సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -189; ఆర్నెల్లు పుట్టింట్లె ఉంటే ఆడబాప కంటే అన్నేలం
***
"ఇగ్గో అవ్వా! గీ సంగతి యిన్నవా? అనసూయమ్మొదినె కోడలు ఏరు కాపురం బెట్టేదనుక నేను రాను అన్కుంట ఇంట్లె లొల్లి లొల్లి జేసి వాళ్ళమ్మోళ్ళింటికి ఎల్లింది తెల్సుగద!"
 ఆఁ ఆఁ తెల్సు శెల్లే! అనసూయమ్మంటి అత్త దొర్కడం దానదృట్టం. కోడలు సద్వుకుంట, ఉజ్జోగం ఎలగ బెడ్త అంటే కూసబెట్టి కన్న తల్లొతికి వొండీ పెట్టి సంబాళిచ్చింది. గస్మంటి అత్తని వదిలేసి ఇంకా బాగ సుఖపడ్దామని మొగుడితో దినాం ఏరు కాపురం బెడ్దమని రసరస రుసరుసేనట. గా పోరడికి గట్ల బోవుడు ఇష్టం లేక మూగిమొద్దులా ఒకటనకుండ,రెండనకుండ ఉంటే 'నీకు  నీ అమ్మ మాటే ఏదం. నామాటిని ఏరు కాప్రం పెట్టేదనుక నేన్రాను' అన్కుంట పుట్టింటికి బోయింది గద!
 "అవునవ్వా గదందర్కీ తెల్శిందే గని, ఓ నాకేంది నన్ను  సూస్కునేటందుకు అమ్మగారోళ్ళుండ్రు  అన్కుంట మొగున్ని ఎకర్దిచ్చి పొయ్యింది గద!"
 అవును శెల్లే! "గిప్పుడేమయింది.యిడాకుల కాయితాలు గిట్ల పంపిందా ఏంటి పొల్ల ?గీ కాలం పొల్లగాండ్లకి ఆలోచన తక్వ - ఆవేశం ఎక్వ. పచ్చని కాపురాన్ని బుగ్గి జేస్కుంటదా ఏంది? గా పోరి అమ్మ నాయినైనా నచ్చజెప్పి కాప్రానికి బంపాలె గదా! గాళ్ళెం మడుసులు పెండ్లయిన పొల్ల మొగున్నొదిలి ఇంటిమీదుంటే గాళ్ళకి ఎట్ల నిదర పడ్తుందో ఏమో మరి."
 "అవుగని అవ్వా! గాళ్ళు సుత నయాన బయాన నచ్చజెప్పిండ్రంట. శేజేతుల సంసారాన్ని ఆగమాగం జేస్కుంటుందని బాదవడ్డరంట.'
 పడరా మరి శెల్లే! అంగరంగ వైభోగంగ లగ్గం చేసిండ్రు! అల్లుడేమో గని గీ పొల్లనే ఇంట్లె కొత్తగున్నయని ఏది కనిపిత్తె అది సుట్టుకోటమేనా? ఏరు కాప్రానికి బనికొత్తయి అన్కుంట దాసుకొనుడట. గదేమన్న మంచి పద్దతేనా?జెర శెప్ఫు శెల్లె!"
 అవునవ్వా! గవన్ని శకలు జూసే అన్న వొదినలు సూటిపోటి మాటలన బట్టిండ్రంట? అమ్మ నాయినకు జెప్తే మేమేం జెయ్యం. ఇంట్లె అన్నొదిలన్నరనీ బాదవడ్తున్నవ్ గని బైట లోకం కోడై కూత్తుంది. గందుకే మీ నాయన నీవల్ల బైటికెళ్ళకుండ ఇంట్లెనే ఉంటున్నడని అందట".
అమ్మ సుత గట్లనే అనే తల్కి అత్త ,మొగుని మంచితనం తెల్శొచ్చినట్టుంది.
అంతేగా శెల్లె? "ఆర్నెల్లు పుట్టింట్లె ఉంటే ఆడబాప కంటే అన్నేలంగుంటదని"  ఊకెనే అన్లే. గిప్పుడు తెల్సొచ్చిందా పొల్లకి?"
 
"అవునవ్వా! గింతకీ ఆడబాప అంటే ఏందవ్వా?" సమజవ్వలే జెర శెప్ఫు. "
గదేనే శెల్లే! ఎట్టి శాకిరి లెక్క పని జేసే మనిషి.కట్టు బాంచె లెక్క పొద్దత్తమానం  బాంచె శాకిరి  చెయ్యాల్సిందే గీ మాట ని శిల్లర దేవుళ్ళు నవల్లో దాశరథి రంగాచార్య గారు గీ ఆడబాప మాట ఉపయోగిచ్చిండు తెల్సా శెల్లె?.
గందుకేనా? అవ్వా! గా పొల్ల ఆళ్ళతో ఈళ్ళతో శెప్పి పంపుతోంది.తనని తోల్కబొమ్మని. "ఎట్ల బొయ్యిందో అట్లనే వత్తదీ నేను బోతే నాకు తలగొట్టేసినట్టుంటది అంటడట" అనసూయమ్మొదిన కొడుకు. ఇంగ ఏం జరుగుతుందో సూడాలె మరి.
 "ఏం జరుగుడేంది శెల్లే! రేపీపాటికి వొదినింట్లె ఉంటది సూడు!''
గదండీ సంగతి! "ఆర్నెల్లు పుట్టింట్లె ఉంటేె ఆడబాప కంటే ఆన్నేలం" అంటే గిదే మరి"

కామెంట్‌లు