని ఆ సమస్యకి పరిష్కారం చెబుతాడు” అని బామ్మ ఆపగానే..
“ఈ కథకి మన శ్లోకాలకి ఏమిటి సంబంధం” అని అడిగారు పిల్లలందరూ ముక్త కంఠంతో!
“అదే చెబుతున్నా..ఆగండి మరి. అలా విష్ణువు నించి కుమారుడిగా జన్మించాడు అని చెప్పబడుతున్న మన్మథుడు, పరమశివుడి చేత సంహరించబడి, మళ్లీ జన్మ పొంది అసలు రూపమే లేకుండా..అందరి మనసుల్లో శాశ్వతంగా ఉండిపోయాడన్నమాట. అదే ‘అజ’ అంటే పుట్టుక లేకుండా, అందరి మనసుల్లో శాశ్వతత్వం పొంది, ‘మహార్హ’ అంటే గొప్ప అర్హుడిగా పూజించబడుతున్నాడు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఒక సహజ స్వభావంగా..ఒక్క మనుషుల్లోనే కాదు..అది జంతువులు, చెట్లు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు అన్నిటిలోను ఉండి సృష్టి కొనసాగటానికి ఉపయోగపడుతుంది. . అది పైకి కనబడేది కాదు. దాన్ని ‘కామం’ అంటారు. అది ధర్మబద్ధమైనదిగా ఉండి శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది.”
“శ్రీమహావిష్ణువుని అనుక్షణం ధ్యానించేవారు తమలోని అంతశ్శత్రువులని జయించగలుగుతారు. అంతశ్శత్రువుల గురించి ఇంతకు ముందు చెప్పాను. అవి మనిషిలోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నమాట.”
“ధర్మా ధర్మాలు, సత్య అసత్యాలు, జ్ఞానము అజ్ఞానము, కామము అర్థము..ఇలా విరుద్ధ భావాలు సమానంగా కలిగి ఉన్నా కూడా ఆయనకి రాగ ద్వేషాలనే సహజ అంతశ్శత్రువులు ఉండరు. కాబట్టి ఆ దేవ దేవుడు వారిని జయించిన వాడు అని చెప్పొచ్చు. అంతేకాదు..ఆయన బాహ్య శత్రువులైన రావణ-కుంభకర్ణులు, కంస, నరకాసురులు, హిరణ్యాక్ష హిరణ్య కశిపులనే రాక్షసులని కూడా సంహరించాడు కూడా!”
“ఆయనని మనసులో నిలుపుకుని సదా ధ్యానం చేసే తాపసులకి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఆయనని ‘ప్రమోదుడు’ అంటారు. అంటే ఆయన స్వయంగా ఆనంద స్వరూపుడు, ధ్యానించే వారికి ఆనందం కలిగించేవాడు. ఆ శ్రీమన్నారాయణుడు సత్య ధర్మాలతో ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆయన నిత్యం ఆనందంలో ఉంటాడు. కాబట్టి అశాశ్వతమైనవి, తాత్కాలికమైనవి అయిన ఆనందాలతో ఆయనకి పని లేదు..ఆయనని నమ్ముకున్న వాళ్ళకి కూడా అలాంటి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తాడు” అని బామ్మ చెప్పగానే..”తాత్కాలికమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి బామ్మా” అని అడిగాడు హరి.
“నీకు ఖరీదైన స్కూల్ బ్యాగ్ కొనుక్కోవాలని ఉన్నది అనుకో. మీ నాన్న అది కొని ఇచ్చేవరకు నీ మనసు దానిమీదే ఉంటుంది. అలాగే మానసకి మాడర్న్ డ్రెస్, వాసవికి పట్టు పరికిణీ కొనుక్కోవాలని, చిట్టికి ఐస్ క్రీం తినాలని కోరికలు ఉన్నాయనుకో! ఆలోచనలు వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక సారి ఆ కోరికలు తీరాయనుకోండి. మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి. అవి తీరాక, మళ్లీ కొత్తవి..వీటిని తాత్కాలిక ఆనందాలు అంటారు. అలా కాకుండా మీకు జ్ఞానం కలిగి, మనసులో అద్భుతమైన చైతన్య స్వరూపమైన ఆ శ్రీమన్నారాయణుడిని ఎప్పుడు తలచుకుంటూ..ప్రహ్లాదుడు, ధృవుడు లాగా ఆయన లీలలను ధ్యానం చేస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు మీకు ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతుంది. కానీ అలా అని అవి కోరుకోవటం తప్పు అని కాదు. ధృవుడు వాళ్ల నాన్న ఒడిలో కూర్చోవాలి అనే అతి చిన్న కోరిక కోరుతూ ఆ శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశాడు. దేవుడి అనుగ్రహం పొందగలిగితే..ఇహమూ, పరమూ కూడా లభిస్తాయి. ధృవుడి తపస్సుకి మెచ్చిన శ్రీమన్నారాయణుడు..వాళ్ల నాన్న ఒడితో పాటు రాజ్యాధికారం, ఏకంగా శాశ్వతమైన ధ్రువ లోకాన్ని సృష్టించి ఇచ్చాడు. కాబట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఈ భూప్రపంచంలో బతికినంత కాలం..అలాంటి తాత్కాలిక కోరికలూ తీరతాయి, శాశ్వతమైన ఆ దేవ దేవుడి సాన్నిధ్యము దొరుకుతుంది. ఇప్పుడు తెలిసిందా?”అని అడిగి బామ్మ ఆ రోజు పాఠం ముగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి