”వినరో భాగ్యము విష్ణుకథలు (70) : - ఎం బిందుమాధవి

 “ఉదీర్ణ: సర్వత: శ్చక్షు రనీశ: శాశ్వతస్థిర:
భూశయో భూషణో భూతిర్విశోక: శోకనాశన:
అర్చిష్మానర్చిత: కుంభో విశుద్ధాత్మా విశోధన:
అనిరుద్ధో ఽ ప్రతిరథ: ప్రద్యుమ్నో ఽ మితవిక్రమ:”

“బామ్మా..ఇందాక స్కూల్ నించి వస్తుంటే..ఒక పెద్ద క్రేన్ చూశాను. ఒక అబ్బాయి దాని మీద కూర్చుని ఎంతో పైకి వెళ్లి వీధి దీపాల్లో బల్బులు మారుస్తున్నాడు. గాలిలో తేలుతున్న అతన్ని చూడటానికి భలే తమాషాగా ఉంది. మనం కూడా అలా వెళ్ళచ్చా” అని అడిగాడు వాసు.
“అంతేనా.. మొన్న మేము ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు పెద్ద జెయింట్ వీల్ ఎక్కాము. అక్కడి నించి చూస్తే చుట్టు పక్కల జనాలందరూ చీమల్లాగా కనిపించారు” అన్నాడు హరి.
“ఇవ్వాళ అలాంటి శ్లోకాలు నేర్చుకుందాం” అని బామ్మ మొదలుపెట్టి.. “ఉదీర్ణ: సర్వత: శ్చక్షు” అంటే..ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆ శ్రీమన్నారాయణుడు అలా ఆ క్రేన్ మీద, జయింట్ వీల్ మీద కూర్చున్నవాళ్ల కంటే చాలా ఉన్నతంగా పై నించి లోకాలన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. అంత ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయన అన్నివైపులా తన దృష్టిని ప్రసరించగలడు. అలా ప్రసరించి చూడగలిగిన ఆయనకంటే ఉన్నతమైన వాడు కానీ, ఆయనకి పైన వేరే అధికారి కానీ ఉండడు. ఆయనే సర్వోత్తముడు, సర్వాధికారి, సర్వేశ్వరుడు అన్నమాట తెలిసిందా? అంతేకాదు ఆయన శాశ్వతంగా, స్థిరంగా ఉంటాడు. లోకాలన్నీ నశించినా తాను నశించడు.”
“శ్రీరామావతారంలో, మహారాజకుమారుడు అయి ఉండి కూడా..పదునాలుగేళ్ల వనవాసంలో ఏ తల్పాలు, భోగాలు లేకుండా ఎన్నో సార్లు భూమి మీద శయనించాడు. అంతేకాదు.. సీతని అపహరించిన రావణునితో యుద్ధం చెయ్యటానికి లంకకి వెళ్ళటం కోసం సముద్రం మీద సేతువు కట్టవలసి వచ్చింది. అలా సేతు నిర్మాణం జరిగే సమయంలో ఆయన, సముద్రపు ఒడ్డున భూమిమీద శయనించాడు. అంటే..ఎంతటి వారికైనా అవసరాన్నిబట్టి హెచ్చుతగ్గులు, సర్దుబాటు తప్పదు అని ఆ అవతార సమయంలో ఎన్నోసార్లు ఆయన చేసి, చూపించాడు.”
“శ్రీమహావిష్ణువు ఎన్నో ఆభరణాలను, భూషణాలను ధరించి..ఆనందమే తన స్వరూపంగా సుందరంగా, శుభంకరంగా ఉండటమే కాక.. ఎప్పుడు నిలకడ లేకుండా తిరిగే మన మనసుని చక్రం రూపంగా, నిలకడైన బుద్ధిని గద రూపంగా ప్రతీకాత్మకంగా ఆయన తన ఆయుధాలుగా ధరించి ఉంటాడు అని నిన్న చెప్పుకున్నాం కదా! అంతే కాదు ప్రతి జీవరాశిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రతిభగా సృష్టి అంతా చైతన్య రూపంలో విరాజిల్లుతూ ఉంటాడు.”
“అలాంటి ఆ పరమాత్మకి మనకి ఉన్నట్టు శోకం, మోహం అనేవి ఉండవు. నిరాశ, అసంతృప్తి అనేవి అసలే ఉండవు. ఆయన నిత్యానంద స్వరూపుడు. అంతేకాదు..ఆయనని స్మరించేవారికి కూడా శోకం, మోహం లేకుండా చేస్తాడు.”
“ఆయన అగ్ని రూపంగా జ్వాలలని, సూర్య చంద్ర రూపంగా తన కిరణాలని లోకంలో ప్రసరింపజేస్తూ ఉంటాడు. అందుకే ఆయనని “అర్చిష్మాన్” అని విశేషమైన నామంతో చెబుతారు. అందరి చేత పూజింపబడే బ్రహ్మ దేవుడు, సర్వ దేవతలు కూడా స్వయంగా ఆ దేవదేవుడైన శ్రీమహావిష్ణువును అర్చిస్తారు. ఒక కుండ నీటిని పట్టి ఉంచినట్లు ..ఆ శ్రీమహావిష్ణువు సమస్త లోకాలని తనలో పట్టి ఉంచుతాడు. అందుకే ఆయనని ‘కుంభో’ అని చెబుతారు.
“మాయని కలిగించే సత్వరజస్తమో గుణాలనే మూడు గుణాలకి అతీతుడైన ఆ శ్రీమహావిష్ణువు మాటలకి అతీతుడు. పరిశుద్ధమైన, శాశ్వతమైన ఆత్మ స్వరూపం. అలాంటి పరిశుద్ధమైన పరమాత్మ..తప్పులు చేసే వారి పాపాలని..ఆయన నామ స్మరణ మాత్రం చేతనే పరిశుద్ధులని చేస్తాడు.”
“ఆ శ్రీమహావిష్ణువు నాలుగు రకాలుగా ఈ లోకంలో విస్తరించి ఉంటాడు. ఆ నాలుగు ఏమిటంటే..
‘వాసుదేవ’ రూపంగా హృదయాలలో ఆత్మగా నివసించేవాడు..
స్త్రీ పురుష ఆకర్షణ కలిగించి సృష్టి విస్తరించటానికి ‘ప్రద్యుమ్న’ రూపంగా మనసులో ఉండేవాడు..
దేవకీ గర్భం నించి విచ్ఛిన్నం చెయ్యబడి తిరిగి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడినవాడు అయిన ‘సంకర్షణుడు’, శత్రువులని తనవైపుకి బలంగా ఆకర్షించేవాడు, బలమైన నాగలితో భూమిని చీల్చి పునఃసృష్టి కోసం తిరిగి దగ్గరకి చేర్చేవాడు, బలానికి, కరుణకి ప్రతిరూపమైన వాడు అయిన బలరామ రూపంగా ఉండేవాడు అయిన ఆ శ్రీమహావిష్ణువుని ఎదిరించి యుద్ధంలో ఎవరు ఆయనని జయించలేరు. ఆయనకి ప్రతి రథుడు అంటూ ఎవరు లేరు. ఎవరి చేతా జయింపబడని వాడు, అజేయుడు అయిన ‘అనిరుద్ధ’ స్వరూపంగా ఉంటాడు.
అందుకే ఆయనని ‘అనిరుద్ధో ఽ ప్రతిరథ: ప్రద్యుమ్నో ఽ మితవిక్రమ:’ అంటారు. తెలిసిందా” అని ఆ రోజు పాఠం చాలించింది.
కామెంట్‌లు