పగ పట్టిన పగలు లక్షల నక్షత్రాలను
చూడకుండా చేసింది.
అందుకే అస్తమించి
కోట్ల నక్షత్రాలకు వెలుగునిచ్చింది.
అతడే నిన్నటి సూర్యుడు
నేటి నీలాకాశం.
హత్య చేయబడ్డ ఒక విత్తనం
మట్టి ఒడిలో గట్టిగా నిలబడ్డది.
పచ్చని చెట్టుగా పుట్టింది
పశువులకు రక్షణగా నిలబడ్డది
పక్షులకు కడుపు నింపింది.
సాక్ష్యం అతడే వృక్షం అతడే
బడుగు బలహీన వర్గాల మోక్షం అతడే!!
అమావాస్య చీకటిలో నిండు పున్నమి అతడు
మండే వెండి వెన్నెల అతడు
జాబిల్లి లా తెల్లని మల్లెలు అతడు
పేదల పల్లెల పరిమళం అతడు.
రంగు రుచి వాసన ఆకారం లేని నీరు అతడు
నీవు కోరిన రంగు రుచి వాసన ఆకారంలోకి మారే
మంచినీరు ఏరు అతడు కష్టజీవులకన్నీరు అతడు
నిరుపేదల మధి అతడు. మహానది అతడు.
ఎన్నమావులను నమ్మి
కొండల పిండి యమ్మి
ఎండిన గుండెలను పిండిన ఎదగని పేదల
బ్రతుకుల్లో బలమైన మెతుకు అతడు.
పువ్వు అతడు పుస్తకమతడు
పేదల పెదాలపై చిరునవ్వు అతడు
చిరంజీవి అతడు అతడే అంబేద్కర్.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునీ.
14/04/2026.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి