శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- భాగం - 93
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
72.భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా 
(షోడశాక్షరీ)
73.నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా 
(షోడశాక్షరీ)
డెబ్బై మూడవ నామ మంత్రము - 
  ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః
"కామేశ్వరి" మొదలు "చిత్రా" వరకు ఉన్న తిథి దేవతలు 15మందీ భండాసురుని సంహారానికి బయలుదేరిన శక్తి సేనలు. ఆ శక్తి సేనల వీరవిహరాన్ని చూస్తూ సంతోషిస్తున్న పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా" అని కొనియాడారు. ఆవిధంగా శక్తి సేనల ప్రతాపాన్ని చూస్తూ సంతోషిస్తున్న లలితా పరాభట్టారికకు నమస్కారము.
నిత్యా దేవతలు 15మంది. 16వ నిత్యయే "మహానిత్య". ఈమేయే పూర్ణామృత, సాక్షాత్తు లలితా పరమేశ్వరి.
భండాసురుడు, అతని సైన్యధిపతులు, మంత్రులు, సేన అందరూ కూడా అజ్నానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతూ... రాత్రి వేళల్లో మాత్రమే వారి ప్రతాపాన్ని చూపించుతారు. శ్రీమాత సేనలో ఉన్న అగ్నిస్వరూపులైన "జ్వాలా స్వరూపిణి", "వహ్నివాహిని" అనే నిత్యలు వారి ప్రకాశంతో అమావాస్య చిమ్మ చీకటిలో కూడా భండాసురుని సేనలను గుర్తిస్తూ ఉంటే, చీకట్లు తొలగి సూర్యోదయానికి ముందు అందరు రాక్షసులు సంహరింపబడతారు. ఇంతటి పరాక్రమాన్ని చూసిన జగన్మాత సంతోషాంతరంగిత అవుతుంది.
నిత్య దేవతలు 15మంది శక్తులూ, శుక్ల పక్ష చంద్రకళల లాగా ఎదుగుతూ, కృష్ణ పక్షంలో తగ్గుతూ వుంటాయి. కానీ, శుక్ల, కృష్ణ పక్షాలలో అష్టమి నాడు "త్వరితా" అనే నిత్యగా ఒకే విధమైన శక్తిని, కాంతినీ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ అష్టమి నాటి "త్వరితా" నిత్య ప్రసరించే కాంతులతో, అమ్మ పరాభట్టారిక ముఖ చంద్రబింబము శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది.
"ధమనక, దీర్ఘ జిహ్వ.....చంద్రగుప్త" అనే 15మంది భండాసురుని సైన్యాధిపతుల నిరీక్షణ లో యుద్ధోన్ముఖులైన సైన్యాలను, వారి సేనాధిపతులను, చివరికి భండాసురుని కూడా 15మంది నిత్యలూ ఊపిరి సలపకుండా చేస్తూ , యుద్ధంలో సౌర్యప్రతాపాలు చూపిస్తున్నప్పుడు సంతోషపడుతున్న శ్రీమాత ను పూజించేటప్పుడు 
ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు