పరశురాముని జన్మదిన సందర్భం
-------------------
భగవాన్ విష్ణుమూర్తి ఆరవ అవతారముగా త్రేతా, ద్వాపర, కలి యుగాలలో సాక్షాత్కరించి, తదుపరి మన్వంతరంలో సప్తర్షులలో ఒకరిగా భాసిల్లబోవు పరశురాముడు, భార్గవ రామునిగా ఖ్యాతినొందగా, అతని జన్మదినాన్ని హైందవజాతి భక్తి శ్రద్ధలతో పూజించి, సంబరాలు జరుపుకుంటారు.
ఈ అవతార పురుషుని జననమే ఓ విశేషమైతే, అతని జీవితంలో ఉత్కంఠ భరితంగా సాగే సంఘటనలెన్నో ఉన్నాయి.
మహర్షియైన ఋచీకుడు గాధి మహారాజు కుమార్తె సత్యవతిని వరించి, గాధి మహారాజు షరతు ప్రకారం నున్నటి శరీరంతో నల్లని చెవులు గల సహస్ర అశ్వాలను వరుణుని ఆశీస్సులతో సేకరించి మహారాజుకు కానుకగా సమర్పించి సత్యవతిని వివామాడాడు. సత్యవతి, తనకు తన తల్లికి పుత్ర సంతానం కావాలని కోరగా ఋచీకుడు యాగఫలం, ముని, రాజపుత్ర ప్రసాద రూపంలో సత్యవతికి అందజేసాడు. అయితే, సత్యవతి పొరపాటున రాజపుత్ర ప్రసాదం తాను స్వీకరించి, తల్లికి మునిపుత్ర ప్రసాదం అందజేయడంతో, విషయాన్ని తెలుసుకున్న ఋచీకుడు కుమారుని మారుగా మనుమనిగా రాజపుత్రడు జన్మించాలని తపోశక్తితో పొరపాటును సరిచేస్తాడు. వీరి కుమారుడు జమదగ్ని ఐదవ సంతానంగా భార్గవ రాముడు జన్మిస్తాడు. గాధీ మహారాజుకు ముని పుత్ర ప్రసాద ఫలితంగా విశ్వామిత్రుడు జన్మించాడు.
జమదగ్ని, రేణుక దంపతుల పుత్రుడు అస్త్ర, శస్త్ర విద్యలన్నీ నేర్పి, ఘోర తపమాచరించి శివుని ఆశీస్సులతో పాటు పరుశువు (మహిమాన్విత గొడ్డలి) ను ఆయుధంగా పొందాడు.
శాపఫలితంగా చేతులు లేకుండా జనించిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని వరంతో సహస్ర బాహువులతో మహా బలశాలిగా రాజ్యాన్ని పాలించాడు. ఓ సారి జమదగ్ని ఆశ్రమానికి వచ్చిన కార్తవీర్యార్జునుని పంచ బక్ష్యాలతో ఆతిధ్యం ఇచ్చాడు. ఆశ్రమంలో ఈ ఆతిథ్యానికి కారణం కామధేనువు సంతాన గోవని తెలుసుకున్న రాజు, ఆ గోవు కావాలని కోరడం, జమదగ్ని తిరస్కరించడం, రాజు గోవును బలాత్కారంగా తన రాజ్యానికి తీసుకుని పోయాడు.
తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా పరశురాముడు వెంటనే కార్తవీర్యార్జునునితో జరిపిన భీకరపోరులో ఆయన సహస్ర బాహువులను తెగనరికి సంహరించాడు. కొంతకాలానికి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని ఆశ్రమంలో ఆయనను సంహరించి జమదగ్ని శిరస్సు తీసుకుని పోయారు. ఆశ్రమానికి వచ్చిన పరశురాముని సమక్షంలో తల్లి రేణుక 21 సార్లు గుండెలు బాదుకుని ఏడవడంతో, ఆయన తండ్రిని చెందిన వారిని సంహరించి, తండ్రి తల తెచ్చి మొండేనికి అతికించి తపఃశక్తితో జీవం పోసాడు. 21 సార్లు దండెత్తి
భూమిపై గల రాజులందరినీ సంహరించాడు. శ్యమంతక పంచమనే ఐదు సరస్సులో చంపిన రాజుల రక్తంతో నింపి తల్లిదండ్రులకు తర్పణాలు వదిలాడు. గోమందలు, కొండ కోనల్లో దాక్కుని కొందరు రాజులు బ్రతికారు. తాను స్వాధీనం చేసుకున్న భూమినంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చిన పరశురాముడు పశ్చిమ సముద్రంలో తన గొడ్డలిని విసిరివేయగా సముద్రుడు వెనక్కి తగ్గిన ఆయనకు కొంత భూభాగాన్ని ఏర్పాటుచేసినట్లు, దీనినే కేరళ (దేవ భూమి) గా భావిస్తారు. కానీ, పరశురాముడు మహేంద్ర గిరులపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.
ద్వాపరయుగంలో శ్రీరాముడు సీతామాత స్వయంవరంలో శివధనస్సు ఎక్కుపెట్టి ఇరవడాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన పరశురామునికి శ్రీరామునిలో విష్ణుమూర్తి సాక్షాత్కరించడంతో తన ధనుస్సు, తపోశక్తులను శ్రీరామునికి దారాదత్తం చేసి వెనుదిరిగాడు.
ద్వాపరయుగంలో గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునితో పాటు కర్ణుడు, ద్రోణాచార్యులకు గురువుగా వచయవహరించిన పరశురాముడు కలికాలంలో కల్కి భగవానునకు కూడా విద్యాభ్యాసం చేస్తారనేది పురాణాల సారాంశం.
==============================================
చౌధరి రాధాకృష్ణ, -9441451781- ఆద్యాత్మిక విశ్లేషకులు,
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత,
శ్రీకాకుళం.
వైశాఖశుద్ధ తదియ (అక్షయ తృతీయ) : - చౌధరి రాధాకృష్ణ, -9441451781-
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి