"ఉన్మాదమే యుద్ధ ద్వారం" : - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
నిన్నూ నన్నూ భయపెట్టే
అల్లకల్లోల సముద్రం
నిలబడ్డ నిట్టనిలువు జీవి
అమాంతం నేల రాలిన శవాల గుట్టలు 
అదో బలిపీఠం,మారణ రణరంగం

అనివార్యం కాని వేళ 
ఎప్పుడైనా ఎక్కడైనా
తలకెక్కిన మత్తు మందు యుద్ధం
రెండు బలమైన చేతుల కొట్లాట
గాయపడ్డ ఊపిరి,మాటరాని పిల్లాజెల్ల బతుకు దుఃఖం
ఉన్మాదమే యుద్ధ ద్వారం సృష్టిలో...

ఇక్కడ ఎవరి యావ వారిది
వారి వారి అహమే మిస్సైళ్ళుగా ఎగిరింది 
ప్రపంచం శవాల వాసనలో
రక్తమోడిన నేల పూడ్చలేని గాధలు 
మృత్యు కోరల చిక్కిన గోరీలు 

మనసు లేని రాతి అహంకారం
ఆయుధాల ఉన్మాద దళారి దాహం!
అధికారం కమ్మిన అహంభావ పేలుడు
ఆ అరుపు ఓ విచిత్ర నియంత గూడు!!
ఆయుధాల విస్ఫోటన యుద్ధమే మనిషీ మరుభూమి 

అయినా, చరిత్రలో
ఏ యుద్ధోన్మాది మిగిల్చె ఆ ఇంటావిడ  
నుదుటి బొట్టు మెరుపులు,గలగలల చేతి గాజులు 

శాంతి పావురం అటూ ఇటూ 
ఎగిరే  ప్రపంచ సంయమనమే
మనిషినీ ప్రకృతిని 
కాపాడే సజీవ మహా కావ్యం ఎప్పుడూ...


కామెంట్‌లు