ఏం మనుషులు?: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత- సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
ఏం మనుషులు వీరివి ఏం మనసులు
చెడ్డ పనులు చేసేటి దొడ్డ మనుషులు
వీరు ఎంత చెప్పినా అసలు వినరు
వారు ఏమాత్రం సిసలైన దారిని కనరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
తెగ కోతలు కోసేటి ఈ కోతి మనుషులు
కొంపకు నిప్పు పెట్టి చుట్టలు ముట్టిస్తరు
చంపకు చుక్కెట్టి జేబులు కొట్టేస్తరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
ఓట్ల సీట్లకై పోటీ చేయు పోకిరి మనుషులు
నెట్ల గట్ల గుండా నోట్లు పంచుతుంటరు
గెలిచిన పిమ్మట వారు కోట్లు దండుకుంటరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
లాయర్లైన కొందరు లయైరు మనుషులు
కోర్టులో అన్యాయానికి హాజరు వేస్తుంటరు
రికార్డుగా న్యాయంకై గైర్హాజరు మోస్తుంటరు !

ఏం మనుషులు వీరివి ఏం మనసులు
రౌడీలైనా కొందరు దౌర్జన్యం మనుషులు
మానవత్వాన్ని మంట కలుపుతున్నరు
దానవత్వాన్ని వారు ఇంట నిలుపుతున్నరు !


కామెంట్‌లు