అవును,ప్రవాహ సంభాషణే సాహిత్యం: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871

 సృష్టిలో ప్రతిదీ సృజనాత్మకం కళాత్మకమే ధవళ కాంతిలా.ఏ రంగూ అంటనంతవరకు స్వచ్ఛమే. కానీ వివర్ణ ఆవర్ణాలే రంగుల కల గొప్ప కళ కూడా.ఆ కలయికలో పరుచుకున్పదే అందమైన హరివిల్లు.లేదా సప్తవర్ణాల సంయోగమే తెల్లని కాంతి రేఖ.అదే సంభాషణే సాహిత్య రూపసి.ఇంకా లోతుకెళితే బహుళదళ విత్తన ప్రశ్నలకు స్పందించిన జవాబుల చెమ్మ చెలిమి మహావృక్షం. నిజానికి ఇది ఏ వాదంలోకి దూరని,ఎవరికీ అందని అంతుబట్టని ఓ కొత్త బాట. సాహిత్యంలో కొత్త చిగురాకుల మారాకుతొడిగే స్నేహ సుమాల అక్షర వేదికపై ఓ సాహిత్య గురువుకు ప్రశ్నల అలంకరణ అభిభాషణ.అందరం మనం బడినుండే ఇక్కడిదాకా వచ్చాం.  అయితే ఆ బడిని నెమరేసుకోవడం,ఆ గురువులను గౌరవించుకోవడం కొత్తేం కాదు కానీ ఎంచుకున్న పద్దతి తీరుతెన్నే కళాత్మకం అందులో పుట్టిన స్పృహ గొప్ప సృజనాత్మకం. విజయవంతమైన కొత్త తొవ్వ ఆలోచన అంతరంగమిది.   
తరతరాలుగా సాహిత్యనది నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది.ఇది పురాణేతిహాసాల నుండి కావ్యప్రబంధాల వరకూ పద్యం గద్యం వాహికలుగా మౌఖికం నుండి లిఖిత రూపం దాకా నిత్య చలనం...కొత్త సంచలనం. 'వాక్యమే' కావ్యమవుతున్న నేపథ్యంలో నిన్నటిదాకా లేఖాసాహిత్యం  ప్రవహిస్తే, ఇప్పుడు వారాల ఆనంద్ సంభాషణ సాహిత్యం కూడా ఆ నది ట్రిబ్యుటరీగా వచ్చిచేరింది.ఆహ్వానిద్దాం.
'నాలోకి నేను' చూసుకునేలా తన ముందు విద్యార్థులు వారిముందు తను కవిగా ఆనంద్ నిలబడి తన బడియాదిని వర్తమానంలోకి దించి "ప్రశ్న జవాబు"లతో వేదికగా కార్ఖానాగడ్డ పాఠశాల విద్యార్థుల స్పందన పంచుకోవడం కొంత ఉత్సాహాన్నీ మరికొంత సేదదీరటాన్నీ పంచిందంటారు. It's really an undefined thrill to anybody and everybody.సాహిత్య విలువలు, సాహిత్య ప్రేరణతో విద్యార్థుల్లో గల సాహిత్య వాసన,రుచిని అంచనా వేయడంకన్నా చదువు అంటే ఏమిటీ,ఏలా ఉంటుందో గొప్పగా వివరించడం ఒక కొత్త ఉద్యమంగా చెప్పుకోవచ్చు.కవి ఆనంద్ దృష్టిలో  చదువు ఒక కాంతి,జీర్ణం అంటే అరిగించుకోవడం ఒక గమ్యం,అంతర్ముఖం కలిసి మనసును మార్చే ప్రయాణం అనీ,పుస్తకం చెప్పే కథను హృదయం గ్రహిస్తే,జీవితం దానిని నిలబెడుతుందని కవి విశ్వాసం.పదం ఒకటి కనపడితే మనసు కిటికీ తెరుచుకుంటుందని అదే చదువు (రీడ్),జీర్ణం(డైజెస్ట్),శోషణము (ఎసిమిలేట్) అంటూ RDA థీరీని ప్రయోగంలా చూపడం కవి అనుభవ సూక్తి..ఇక "చదువడం అనేది మనసుకు స్వేచ్ఛ,ఆత్మకు విముక్తి.చదువడంచేత మనిషి బంధనాలను,పరిమితులను, పీడనలను అధిగమించి కొత్త ఆలోచనల లోకంలోకి అడుగిడుతాడు. అది వ్యక్తిగత విముక్తి మాత్రమే కాక సమాజ విముక్తికీ పునాదిగా నిలుస్తుంది. చదివిన ప్రతి అక్షరం బంధాల గోడలు కూల్చి స్వేచ్ఛవైపు నడిపే తలపవుతుంది"అంటారు అంతర్ముఖుడైన కవి వారాల ఆనంద్.
విద్యార్థులతో ముఖాముఖిలో సాహిత్య,వ్యక్తిగత,పాఠశాలకు సంబందించిన ప్రశ్నల త్రివేణిగా తెలుగు లో సాగిన సమయం ఆసాంతం కవి వారాల ఆనంద్ పంచుకొన్న ఆత్మీయ తాత్విక జవాబుల సుమమాలగా ఉంది. మీరు రచన మొదలుపెట్టడానికి ప్రేరణ ఏది? అనే ప్రశ్నకు "వాతావరణంలేని ఇంట్లో హిందీ ఉర్దూ బాగా తెలిసిన నాన్న,పెద్దలుండడంతో హిందీ సినిమా పాటలు,సినీ వాతావరణం ఉండేదని విద్యార్థుల ప్రశ్నకు  కవి ఆనంద్ జవాబిస్తారు.ఇంకో ప్రశ్న”మీ చిన్ననాటి కలలు ఏమిటి? అవి ఎలా మారాయి?”అంటే ఇదమిద్ధంగా కలలు అంటూ ఏమీ లేవు కాని మంచి పాట విన్నప్పుడు గాయకుడిని కావాలని,హిందీలో ‘ఆనంద్’ లాంటి సినిమా చూసినప్పుడు రాజేష్ ఖన్నా లాగా కావాలని అట్లా ఏవో ఉండేవి కానీ అవేవీ కాకుండా ఇట్లా నాలుగు అక్షరాలూ రాస్తూ సృజనకరుడిగా మిగిలిపోయాను. నిజానికి కలలు లేకుండా జీవితం లేదు . కలల్ని సాకారం చేసుకోవడమే జీవితం. అట్లని కలలు కంటూ కూర్చొంటే మాత్రం ఏమీ సాధించలేము. కృషి స్పష్టత నిబద్ధతలు కావాలి. స్వార్థరహితంగా అవసరమయిన దానికంటే అధికంగా ఏమీ ఆశించకుండా వుండగలిగితే ఎంతో సాధించవచ్చు” అంటారు ఆనంద్ .   మరో ప్రశ్న మీరు మళ్ళీ ఒకరోజు విద్యార్థిగా ఈ పాఠశాలలో చదువగలిగితే ఎలాంటి అనుభూతి కలిగిస్తుందని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు ఎగిరిగంతేసే పిల్లాడిలా "మళ్ళీ  విద్యార్థిలా చదువడమనే భావనే గొప్పగా ఉంది.మధురంగా ఉంది.నిజానికి పిల్లాడినయి పలకా బలపంతో సంచీ భుజాన వేసుకొని స్కూల్ కు రాగలిగితే..ఓహ్ అదా పునర్జీవితమే"అంటారు ఆయన.ఆనంద్ 'త్రివేణి' త్రిపద కావ్యాన్ని ఆవిష్కరించింది తను చదివిన స్కూల్ అధ్యాపకులు శ్రీ ఉడుత రాజేశం గారు, ఆ సందర్భంలో జరిగిన సంభాషణే  ప్రస్తుత రచనకు బీజం. నాలుగు వ్యాసాలూ  త్రివేణి కవిత్వంపై  రాసినవి పుస్తకంలో మరో హైలైట్. అందులో నాది  "వారాల ఆనంద్ తాత్విక కవిత్వం త్రివేణి" ఉండడం కొసమెరుపు. కవి ఆనంద్ కు అభినందనలు, ధన్యవాదాలు.   

కామెంట్‌లు