“భగవాన్ భగహా ఽ నందీ వనమాలీ హలాయుధ:
ఆదిత్యో జ్యోతిరాదిత్య: సహిష్ణు ర్గతిసత్తమ:”
“సమగ్ర ఐశ్వర్యం,ధర్మము, యశస్సు (కీర్తి), శ్రీ (సిరిసంపదలు), జ్ఞానము, వైరాగ్యం..ఈ ఆరింటిని ‘భగము’ అంటారు. లక్ష్మిని కలిగి ఉండటం అంటే సంపదలు..అనగా కేవలము డబ్బు, బంగారము, ఆస్తిపాస్తులు అనుకుంటూ ఉంటాము. కానీ లక్ష్మి దేవి అనుగ్రహం అంటే మనకి ఉన్న జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద, కుటుంబ బంధాలు అనే సంపద కలిగి ఉండటం, వాటిని అనుభవించగల అదృష్టం కలిగి ఉండటం అన్నమాట. సిరి సంపదలు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం లేకపోయినా అనుభవించలేము. చదువుసంధ్యలు లేకపోతే మనకున్న ఆస్తిపాస్తులను కాపాడుకోలేము. అవి ఎవరో ఒకరు మనని మోసం చేసి దోచుకోవచ్చు. కాబట్టి ‘భగము’ అని పైన చెప్పిన ఆరు రకాల ఐశ్వర్యాలని కలిగి ఉండటమే సమగ్ర ఐశ్వర్యము అంటారు. అంతేకాదు జగదుత్పత్తి, సంహారం చేసేటప్పుడు కూడా విద్య-అవిద్యలు, గమనాగమనాలు తెలిసి చేసేవాడు ఆయన. అందుకే ఆ దేవ దేవుడుని ‘భగవాన్ ’ అనే విశేషణంతో చెబుతారు” అన్నది బామ్మ ఆ రోజు శ్లోకాలు ప్రారంభిస్తూ!
“పైన చెప్పుకున్న ఐశ్వర్యాలన్నిటినీ ప్రళయ సమయంలో నిర్మొహమాటంగా తీసేసుకుంటాడు కాబట్టే ఆయనని ‘భగహా’ అని చెబుతారు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే.. మన కర్మ ఫలాలుగా ఐశ్వర్యాలు ఇచ్చేవాడు ఆయనే..తీసేసుకునేవాడు ఆయనే!”
“ఆనందీ..అంటే సమృద్ధిగా సర్వ సంపదలు కలిగి ఉన్న ఆనందమే స్వరూపంగా ఉండేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. పంచభూతాలైన పృథివి, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు..వాటికి ఉండే తత్వాలైన శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలని మాలగా ధరిస్తాడు కాబట్టి ఆయనని ‘వనమాలి’ అని పిలుస్తారు. అలా వైజయంతీ మాలని ఎల్లప్పుడూ ధరించే శ్రీకృష్ణుడు, హలాన్ని ఆయుధంగా చేసుకున్న బలరాముడు, అదితి గర్భంలో జన్మించి మూడు భువనాలని తన అడుగులతో ఆక్రమించిన త్రివిక్రముడు అయిన వామనుడు గురించి ఈ సందర్భంలో మరొక సారి తలచుకుందాం.”
“ద్వాదశాదిత్యులుగా (సవిత్రు) సూర్యమండలంలో ఉండి, లోకాన్ని తన కిరణాలతో ప్రకాశింపచేస్తూ..పోషించి, కాపాడుతూ ఉండే ఆ శ్రీమన్నారాయణుడికి మనం ఎప్పుడు కృతజ్ఞులంగా ఉండాలి. అంతేకాదు తన కిరణాలతో చంద్రుడికి ప్రకాశాన్ని అందించి, తద్వారా కూడా లోకానికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు అని కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాము.”
“ఆ శ్రీమన్నారాయణుడు..శీతోష్ణాలనే ద్వంద్వాలకి అతీతుడు. అంటే..కష్టం-సుఖం, చలి-వేడి, బాధ-ఆనందం అనే రెండు రకాల విరుద్ధ భావాలకి చలించకుండా సహించి నిలిచేవాడు. అలాంటి ఆయనని నమ్మి పూజిస్తే..మనకి కూడా కష్టాన్ని, బాధని సహించే శక్తిని ఇచ్చి మనకి ఉత్తమ గతులని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు” అని బామ్మ ఆ రోజు పాఠం ముగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి