'అక్షయ' అంటే అర్థం. ఈరోజు చేసే జప, హోమ, దానాలు, అక్షయం అవుతాయి అంటే క్షయం లేకుండా శాశ్వత ఫలితం ఇస్తాయి అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు. అక్షయమైన సౌభాగ్యాన్ని అక్షయమైన విజయాల్నీ అక్షయమైన దైవ కటాక్షాన్నీ ప్రసాదిస్తుంది కాబట్టే వైశాఖ శుద్ధ తదియను 'అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు. అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యుగాల్లో మొదటిది కృత. ధర్మం నాలుగు పాదాలా నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట నేలను ఓ అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట: ప్రతీదీ అక్షయంగా అందుబాటులో ఉండేదట: పరశు రామావతారం ప్రారంభమైందీ ఈరోజేనంటారు. కుబేరుడికి శంఖనిధి, పద్మనిధి పేరుతో... అనంతమైన సిరిసంపదలు దొరికిన రోజు ఇదే. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయ మైన సంపదల్ని పొందిన రోజు ఇదే. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయబోతుంటే... శ్రీకృష్ణపరమాత్మ అక్షయ మైన వస్త్రసంపదను ప్రసాదించిన రోజు ఇదే. వనవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు ఇదే. ఈనాటి బదరీ నారాయణ మందిరా ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెరుతురు అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండియుండి రమ్య గోచరమైన ఈ వృషీకేషము భక్తులచే కిటకిటలాడుచు పూజాదికాలు ప్రారంభమగును. క్షీరసాగరమథనం తర్వాత... లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజూ ఇదే! కాబట్టే, అక్షయ తృతీయ నాడు... రాహుకాలాలూ వర్జ్యాలూ వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! ఉత్తరాదిలో గృహప్రవేశాలూ, వ్యాపార ప్రారంభాలూ, అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టుకుంటారు.
పురాణ ప్రశస్తి...
మత్స్యపురాణంలో పరమేశ్వరుడు పార్వతీ దేవికి అక్షయ తృతీయ వ్రత ప్రాశస్త్యాన్ని వివరిస్తాడు. అక్షయుడైన విష్ణుమూర్తే ఈ వ్రతానికి అధినాయకుడు. క్లుప్తంగా చెప్పాలంటే .. సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానం చేసి, భక్తితో స్వామిని పూజించి అక్షతలు నెత్తిన చల్లుకుని, శక్తిమేర దానధర్మాలు చేస్తారు. కొత్తబిందెలో పానకాలు పంచుతారు. 'ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది. అశ్వమేధయాగాన్ని నిర్వహించినంత పుణ్యం అని ఫలసృతిని వివరిస్తాడు శివుడు అక్షయ తృతీయ రోజు పితృదేవతల్లి ఆరాధించే సంప్రదాయమూ ఉంది.లక్ష్మీ పూజలు నిర్వహిస్తారు గో సేవ చేస్తారు.
పూర్వం ఓ వ్యాపారి, పరమ ధర్మపరాయణుడు. తీవ్ర నష్టాల్లో చిక్కుకు న్నాడు. అయినా, తన సత్య మార్గాన్ని వీడలేదు. ఆ కష్టాల నుంచి బయటపడటం ఎలాగో అర్ధంకాక,ఓ పురోహితుడిని ఆశ్రయించాడు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు స్వల్ప దానమైనను అక్షయ ఫలితము ఇస్తుంది అని చెప్పగా ఆయన సలహా ప్రకారం, గంగా నదిలో స్నానం చేసి శ్రద్ధగా అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించాడు. ఆ ప్రభావంతో పోయిన సంపదలన్నీ అక్షయ మగుటే కానీ తరుగలేదట... అన్నీ తిరిగొచ్చాయి. మరు జన్మలో కుశావత నగరానికి రాజుగా పుట్టాడు.అక్షయతృతీయకు సంబంధించిన పురాణ గాథ ఇది.
అక్షయం అంటే నాశం లేకపోవడం, దినదినాభివృద్ధి చెందడం కూడా. ఆరోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని ఒక నమ్మకం మాత్రమే. అది పూర్వకాలం మరి ఈ ఆధునిక యుగంలో బంగారాన్ని కొనాలంటే లక్షల్లో లక్ష్మీదేవి తాండవం చేస్తోంది. తప్పనిసరి బంగారం కొనాలి అని శాస్త్రం చెప్పలేదు. ఇది సాకుగా తీసుకొని వ్యాపారులు బాగుపడాలనే తలంపుతో అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టం కలసి వస్తోందని వ్యాపార ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.
స్థోమత ఉంటే నగానట్రా కొనొచ్చు. కానీ అప్పులుచేసి కొంటే మాత్రం తిప్పలే ! సకాలంలో తీర్చకపోతే... రుణాలూ అక్షయమౌతాయి! ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆడంబరాలకు పోకండి ! అప్పుల పాలు కాకండి !! బంగారం కొనగలిగే శక్తి లేకపోతే,వెండికొన్నా మంచిదేనని చెప్పారు. ఇప్పుడు వెండి కూడా కొనే పరిస్థితి లేదు... అందుకే.అదీ కొనలేమనుకుంటే, ఉప్పు కొన్నా ఫర్వాలేదట ! లవణంలోనూ లక్ష్మీదేవి ఉంటుంది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసరాల్ని కొనడమూ శుభసూచకమేనంటారు. వెండీ బంగారాల మాటెలా ఉన్నా, అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచినీ అక్షయం చేసుకోవచ్చు. అసలే వేసవికాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పదిమంది గొంతు తడపొచ్చు.సేవా కార్యక్రమాల ద్వారా మంచిని అక్షయం చేసుకోవడానికి కూడా ఇదే మంచి తరుణం.
====================================================================
" ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
" సాహితీ శిరోమణి "
'' కావ్యసుధ " 9247313488
హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి